ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతుల ఆందోళన
రాయదుర్గం టౌన్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయకపోతే పంటలు సాగు చేయలేక తాము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ స్థానిక కణేకల్లు మార్గంలోని విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట పలువురు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో విద్యుత్ శాఖ ఏఈ బాలచంద్ర వేధింపులు భరించలేకపోతున్నామంటూ రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఎల్లప్ప, బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బొమ్మేష్, సురేష్ పెట్రోల్ బాటిల్ పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా నేటికీ ఇవ్వకుండా విద్యుత్‌శాఖ ఏఈ వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. తమకన్నా ఆలస్యంగా డీడీలు కట్టి దరఖాస్తు చేసుకున్న వారికి ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరవుతున్నాయన్నారు. విషయం తెలుసుకున్న ఏఈ బాలచంద్ర ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడారు. దుర్భాషలతో రెచ్చిపోయారు. విషయం తెలుసుకున్న సీఐ జయనాయక్ అక్కడకు చేరుకుని బాధిత రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేయించారు.
రౌడీషీటర్ మంజుల నవీన్‌పై కఠిన చర్యలు
పుట్లూరు: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నేర ప్రవృత్తిని కొనసాగించిన టీడీపీ నేత పొట్టి రవి ముఖ్య అనుచరుడు మంజుల నవీన్‌పై ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పుట్లూరు సీఐ సత్యబాబు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకూ పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన మంజుల నవీన్ 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. దీంతో 2023లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపామన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం నేరాలకు పాల్పడకుండా పుట్లూరు తహసీల్ధార్ ఎదుట బైండోవర్ చేయించినట్లు వివరించారు. అయినా అతనిలో మార్పు రాలేదని గత ఏడాది రెండు తీవ్రమైన నేరాల్లో పాలుపంచుకోవడంతో పీడీయాక్ట్ ఉల్లంఘన కింద రూ.50 వేలను తహసీల్దార్ వసూలు చేశారన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించే మంజుల నవీన్‌పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వామి, ఆవు, దూడ దగ్ధం
కూడేరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గడ్డివాములతో పాటు ఆవు, దూడ దగ్ధమయ్యాయి. వివరాలు.. కూడేరు మండలం పి.నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు చిన్న బొజ్జన్న వ్యవసాయంతో పాటు పాడి పోషణతో జీవనం సాగిస్తున్నాడు. తన దొడ్డి పక్కనే గుడిసె ఏర్పాటు చేసుకుని మూడు ఆవులు, దూడను కట్టేశాడు. మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడి గడ్డి వాములపై పడింది. చూస్తుండగానే మంటలు వ్యాపించి, పక్కనే ఉన్న పశువుల పాకనూ చుట్టుముట్టాయి. ఆ సమయంలో చిన్న బొజ్జన్న, ఆయన కుమారుడు పోతులయ్య ఇంటి వద్ద లేరు. విషయాన్ని గుర్తించిన సమీపంలోని మరో రైతు విజయభాస్కర్ వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించి, పశువుల పాకలోని రెండు ఆవులను తప్పించాడు. ఈలోపు మంటలు మరింత చెలరేగడంతో బయటకు పరుగు తీశాడు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు మూడు గడ్డి వాములతో పాటు పశువల పాకలోని ఆవు, దూడ కాలి బూడిదయ్యాయి. ఘటనతో రూ. 2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.
యూపీ వాసి ఆత్మహత్య
గార్లదిన్నె: స్థానిక జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం కిందపడి యూపీ వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్‌కుమార్ (33), కుమార్ పాల్.. పార్శిల్ లారీలో లగేజీ తీసుకుని హర్యానా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. సోమవారం రాత్రి శింగనమల మండలం లోలూరు క్రాస్ వద్దకు చేరుకోగానే లారీ బ్రేక్ డౌన్ అయింది. దీంతో లారీని రోడ్డు పక్కన ఆపేశారు. అర్ధరాత్రి సమయంలో రాజేష్ కుమార్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుమార్‌పాల్ వెంటనే డయల్ 100కు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. తెల్లవారుజామున తిమ్మంపేట సమీపంలో గుర్తు తెలియని వాహనం కింద పడి ఓ యువకుడు మృతి చెందినట్లుగా తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాజేష్‌కుమార్‌గా నిర్ధారించుకున్న అనంతరం మృతదేహాన్ని అనంతపురంలోని సర్వజనాస్పత్రి మార్చురీకి తరలించారు. జీవితంపై విరక్తితో గుర్తు తెలియని వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతుల ఆందోళన


