నేడు రథసప్తమి
ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణాలు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రాలతో, అనూరువైన సారథి నడుపుతున్న రథాన్ని అధిరోహించి అంతరిక్షంలో మన మాంసనేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథం ప్రత్యేకతను తెలియజేస్తూ, మాఘ శుద్ధ సప్తమిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టినరోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని ‘‘రథసప్తమి’’ పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారు నేడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ విశేషాలు...
కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధుల్లో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్యజయంతిగానే గుర్తింపు పొందింది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.
సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథీ అంతే.. వికలాంగుడైన అనూరుడు క్షణం విశ్రాంతి తీసుకోడు. ఎప్పుడూ విధి నిర్వహణలోనే ఉంటాడు.
సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో ‘అర్క‘ నామంతో సంచరిస్తాడు.
సూర్యారాధన ఫలాలు
ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చె΄్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యం ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రవచనం.
రథసప్తమి ... శ్రీవారి వాహన సేవల వివరాలు
రథసప్తమి సందర్భంగా తిరుమలలో స్వామివారు ఈనెల 25వ తేదీ, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు ద్శనమిస్తారు
ఉదయం 5.30 నుండి 8 వరకు : సూర్య ప్రభ వాహనం
ఉదయం 9 నుండి 10 వరకు : చిన్న శేష వాహనం
ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు : గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 వరకు : హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 వరకు : చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుండి 7 వరకు : సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుండి 9 వరకు : చంద్రప్రభ వాహనం
– అలిదేన లక్ష్మీకాంత్, సాక్షి, తిరుమల


