సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైంది అంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 16,600 కోట్ల రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన 7000 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డ్వాక్రా మహిళలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేశారో నాబార్డ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో వైఎస్ జగన్ రుణమాఫీ చేశారు. జగన్ హయాంలో సున్నా వడ్డీ రుణాలు మంజూరు అయ్యేవి.
మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు.
కూటమి నేతలు సంక్రాంతి.. సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయి. రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బట్టలు విప్పి రికార్డింగ్ డ్యాన్సులు చేయాలన్న వారిని ఎందుకు నడి రోడ్డుపై నడిపించలేదు?. క్యాసినోలు, పేకాటలు ఆడిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. నడిరోడ్డుపై ఎందుకు నడిపించలేదు?. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


