పెద్ద పండగొచ్చింది | Telugu writer Potturi Vijayalakshmi Sharing memories of Sankranthi celebrations | Sakshi
Sakshi News home page

పెద్ద పండగొచ్చింది

Jan 13 2026 5:48 AM | Updated on Jan 13 2026 5:48 AM

Telugu writer Potturi Vijayalakshmi Sharing memories of Sankranthi celebrations

సంక్రాంతి సంబరాలు

అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. బొమ్మల కొలువులు, పేరంటాలు... సంక్రాంతి సందడి వర్ణనాతీతం.  ఇంటింటా భారీ పిండి వంటలు, పండగ నాడు అవన్నీ పంచటాలు అబ్బో ఊపిరి సలపనంత సందడి. ఇక ఊరంతా ముగ్గుల తివాచీలే. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి పంచుకుంటున్న జ్ఞాపకాలు.

పండుగలు ఎన్ని ఉన్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకతే వేరు. పెద్ద పండుగ సంక్రాంతి. అప్పట్లో అంటే 60 ఏళ్ల కిందట సంక్రాంతి వస్తుంది అంటే అందరికీ సంబరం. ఆ రోజుల్లో అందరివీ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. సంక్రాంతి అంటే పంట ఇంటికి వచ్చే సమయం. ఆ రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేతికి వచ్చిన పంట ఏ వర్షం వల్లనో నాశనం అయిపోవటం లేదు కాబట్టి అందరికీ వారు పడ్డ కష్టానికి శ్రమ చేతికి అందే సమయం. 

అందరి చేతిలోనూ డబ్బులు ఆడే ఆ సమయంలో బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు వచ్చేసేవాళ్ళు. ఏదో ఒక ఊరిలో బస చేసి రెండు మూడు గ్రామాలు చుట్టపెట్టుకునేవాళ్ళు. ఒక రోజు రెండు రోజులు కాదు సుమారు నెలరోజులు వారి సంచారం ఉండేది. ప్రతి వీధిలో తెల్లవారుజాము నుంచి ముగ్గుల సందడి. ఊరి మొత్తం తివాచీ పరిచారా అన్నట్లు ప్రతి ఇంటి ముందు ముగ్గులే. వాటికి మరింత సొబగు నద్దుతూ గొబ్బిళ్ళు.

పెద్ద పండగకు పిల్లా పెద్దా అందరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం ఆనవాయితీ. పల్లెటూర్లలో పదిమంది ఉన్న ఉమ్మడి కుటుంబాల వారి కొత్త బట్టల సరదా ప్రత్యేకంగా ఉండేది. అలవాటుగా బట్టలు కుట్టే దర్జీ మిషన్‌ తీసుకుని వచ్చి వీళ్ళ వరండాలో తిష్ట వేసేవాడు. అక్కడే బట్టలు కుట్టటం. 

అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, వాళ్లకు భోగి పండగ రోజున నూనె అంటి స్నానం చేయించే ఇంటి పని వాళ్ళు. ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. భోగి పండ్లు, బొమ్మల కొలువులు, పేరంటాలు. ఆ సందడి వర్ణనాతీతం. ఇంటింటా భారీ ఎత్తున తయారు చేసే పిండి వంటలు, సంక్రాంతి పండగ నాడు అవన్నీ పనివారికి పంచటాలు... అబ్బో ఊపిరి సలపనంత సందడి. 

మిగిలిన అన్ని  పండుగల కంటే సంక్రాంతికి మరొక ప్రత్యేకత కనుమ. పశువుల పండగ. ఏడాది పొడుగునా తమకు వ్యవసాయంలో సాయం చేసిన పశువులకు కృతజ్ఞతగా జరిపే పండుగ. పశువులను చెరువుకు తీసుకువెళ్లి శుభ్రంగా కడిగి తీసుకువచ్చి పసుపు కుంకాలతో, గులాం రంగులతో మెడ పట్టెడలు కొమ్ములకు మువ్వలు కట్టి అలంకరించి ఎంతో ప్రేమతో చేసేవారు పశువుల పండుగ. 

కాలక్రమేణ కొంత మార్పు వచ్చినా ఈనాటికి ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది సంక్రాంతి. ఈ నాటి పద్ధతి ప్రకారం గుండుసూది మొదలుకొని కారు వరకు, అన్ని వస్తువుల మీద సంక్రాంతి సేల్‌. ఆకర్షణీయమైన ఆఫర్లు. ఎవరి ఇంటి ముందు వారు ముగ్గు వేసుకోవటంతో సరిపెట్టకుండా ఎంతోమంది ప్రముఖులు పెద్దపెద్ద మైదానాలలో భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి ఘనంగా బహుమతులు అందజేస్తున్నారు. 

ప్రతి ఊళ్లోనూ ప్రతి కూడలిలోనూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి భోగి మంటలు. గాలిపటాలతో ఆకాశం కొత్త అందాలు సంతరించుకుంటోంది. సంప్రదాయ వంటకాలు రకరకాలు ఇక్కడ తయారై తాజాగా అమెరికా దేశంలో ఉన్న తెలుగువారి కోసం ఆకాశమార్గాన ఎగిరి పోతున్నాయి. గొప్ప వారి కోసం ప్రత్యేకంగా జరిగే కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. 

పండగకు ముందే భాగ్యనగరం నుంచి సగం మంది సొంత ఊర్లకు ప్రయాణం కట్టడంతో పంతంగి టోల్‌ గేట్‌ దగ్గర భారీ ట్రాఫిక్‌ జామ్‌ సంక్రాంతి పండగలో ఒక భాగం అయిపోయింది.  అప్పట్లో చదువులు ఇంత భారంగా ఉండేవి కాదు కాబట్టి సంక్రాంతి పండుగకు బోలెడన్ని సెలవులు ఇచ్చే వాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. 

కాని నగరంలో  ఇప్పటికీ  కాలనీలలో  గంగిరెద్దు వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్ని లావాదేవీలు ఫోన్‌ ద్వారానే కాబట్టి గంగిరెద్దు మొహాన స్కానర్‌  తగిలించి తీసుకువస్తున్నారు. ఏళ్లు గడిచినా, తరాలు మారినా సంక్రాంతి పండుగ వైభవం మాత్రం తగ్గలేదు. ఈనాటికీ పెద్ద పండుగ సంక్రాంతి.
ఇక సంక్రాంతి పండుగ విషయంలో నాకు మాత్రమే సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటాను.

అప్పుడు నేను సెకండ్‌ ఫామ్‌ అంటే ఇప్పటి ఏడవ తరగతి చదువుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా వ్యాసం రాయమన్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మొదటి నుంచి నాకు కొంచెం అత్యుత్సాహం. మామూలుగా గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు అన్నీ రాసిన తరువాత ఏదైనా కొత్తగా రాయాలి అనిపించింది. ‘సంక్రాంతికి శంకరుడు సంక్రమణమున ప్రవేశించును’ అని రాశాను.

 మా తెలుగు టీచర్‌ గారు వేరే మతస్తులు. నేను రాసిన విషయం ఆవిడకి తెలియక మరి కొంతమంది టీచర్లని అడిగారుట. అందరూ ఏమో మాకు తెలియదు అని అన్నారుట. చివరికి అందరూ కలిసి సూర్యుడు మేషరాశి అందు ప్రవేశిస్తాడుగానీ శంకరుడు సంక్రమణమున ప్రవేశించటం ఎవరము ఎక్కడా వినలేదు అని నన్ను పిలిచి నిలదీసి అడిగారు. నేను తలవంచుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటే అప్పుడు వాళ్లకు అర్థమైంది అది కేవలం నా అతి తెలివి అని. చక్కగా అక్షింతలు వేసి పంపించారు. 

మరొక సంక్రాంతి వచ్చింది మన జీవితాల్లోకి. పండగనాడు చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా గడపండి. కాస్త మనసు అదుపు చేసుకుని పండగ నాడైనా సెల్‌ఫోన్‌ పక్కన పెట్టి, టీవీకి దూరంగా అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొని ఆత్మీయత పెంచుకుంటే అదే అసలైన పండగ... పదిమందితో జరుపుకునేదే పండగ. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకొని ఆ మధురమైన అనుభూతులతో వచ్చే పండగ కోసం ఎదురుచూడటం జీవితానికి సార్ధకత. 
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement