అతి పెద్ద నీలమణి!  | World largest purple star sapphire unveiled in Colombo | Sakshi
Sakshi News home page

అతి పెద్ద నీలమణి! 

Jan 18 2026 3:42 AM | Updated on Jan 18 2026 3:42 AM

World largest purple star sapphire unveiled in Colombo

బరువు 3,536 క్యారెట్లు! 

విలువ రూ.3,600 కోట్లు?

ఊదా రంగులో మెరిసిపోతున్న ఈ నీలమణిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు కదా! ఇది అలాంటిలాంటి నీలం కాదు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నీలమణిగా రికార్డులకెక్కింది! అత్యంత అరుదైనదిగా చెబుతున్న ఈ నీలాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం తొలిసారి ప్రదర్శనకు ఉంచారు. ఇది ఏకంగా 3,536 క్యారెట్ల బరువుందట! అంటే 700 గ్రాములన్నమాట!! దీనికి స్టార్‌ ఆఫ్‌ ప్యూర్‌ లాండ్‌ అని నామకరణం చేశారు. 

ఇది నకిలీది కాదని, సిసలైన నీలమణేనని జెమాలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా (జీఐఏ) కూడా ధ్రువీకరించింది. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సహజ నీలం ఇదేననీ పేర్కొంది. ఇంత భారీ పరిమాణంలో కూడా ఈ నీలమణి పూర్తిస్థాయి సౌష్టవంతో కూడుకుని ఉండటం విశేషమని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు సహజంగా అమరిన చూడచక్కని గుండ్రనైన రూపు దీని ప్రత్యేకతను ఎన్నో రెట్లు పెంచింది. 

వీటన్నింటికీ మించి ఇది ఆరు రకాల కాంతి కిరణాలను వెదజల్లుతుందట కూడా! ఇక నీలమణికి అతి ముఖ్యమైన స్వచ్ఛత విషయంలో కూడా సాటి లేని నాణ్యత స్టార్‌ ఆఫ్‌ ప్యూర్‌ లాండ్‌ సొంతమని ప్రదర్శకులు వివరించారు. దీని విలువ కనీసం 30 కోట్ల నుంచి 40 కోట్ల డాలర్లు (రూ.3,628 కోట్లు) ఉంటుందని అంతర్జాతీయ రత్నాల నిపుణులు చెప్పారు. 

వేలంలో దీనికి అంతకు మించే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా దీని యజమానుల వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నీలమణి 2023లో శ్రీలంక మారుమూల ప్రాంతంలో వజ్రాల నగరంగా పేరొందిన రత్నపురలో దొరికినట్టు దాని యజమానుల్లో ఒకరు వెల్లడించారు. సాటిలేని నాణ్యతతో కూడిన నీలమణులకు శ్రీలంక అనాది కాలం నుంచీ ప్రసిద్ధి. 
   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement