మోసం.. చంద్రబాబు నైజం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
● మార్చి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రజా కార్యక్రమాలు
కళ్యాణదుర్గం: మోసం చేయడం చంద్రబాబు నైజమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గంలోని శ్రీనివాస కల్యాణమంటపంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో గ్రామ, వార్డు స్థాయి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సన్నాహాక సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిలుగా అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, పార్లమెంట్, నియోజకవర్గ అబ్జర్వర్లు నరేష్‌కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు హాజరయ్యారు. అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మోసాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పోలీసు అధికారులు సైతం సమస్యలను ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లాలని ఉచిత సలహాలివ్వడం సిగ్గుచేటన్నారు. అక్రమంగా కార్యకర్తలపై కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత కమిటీలను ఫిబ్రవరి 15వ తేదీ లోపు పూర్తి చేసి, మార్చి నుంచి ప్రజా కార్యక్రమాలతో నిరంతరం ప్రజలతో మమేకమై కొనసాగుతామని పేర్కొన్నారు. డాక్టర్ శైలజానాథ్ మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పోలీసుల నీడన బతుకుతున్నారని విమర్శించారు. పోలీసులు లేనిదే బయటకు రాలేని పరిస్థితి ఆయనదన్నారు. కళ్యాణదుర్గంలో ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా యావత్ శింగనమల కదిలి వచ్చి అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో రాయదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు రైల్వేలైన్ కోసం అదనపు ఎస్టిమేట్ వేయించి రూ.250 కోట్ల నిధులు తెచ్చానని గుర్తు చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకూ బీటీపీ కాంట్రాక్టర్‌గా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబునే ఉన్నారన్నారు. ప్రాజెక్ట్‌కు కృష్ణా జలాలను చేర్చకుండా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. కల్యాణి వైన్స్ పేరుతో ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.20 నుంచి రూ.30 వసూలు చేస్తూ పేదలను నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. పేదల నుంచి దోచుకున్న ప్రతి పైసాకు ఫలితాన్ని అనుభవించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, తాలూకా, మండల స్థాయి వివిధ విభాగాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న అనంత వెంకట్రామిరెడ్డి (చిత్రంలో) మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ మంగమ్మ, అబ్జర్వర్లు నరేష్‌కుమార్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి
హాజరైన పార్టీ నాయకులు,
కార్యకర్తలు
మోసం.. చంద్రబాబు నైజం
మోసం.. చంద్రబాబు నైజం


