సాక్షి, నల్గొండ జిల్లా: ‘మరికొద్ది రోజులు వేచిచూస్తా.. ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా’.. అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయకుంటే సహించబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు లేకుండా సీఎం, మంత్రులు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను సగానికి పైగా పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో అనేకమంది కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారన్నారు.
ఈ విషయాన్ని నెల రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. వారం రోజుల్లో పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించేలా చొరవ చూపుతానన్నారని తెలిపారు. ఆయన హామీ ఇచ్చి మూడు వారాలు గడుస్తున్నా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


