ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జనసందోహాన్ని చూసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ పార్టీల నాయకులు జగన్‌పై, ఆయన పర్యటనలపై విమర్శలు చేయడం సహజం. కానీ స్వతంత్ర మీడియా పేరు చెప్పుకునే ఎల్లోమీడియా కూడా గుక్కపెట్టి రోదిస్తున్న తీరు మాత్రం జనంలో నగుబాటుకు గురవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి సంస్థలు బరితెగించి చేస్తున్న చిల్లర విమర్శలు కాస్తా.. వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు అనంతపురం సమీపంలోని రాప్తాడుకు వెళ్లారు.
ఆ సందర్భంగా ఏభైవేల మందికి పైగా జనం ఆయనకు స్వాగతం చెప్పారు. ఆయన కాన్వాయి వెంట పరుగెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఎన్నికలై ఏడాదిన్నర కాలం కాకముందే ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టమైనట్లు ఈ జనసందోహం చెబుతోంది. అదే సమయంలో ఇంత ప్రజాభిమానం కలిగిన నేత ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో నిజంగానే ఓడిందా అన్న సంశయం చాలామందికి కలిగింది. ఏదో మతలబు జరిగిందని ఈవీఎంల ప్రభావమో, పోలింగ్ సమయం తరువాత పోలైనట్టుగా చెబుతున్న సుమారు ఏభై లక్షల అదనపు ఓట్ల మహత్యమో కావచ్చు కానీ ప్రజలు మాత్రం అప్పుడు, ఇప్పుడు జగన్‌వైపే ఉన్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి.
ఒక రాప్తాడు మాత్రమే కాదు.. తుపాను బాధితుల పరామార్శకు మచలీపట్నం వెళ్లినా అదే జన కెరటం. సత్తెనపల్లిలో ఒక పార్టీ నేత కుటుంబాన్ని పలకరించడానికి వెళ్లినా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
కొన్ని నెలల క్రితం జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా నెల్లూరు నగరం అంతా కదిలివచ్చినంత జన తరంగం కనిపించింది. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఏమాటకామాట. తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మాదిరి కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరో ఒకరు రఫ్పా,రప్ఫా అని సినిమా డైలాగును పోస్టరు రూపంలో ప్రదర్శించినా తప్పుడు కేసు పెట్టే ఆలోచన చేయలేదు. ఏపీలో అయితే జగన్ అభిమానులు కదిలితే కేసు. మాట్లాడితే కేసుగా ఉంది పరిస్థితి. జగన్ మచిలీపట్నం టూర్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసులు పెట్టారు. నెల్లూరులో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు పెట్టారు.
హైదరాబాద్‌లోనూ తరగని జగన్ అభిమానాన్ని చూసి తెలుగుదేశం పార్టీతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు జీర్ణించుకోలేకపోయాయి. అసహ్యం పుట్టించేలా పిచ్చి రాతలు రాశాయి. టీవీ చానళ్లలో పిచ్చి వాగుడు వాగారు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే అర్జంట్‌గా జగన్‌పై కేసులను తేల్చేయాలట. వారు కోరుకున్న రీతిలో శిక్షించాలట. ఈ సందర్భంలో కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు వెగటు పుట్టించాయి. వర్ల రామయ్య వంటివారు ఏకంగా న్యాయమూర్తులకే విజ్ఞప్తి చేసినట్లు మాట్లాడారు. మరో చోటా నేత జగన్‌ను ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం యాంకర్లుగా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలు జగన్ కోసం ఆ రకంగా రావడం ఏమిటని ప్రశ్నించారు. చాలాచాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాన్ని ఏపీ నుంచి తరలించారని ఏడుపుగొట్టు కూతలు కూశారు.
