breaking news
Gemologist
-
అతి పెద్ద నీలమణి!
ఊదా రంగులో మెరిసిపోతున్న ఈ నీలమణిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు కదా! ఇది అలాంటిలాంటి నీలం కాదు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నీలమణిగా రికార్డులకెక్కింది! అత్యంత అరుదైనదిగా చెబుతున్న ఈ నీలాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం తొలిసారి ప్రదర్శనకు ఉంచారు. ఇది ఏకంగా 3,536 క్యారెట్ల బరువుందట! అంటే 700 గ్రాములన్నమాట!! దీనికి స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ అని నామకరణం చేశారు. ఇది నకిలీది కాదని, సిసలైన నీలమణేనని జెమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జీఐఏ) కూడా ధ్రువీకరించింది. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సహజ నీలం ఇదేననీ పేర్కొంది. ఇంత భారీ పరిమాణంలో కూడా ఈ నీలమణి పూర్తిస్థాయి సౌష్టవంతో కూడుకుని ఉండటం విశేషమని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు సహజంగా అమరిన చూడచక్కని గుండ్రనైన రూపు దీని ప్రత్యేకతను ఎన్నో రెట్లు పెంచింది. వీటన్నింటికీ మించి ఇది ఆరు రకాల కాంతి కిరణాలను వెదజల్లుతుందట కూడా! ఇక నీలమణికి అతి ముఖ్యమైన స్వచ్ఛత విషయంలో కూడా సాటి లేని నాణ్యత స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ సొంతమని ప్రదర్శకులు వివరించారు. దీని విలువ కనీసం 30 కోట్ల నుంచి 40 కోట్ల డాలర్లు (రూ.3,628 కోట్లు) ఉంటుందని అంతర్జాతీయ రత్నాల నిపుణులు చెప్పారు. వేలంలో దీనికి అంతకు మించే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా దీని యజమానుల వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నీలమణి 2023లో శ్రీలంక మారుమూల ప్రాంతంలో వజ్రాల నగరంగా పేరొందిన రత్నపురలో దొరికినట్టు దాని యజమానుల్లో ఒకరు వెల్లడించారు. సాటిలేని నాణ్యతతో కూడిన నీలమణులకు శ్రీలంక అనాది కాలం నుంచీ ప్రసిద్ధి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోడ్‌పతి కాలేదు...కోర్టుకెక్కాడు..
సాక్షి, ముంబయి: మేమిచ్చిన రాయి పెట్టుకుంటే మూడు నెలల్లో కోటీశ్వరుడవుతావు..అలా కాకుంటే డబ్బు వాపస్ చేస్తాం అంటూ జ్యూవెలర్ చెప్పిన మాట నమ్మి సొమ్ము పోగొట్టుకున్నాడు ఓ వృద్థుడు. మూడు నెలలు దాటినా కోట్లు కనబడక పోయేసరికి రాయి తీసుకుని తన డబ్బు తనకివ్వాలని షోరూం నిర్వాహకులను కోరగా అందుకు వారు నిరాకరించడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. అక్రమ పద్ధతుల్లో లావాదేవీ నిర్వహించారని బాధితుడికి 9 శాతం వడ్డీతో కలిపి అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని, పరిహారంగా రూ 25,000 చెల్లించాలని కోర్టు జ్యూవెలర్‌ను ఆదేశించింది. ముంబయికి చెందిన స్వర్ణ్ స్పర్శ్ అనే జెమ్‌స్టోన్ దుకాణంలో ఖండాలే అనే వ్యక్తి 2013లో నీలం జెమ్ స్టోన్‌ను కొనుగోలు చేశారు. కొద్ది రోజుల తర్వాత అదే షాపు నుంచి జ్యోతిష్యులు కుమారి ప్రాచి, శశికాంత్ పాండ్యా ఫోన్ చేసి సదరు రాయి మీకు సరిపడదు..పుష్యరాగ్, మాణిక్య రాళ్లను కొనుగోలు చేయాలని సూచించడంతో రూ 2.9 లక్షలకు వాటిని ఖండాలే కొనుగోలు చేశారు. మూడు నెలల్లో తాము చెప్పినట్టు కోటీశ్వరుడు కానిపక్షంలో డబ్బు తిరిగి ఇచ్చస్తామని ఈ సందర్శంగా జ్యోతిష్యులు నమ్మబలికారు. అయితే మూడు నెలలు గడిచినా కోటీశ్వరుడు కాకపోవడంతో డీలా పడిన ఖండేలా తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని షాపులో కోరారు. అందుకు నిర్వాహకులు నిరాకరించడంతో 2014 మేలో ఆయన కన్సూమర్ కోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా కొనుగోలు చేసిన వస్తువును తిరిగి ఇస్తేనే సొమ్ము చెల్లించడం జరుగుతుందని, బాధితుడు గడువులోగా రానందున డబ్బు వాపస్ చేయలేమని సంస్థ తేల్చిచెప్పింది. వాదనలు పరిశీలించిన కోర్టు మోసపూరిత హామీతో వస్తువు విక్రయించిన క్రమంలో బాధితుడికి 9 శాతం వడ్డీతో కలిపి రూ 3.2 లక్షలు చెల్లించాలని, పరిహారం కింద రూ 25,000 కోర్టు ఖర్చుల కింద రూ 5000 చెల్లించాలని జ్యూవెలర్‌ను ఆదేశించింది.


