ఈవై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు
2019లో 146 కోట్ల మంది థియేటర్లకు రాక
2024లో సినిమా వీక్షకులు 86 కోట్లు మాత్రమే
నాణ్యత తగ్గిందంటున్న 55% ప్రేక్షకులు
రిలీజైన కొన్నాళ్లకే ఓటీటీల్లోకి సినిమా
ప్రేక్షకులు తగ్గడానికి పైరసీ కూడా మరో కారణం
సినిమా..భారతీయుల జీవితంలో ఒక భాగం. అతిపెద్ద వినోదం. అభిమాన తారలు, కథ, నటన, పాటలు, హిట్, ఫ్లాప్.. ఇలా సినిమా గురించి చర్చలేని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదు. థియేటర్లో కిటకిటలాడే ప్రేక్షకులు, ఈలలు, చప్పట్లు, చెవులు చిల్లులుపడే శబ్దాల మధ్య మూవీ చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇదంతా గతం. ‘ఆ ఒక్కటి తగ్గింది పుష్ప’అని ఇప్పుడు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దేశ వ్యాప్తంగా 2019లో 146 కోట్ల మంది ప్రేక్షకులు వెండి తెర ముందు కూర్చుని సినిమాను ఆస్వాదించారు. 2024లో ఈ సంఖ్య 86 కోట్లకు వచ్చి చేరింది.
అంటే అయిదేళ్లలో థియేటర్లకు వచ్చిన వీక్షకుల సంఖ్య 41% తగ్గిందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) నివేదిక వెల్లడించింది. 2025 జూన్–జూలైలో 14,688 మంది సినిమా ప్రేక్షకులపై ఈవై నిర్వహించిన సర్వే, అలాగే నిర్మాతలు, ఇతర భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..140 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో ఏటా థియేటర్లకు వచ్చి మూవీని ఆస్వాదించేవారి సంఖ్య దాదాపు 15 కోట్లు మాత్రమే. – సాక్షి, స్పెషల్ డెస్క్
కొద్ది రోజులకే ఓటీటీల్లో..
సినిమా కంటెంట్‌లో నాణ్యత తగ్గిందన్నది ప్రేక్షకుల మాట. అంతేకాదు మూవీస్ రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల
సంఖ్య తగ్గడానికి ఇవే ప్రధాన కారణాలు. కంటెంట్ నాణ్యత పడిపోయిందని 55% ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆకట్టుకునే కథ, సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ మెరుగుపడాలని 70% మంది ఆశిస్తున్నారు.
థియేటర్లకు పరుగు తీయాల్సిన అవసరం లేదని..విడుదలైన ఎనిమిది వారాలలోపు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వస్తున్నాయని 81% మంది నమ్ముతున్నారు. థియేటర్‌లో రిలీజై ఓటీటీకి వచ్చేందుకు తక్కువ రోజులే ఉంటే సినిమా కోసం వేచి చూస్తామని మూడింట ఒకవంతు మంది చెబుతున్నారు. చేయి తిరిగిన రచయితలు, కథల కొరత ఉందని 78% నిర్మాతలు పేర్కొన్నారు.
సగం మంది పైరసీతో..
భారత్‌లో మొత్తం స్క్రీన్ల సంఖ్య 2019లో 9,527 ఉండగా.. 2024 నాటికి స్వల్పంగా పెరిగి 9,927కి వచ్చి చేరింది. అంటే కేవలం 400 తెరలే కొత్తగా తోడయ్యాయి. 10 లక్షల మంది జనాభాకు స్క్రీన్లు 7.6 నుంచి 6.8కి తగ్గాయి. 10 లక్షల మందికి యునైటెడ్ స్టేట్స్‌లో 109, యూకేలో 66, చైనాలో 64 తెరలు ఉన్నాయి. భారత్‌లో 2018–24 నడుమ 1,000 దాకా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యాయి.

మల్టీప్లెక్సులు అయిదేళ్లలో పెట్టుబడులను 12% తగ్గించాయి. భారత్‌లోని దాదాపు 19,000 పిన్‌కోడ్స్‌కుగాను సుమారు 16,350 చోట్ల థియేటర్లే లేవు. సినీ పరిశ్రమను కోలుకోకుండా చేస్తున్న పైరసీ సైతం సమస్యను పెంచుతోంది. వీడియో కంటెంట్ యూజర్లలో 51% మంది పైరసీ సైట్లపై ఆధారపడుతున్నారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది 19 నుంచి 34 సంవత్సరాల వయస్సుగల వారు ఉండడం గమనార్హం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు విడుదలైన తర్వాత పైరసీ పెరుగుతోంది.
ఒత్తిడిలో పరిశ్రమ..
ప్రేక్షకుల సంఖ్య తగ్గడం, పరిమిత స్క్రీన్స్, వీక్షణ అలవాట్లలో వేగవంతమైన మార్పుల కారణంగా చలనచిత్ర ప్రదర్శన రంగం నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మన దేశంలో మొత్తం మీడియా, వినోద రంగం, విస్తృత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ.. 2019 నాటి గరిష్ట స్థాయి నుంచి థియేటర్ల రెవెన్యూ తగ్గుతోంది. 2019–24 మధ్య భారతదేశ థియేటర్ల ఆదాయాలు 0.2% వార్షిక రేటుతో క్షీణించాయి. ఇదే సమయంలో మీడియా, వినోద రంగం 5.42%, జీడీపీ 6.6% వృద్ధి చెందాయి. సినిమా ఆదాయం 2019లో రూ.19,100 కోట్ల నుంచి 2024లో రూ.18,746 కోట్లకు పడిపోయింది. 2019లో రూ.100 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్లు అందుకున్న సినిమాలు 17 ఉంటే.. 2024లో ఇవి 10కి పరిమితం అయ్యాయి.


