షాక్స్‌గావ్. భారత్, చైనా నడుమ సరికొత్త రగడకు కేంద్ర బిందువుగా మారిన లోయ. కల్లోల కశీ్మర్‌లో అత్యున్నత పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఇరుదేశాల నడుమ మరోసారి ఘర్షణ వాతావరణాన్ని పెంచుతోంది. అది ఎప్పటికీ తమదేనని, అక్కడ జరిపే ఎలాంటి నిర్మాణాలనైనా అక్రమమైనవిగానే పరిగణిస్తామని భారత్ తాజాగా స్పష్టం చేయడం తెలిసిందే. షాక్స్‌గావ్ తమదేనంటూ చైనా ఎప్పట్లాగే తెంపరితనం ప్రదర్శిస్తోంది. అక్కడి తన నిర్మాణాలన్నీ సక్రమమేనని అడ్డగోలు
వాదనకు దిగుతోంది. ఇంతకీ ఏమిటీ షాక్స్‌గావ్? ఎందుకీ వివాదం?
షాక్స్‌గావ్ లోయ కశ్మీర్‌లో హంజా–గిల్గిట్ ప్రాంతంలో ఉంటుంది. 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉన్న అతి శీతల ప్రాంతం. ఇటు కారకోరం పర్వత శ్రేణులను, అటు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ను ఆనుకునే ఉంటుంది. దీన్ని ట్రాన్స్ కారకోరం శ్రేణిగా అని పిలుస్తారు. దీనికి ఉత్తరాన చైనా, దక్షిణాన, పశి్చమాన పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం (పీఓకే) ఉన్నాయి. అలా ఈ లోయ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉండటంతో దీనిపై ఆధిపత్యం చాలా ప్రధానంగా మారింది.
పాక్ పెట్టిన చిచ్చు..
భారత్, చైనా నడుమ షాక్స్‌గావ్ చిచ్చు పెట్టింది దాయాది పాకిస్తానే. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే నాటి అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ సైన్యం షాక్స్‌గావ్ లోయను ఆక్రమించేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపినా అక్కడినుంచి వైదొలగలేదు. భారత్ కూడా ఈ ప్రాంతాన్ని తిరిగి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. 1950ల్లో తూర్పు హంజా గుండా చైనా ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకురావడం మొదలు పెట్టింది. దాంతో ఆ దేశంతో భారత సంబంధాలు క్రమంగా దిగజారడం మొదలైంది. దాంతో 1963లో నాటి పాక్ పాలకుడు అయూబ్ ఖాన్ ఓ కుటిలాలోచన చేశారు.
యార్కండ్ నదితో పాటుగా షాక్స్‌గావ్ లోయ మొత్తాన్నీ చైనాకు ధారాదత్తం చేసేశారు. చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా కొన్నేళ్లుగా చైనా అక్కడ దూకుడుగా పలు నిర్మాణాలు చేపట్టింది. ముఖ్యంగా ఇరు దేశాలనూ అనుసంధానిస్తూ హైవే నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఏకంగా 10 మీటర్ల వెడల్పుతో ఇప్పటికే 75 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనా, పాక్ కుదుర్చుకున్న సీపీఈసీ ఒప్పందం షాక్స్‌గావ్‌లో చెల్లబోదని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింద. దానిని భారత్ ఎన్నడూ గుర్తించలేదని స్పష్టం చేసింది. అక్కడి చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌ను అక్రమమైనదిగానే గుర్తిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం కుండబద్దలు కొట్టారు. దీనిపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
భారత్‌కు ఇరకాటమే..
ప్రాదేశికంగా, సైనికపరంగా షాక్స్‌గావ్ అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. అటు పాక్, ఇటు చైనా రూపంలో ఇద్దరు ప్రత్యర్థులు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ కీలక ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టు భారత్‌కు అత్యంత కీలకం. దీనికి ఒకవైపున్న సియాచిన్ గ్లేసియర్ నుంచి పాక్‌పై భారత్ నిత్యం డేగకన్ను వేసి ఉంచుతుంది. మరోవైపున ఉన్న కారకోరం శ్రేణి గుండా చైనాపై నిఘా నేత్రం సారిస్తూ ఉంటుంది. ‘‘2024 నాటికే చైనా 4.8 కి.మీ. పొడవైన అఘిల్ కనుమ గుండా దిగువ షాక్స్‌గావ్ వరకు రోడ్డు నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసేసింది. నిర్మాణ బృందాల మాటున చైనా సైన్యం అక్కడ మోహరించింది.
ఈ ప్రాంతం సియాచిన్‌కు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది మన భద్రతకు ఎప్పటికైనా ముప్పే’’అని ప్రముఖ భద్రత వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లాని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘దశాబ్దాలుగా సియాచిన్‌పై భారత్ పట్టు కొనసాగుతోంది. అక్కడినుంచి దక్షిణాన పాక్‌పై నిత్యం కన్నేసి ఉంచుతున్నాం. ఇప్పుడు ఉత్తరాన షాక్స్‌గావ్ వైపు నుంచి చైనా ముప్పు ముంచుకొచి్చంది. దాంతో సియాచిన్, పరిసర ప్రాంతాల్లో మనం నిత్యం రెండువైపులా శత్రువులను కాచుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. మైనస్ 50 డిగ్రీల అతి శీతల పరిస్థితులుండే చోట మన సైనిక బలగాలను రెండు భాగాలుగా మోహరించాల్సి వస్తుంది’’అని ఆయన వివరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


