
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.
శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్‌ఎస్‌పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్‌ఎస్‌ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్‌ఎస్‌పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.
కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్‌ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్‌రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది.
ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్‌కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు.
ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్‌ఎస్‌లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు.
జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు.
అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.