శారీరక శ్రమకు 1–2 నిమిషాల వ్యాయామాలు
రోజంతా ఉత్సాహంతోపాటు ఆరోగ్యం కూడా
ఇళ్లు, ఆఫీసులో సులభంగా చేయగలిగే వీలు
ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ప్రాచుర్యంలోకి
సాక్షి, స్పెషల్ డెస్క్: చెమటోడిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా 31% పెద్దలు, 81% మంది కౌమార దశలో ఉన్నవారు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారట. ఉరుకుల పరుగుల జీవితంతో ముడిపడిన ఉద్యోగులు, వ్యాపారస్తులకు తీరిక సమయం దొరకడం లేదు. టైమ్ దొరికినా చాలామందికి బద్దకం అలుముకుంటోంది.
ఇలాంటివారు 1–2 గంటల శారీరక శ్రమ చేసే అవకాశమే లేదు. అందుకే ‘ఎక్సర్‌సైజ్ స్నాక్స్’ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఒకట్రెండు నిమిషాల్లో చేసే ఈ తేలికపాటి వ్యాయామాలతో రోజంతా ఉత్సాహంగా ఉండడమేగాక జీవనశైలి రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎక్సర్‌సైజ్ స్నాక్స్ ఇలా..
పుషప్స్ : నేలపై, లేదా గోడకు, టేబుల్ ఆసరాగా చేయొచ్చు
గోడ కుర్చీ: ఫోన్ చూసే సమయంలో
స్క్వాట్స్ : ప్రతి 45 నిమిషాలకు ఒకసారి
కాఫ్ రైజింగ్ : బ్రష్ చేసుకునేప్పుడు
డ్యాన్స్ : ఈ ప్రపంచాన్ని మైమరచిపోయి నచ్చినట్టు డ్యాన్స్
మెట్లు : అవకాశం చిక్కినప్పుడల్లా మెట్లు ఎక్కి దిగడం
కాళ్లు సాగదీయడం : కుర్చీలో, సోఫాలో కూర్చున్నప్పుడు
నడక : ఇల్లు, కార్యాలయం, ఆరుబయట వాకింగ్.
స్ట్రెచింగ్ : చేతులు, కాళ్లు, మెడ, నడుమును సాగదీయడం.
అలవాట్లు మారాయి
బిజీ లైఫ్‌కు తోడు జనం అలవాట్లు మారాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు లైఫ్‌స్టైల్‌ను మార్చేశాయి. సోషల్ మీడియా మోజులో పడి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల తీరు ఇలాగే ఉంది. జీవనశైలి సంబంధ జబ్బుల బారిన పడడమో, ఒకరిని చూసి స్ఫూర్తి పొందడమో లేదా ఆత్మీయులు, వైద్యులు హెచ్చరిస్తే తప్ప వ్యాయామంపై దృష్టి పెట్టడం లేదు. ఇటువంటి వారికి ఎక్సర్‌సైజ్ స్నాక్స్ సరైన పరిష్కారం.
ఈ చిన్నచిన్న వ్యాయామాలతో గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. కూల్ మైండ్, ఎనర్జీకితోడు కండరాలు బలంగా తయారవుతాయి. కొన్ని రకాల కేన్సర్లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి మెదడు సంబంధ విధులు మెరుగవుతాయి.
మెరుగుపడిన ఆరోగ్యం..
ఎక్సర్‌సైజ్ స్నాక్స్ అంటే సింపుల్‌గా ఒకట్రెండు నిమిషాల్లో చేసే వ్యాయామాలు. పుషప్స్, గోడ కుర్చీ, గుంజీల మాదిరిగా కూర్చొని లేవడం (స్క్వాట్స్), పాదాల వేళ్లపై నిలబడి శరీరాన్ని పైకి, కిందకు చేయడం (కాఫ్ రైజింగ్), డ్యాన్స్, మెట్లు ఎక్కి దిగడం, నడక, స్ట్రెచింగ్, ఎగరడం, నిలుచున్నచోటనే పరుగు.. ఇవన్నీ కూడా ఈ విధానంలో భాగంగా చేసుకోవచ్చు. వీటిని వెనువెంటనే చేయాల్సిన అవసరం లేదు.
గంటకో, రెండు గంటలకో రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు. రోజులో వీలున్నప్పుడు కాకుండా వీలు చేసుకుని మరీ పలుమార్లు చేయడమే ఉత్తమం. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన విశ్లేషణ ప్రకారం.. ఒకప్పుడు ఎటువంటి వ్యాయామం చేయని పెద్దల్లో ఎక్సర్‌సైజ్ స్నాక్స్ కారణంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడింది.
» పెద్దల్లో వారానికి కనీసం 150 నిమిషాల మితమైన–తీవ్రత కలిగిన లేదా 75 నిమిషాలపాటు తీవ్రమైన శారీరక శ్రమ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.
» పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు రోజుకు 60 నిమిషాల వ్యాయామం చేయాలి.
» ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్లో ప్రస్తుతం 31% మంది (180 కోట్ల మంది) వ్యాయామాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 35%కి చేరుకుంటుందని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేస్తోంది.
» జపాన్, బ్రెజిల్, భారత్‌లో ఇటువంటి వారి సంఖ్య అధికంగా ఉంటోందట. నెదర్లాండ్స్ ప్రజలు వ్యాయామాల విషయంలో చురుకుగా ఉంటున్నారు.
» ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం 58% మంది ఎక్కువ వ్యాయామం చేయాలనుకుంటున్నారు. ఇందుకు సమయం లేకపోవడమే ప్రధాన అవరోధంగా వీరు పేర్కొంటున్నారు. శారీరక శ్రమ లేని జనం రోగాల బారిన పడి 2020–30 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థపై రూ.27 లక్షల కోట్ల భారం పడనుందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పెద్దలపై జరిపిన అధ్యయనంలో...
వ్యాయామం చేయని 25,000 మందికి పైగా పెద్దలపై జరిపిన ఒక అధ్యయనంలో.. వేగంగా నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి కార్యకలాపాల ద్వారా ప్రతిరోజూ కేవలం 3–4 నిమిషాలు చురుకుగా వ్యాయామం చేసేవారు ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం 40% తక్కువగా ఉందని తేలింది. వ్యాయామం ఎరగని వారితో పోలిస్తే ఎక్సర్‌సైజ్ స్నాక్స్ చేసేవారికి హృదయ సంబంధ వ్యాధులతో చనిపోయే ప్రమాదం దాదాపు 50% తక్కువగా ఉంది.