జగన్ కోర్టుకు వెళ్ళినప్పుడు లోపల సన్నివేశాలు వీడియో తీయరాదు.అయినా కొందరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. జగన్ కోర్టు హాలులో నిలబడితే అదేదో తప్పు అన్నట్లుగా ప్రచారం చేశారు. కోర్టులో జగన్ సాక్ష్యుల స్థానాలలో కూర్చుని కనిపించారని మరొకరి ఆక్షేపణ. న్యాయమూర్తి రావడానికి ముందు ఎవరైనా కోర్టులో కూర్చోవచ్చు. దీనిపై వైసిపి నేత, మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. కోర్టులో వీడియోలు తీయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయనను హెలికాఫ్టర్లో విజయవాడకు తీసుకు రావాలని పోలీసు అధికారులు భావించారు.కాని చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. బస్సులోనే ప్రయాణిస్తానని పట్టుబట్టారు.
పోలీసులు ఒప్పుకుని నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. అది అప్పట్లో పోలీసులు వ్యవహరించిన పద్దతి. కాని ఇప్పుడేమో ఎలా ప్రవర్తిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు. చిలకలూరిపేట మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బస్సు వద్ద హడావుడి చేశారు. నినాదాలు చేశారు. చంద్రబాబు విజయవాడ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన కూడా తన లాయర్ పక్కన కూర్చున్న సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తదుపరి ఆయన కూడా లేచి నిలడ్డారు.ఆ సన్నివేశాలను ఎవరూ రికార్డు చేయలేదు. ఆరోగ్య సమస్యల పేరు చప్పి చంద్రబాబు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నప్పుడు కూడా వైసీపీ ఎక్కడా అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అది తమ సంస్కృతి అని పొన్నవోలు అన్నారు. కాని ప్రస్తుతం టీడీసీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక, ఆరోగ్య సమస్యలు ఏమయ్యాయో కాని రాత్రంతా గంటల తరబడి ర్యాలీ చేసి రాజమండ్రి నుంచి ఉండవల్లి కరకట్ట నివాసానికి చేరుకున్నారు. అప్పుడు ఈనాడు ‘‘జైలు నుంచి జనం గుండెల్లోకి’’ అని శీర్షిక పెట్టింది. దారి పొడవునా నీరా'జనాలు"అని రంకెలేసింది. చంద్రబాబుకు నిజంగా అన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే తెల్లవార్లూ ర్యాలీ చేయవచ్చా అని ప్రశ్నించలేదు. జగన్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రం ఇదే పత్రిక ‘‘జగన్ మార్కు బలప్రదర్శన’’ అని ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. ఆయన అనుచరులు హల్ చల్ చేశారట. అంతకు ముందు బందరు ప్రాంతానికి వెళ్లినప్పుడైతే ‘‘అడుగడుగునా అరాచకమే’’ అంటూ నీచమైన శీర్షిక పెట్టింది. హైవేపై గుమికూడదని పోలీసులు షరతు పెట్టడాన్ని కూడా సమర్థించి తన లేకి బుద్ది ప్రదర్శించుకుంది.
చంద్రబాబు హైవేలపై ర్యాలీ తీసినప్పుడు, పుంగనూరు వంటి చోట్ల టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్‌ను దగ్ధం చేసినప్పుడు మాత్రం ఈ మీడియాకు ఎక్కడా తప్పు కనిపించలేదు. చంద్రబాబు కందుకూరులో రోడ్డు మధ్యలో మీటింగ్ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా అది పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేసింది. మరో పత్రిక ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ తన వికృతత్వాన్ని అంతా ప్రదర్శించి జగన్‌కు హైదరాబాద్‌లో ప్రజాస్పందనపై ఒక వ్యాసం రాసి అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబుపై అసలు కేసులే లేనట్లు, బెయిల్‌పై లేనట్లు ఆ విషయాలేవి ప్రస్తావించకుండా, జగన్ కేసులపైనే నీచాతినీచంగా రాసుకుని స్వామి భక్తి ప్రదర్శిస్తే, సోషల్ మీడియాలో పలువురు ఆయనను ఉతికి ఆరేశారు.అయినా వారేమి సిగ్గుపడే పరిస్థితి లేదనుకోండి. ఏది ఏమైనా టీడీపీ ఎంత ఘోరంగా మాట్లాడినా, వారికి బానిసత్వం చేసే ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చి పెడబొబ్బలుపెట్టినా, జగన్‌కు దిష్టి తీసిన చందమేనని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


