పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దండి
● కేజీబీవీ ప్రిన్సిపాళ్ల శిక్షణ ప్రారంభంలో డీవైఈఓలు మల్లారెడ్డి, శ్రీనివాసరావు
అనంతపురం ఎడ్యుకేషన్: తల్లిదండ్రులు లేని అనాథ, నిరుపేద, డ్రాపౌట్స్‌గా మారిన పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కేజీబీవీ స్పెషలాఫీసర్ల (ఎస్‌ఓ)కు గుత్తి, అనంతపురం డీవై ఈఓలు మల్లారెడ్డి, శ్రీనివాసరావు సూచించారు. కేజీబీవీల్లో బాలికల విద్యను మరింత బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపీఏ) ఆధ్వర్యంలో కేజీబీవీ ఎస్‌ఓలు, వార్డెన్లకు ఇస్తున్న ఐదు రోజుల పాటు శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. బుక్కరాయసముద్రం శివారులోని విజయభారతి బీఈడీ కళాశాలలో ప్రారంభమైన శిక్షణను గుత్తి, అనంతపురం డీవైఈఓలు ప్రారంభించి, మాట్లాడారు. తల్లిదండ్రులు లేని అనాథ ఆడపిల్లలు, నిరుపేద ఆడపిల్లలు, చదువుకోలేక మధ్యలోనే మానేసిన ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇటీవల కాలంలో కేజీబీవీలు చదువులో వెనుకబడడం ఆందోళన కల్గిస్తోందన్నారు. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటున్నా...ఎందుకీ పరిస్థితి నెలకొందనే అంశాలను ఎవరికివారు సమీక్షించుకోవాలన్నారు. దీనిపై నివేదిక తయారు చేయాలని ఎస్‌ఓలకు సూచించారు. ఇక్కడి శిక్షణలో అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకుని కేజీబీవీల్లో అమలు చేయాలన్నారు. ఆడపిల్లల చదువుకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ కవిత, మాస్టర్స్ ట్రైనర్లు రేవతి, ఉషమాధురి, శివపార్వతి, రాధిక పాల్గొన్నారు.


