ఏఆర్‌సీ ఖాళీ | The animal rehabilitation center has fallen silent after 25 years | Sakshi
Sakshi News home page

ఏఆర్‌సీ ఖాళీ

Jan 31 2026 5:31 AM | Updated on Jan 31 2026 5:31 AM

The animal rehabilitation center has fallen silent after 25 years

25 ఏళ్ల తర్వాత  నిశబ్దంగా మారిన జంతు పునరావాస కేంద్రం 

చివరి సింహం ‘బిగో’మృతి  

ఆరిలోవ: దశాబ్దాల పాటు సింహాల గర్జనలు, పులుల గాండ్రింపులతో దద్దరిల్లిన విశాఖలోని ఆరిలోవ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్‌సీ) ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఒకప్పుడు 34 పెద్ద పులులు, 34 సింహాలు కలిపి మొత్తం 68 వన్య మృగాలతో కళకళలాడిన ఈ కేంద్రం నేడు వెలవెలబోతోంది. కాలక్రమంలో వృద్ధాప్య సమస్యలతో ఒక్కో జంతువు మృత్యువాత పడగా, చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన ‘బిగో’అనే ఆడ సింహం కూడా ఈ నెల 7న కన్నుమూసింది. దీంతో ఏఆర్‌సీ పూర్తిగా ఖాళీ అయ్యింది. 

2000లో కేంద్రం ఏర్పాటు  
అటవీశాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జూ పార్కు సమీపంలో, జాతీయ రహదారిని ఆనుకొని 2000లో జంతు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో సర్కస్‌ కంపెనీలు గ్రామాలు, పట్టణాలకు వచ్చి ప్రజలకు వినోదాన్ని పంచేవి. ఆయా కంపెనీలు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు, కుక్కల చేత బలవంతంగా విన్యాసాలు చేయించేవి. 

ఈ క్రమంలో మూగజీవాలు సర్కస్‌ యాజమాన్యాల చేతిలో హింసకు గురవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో సర్కస్‌లలో జంతువులతో విన్యాసాలు చేయించడాన్ని తప్పుబడుతూ, వాటితో ఆటలాడించకూడదని 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోని వివిధ సర్కస్‌ కంపెనీల నుంచి జంతువులను స్వాదీనం చేసుకుంది. 

వాటి సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, మైసూరు, ముంబయి, చెన్నైలలో ప్రత్యేకంగా ఐదు జంతు పునరావాస కేంద్రాల(యానిమల్‌ రెస్క్యూ సెంటర్‌–ఏఆర్‌సీ)ను నిర్మించింది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లోని జూలాజికల్‌ పార్కులకు అప్పగించింది. ప్రసిద్ధ సర్కస్‌ కంపెనీలైన ఫేమస్, జెమిని, అజంతా తదితరాల నుంచి స్వాధీనం చేసుకున్న పులులు, సింహాలను ఈ ఐదు ఏఆర్‌సీలకు తరలించింది. అప్పటి నుంచి వాటికి ఆహారం, వైద్యం అందించి సంరక్షించారు. 

ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం  
ఈనెల 7న బిగో(24) అనే ఆడ సింహం మృతి చెందడంతో ఏఆర్‌సీలో జంతువులేవీ లేవు. ఈ విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు, సెంట్రల్‌ జూ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సీజెడ్‌ఏఐ) దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల అనుమతితో ఈ స్థలాన్ని జూ పార్కు అవసరాలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం. గత 25 ఏళ్లుగా ఇక్కడి సిబ్బంది, వైద్యులు జంతువులకు అత్యుత్తమ సేవలు అందించారు. – జి.మంగమ్మ, క్యూరేటర్,  ఇందిరాగాంధీ జూ పార్కు

విశాఖ ఏఆర్‌సీలో 68 జంతువులు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2000లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు జాతీయ రహదారి పక్కన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 2001లో ఇది ప్రారంభమైంది. ఇక్కడకు తీసుకొచ్చిన 34 పెద్ద పులులు, 34 సింహాల కోసం ప్రత్యేకంగా ఇనుప కేజ్‌లు, నైట్‌ క్రాల్స్, అవి స్వేచ్ఛగా తిరగడానికి విశాలమైన ఎన్‌క్లోజర్లు నిర్మించారు. వాటికి సకాలంలో ఆహారం, వైద్యం అందించడానికి వెటర్నరీ ఆసుపత్రి, ఒక వైద్యుడు, సహాయకులు, జంతు సంరక్షకులను నియమించారు. 

అవి యుక్త వయసులో ఉన్నప్పుడు వాటి గాండ్రింపులు, గర్జనలతో ఏఆర్‌సీ ప్రాంతం హోరెత్తేది. జాతీయ రహదారిపై వెళ్లే వారికి సైతం ఆ గర్జనలు వినిపించేవి. ఇప్పుడు అవన్నీ మరణించడంతో అక్కడ నిశబ్దం ఆవహించింది. సహజంగా అడవుల్లో పులులు, సింహాల సగటు జీవిత కాలం 15 నుంచి 16 ఏళ్లు కాగా, ఇక్కడ సంరక్షణలో అవి 20 నుంచి 25 ఏళ్లకు పైగా జీవించడం విశేషం. 

అర్జున్‌ (26), కొనాల్‌ (26) అనే మగ సింహాలు, మాధురి (25), సుధ (23), రాణి (23) అనే ఆడ సింహాలు ఎక్కువ కాలం జీవించాయి. వీటితో పాటు సీత (24) అనే ఆడ పులి, వినయ్‌ (21) అనే మగ పులి కూడా ఇక్కడ సుదీర్ఘ కాలం జీవించాయి. వృద్ధాప్యం కారణంగా అవయవాలు పనిచేయకపోవడం, పక్షవాతం వంటి వ్యాధులతో ఇవి మృతి చెందాయి. మంచి పోషకాహారం, వైద్యం అందించడం వల్లే అవి ఎక్కువ కాలం జీవించాయని అధికారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement