ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ఘటన మరోసారి రాజకీయ నేతల హెలికాఫ్టర్.. విమాన ప్రయాణాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో కూడా పలువురు ప్రముఖ నేతలు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి దేశాన్ని విషాదంలో ముంచారు. ఆ ఘటనలను ఓసారి గుర్తు చేసుకుంటే..
2001లో.. కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావ్ సింధియా విమాన ప్రమాదంలో మరణించారు. గ్వాలియర్ రాజవంశానికి చెందిన మాధవరావ్.. 9సార్లు లోక్‌సభకు ఎంపీగా పని చేశారు. రైల్వే, పర్యాటకం, మానవ వనరుల అభివృద్ధి, సివిల్ ఏవియేషన్ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి పాట్నాకు ఆయన ప్రయాణిస్తున్న విమానం ఘజియాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మాధవరావ్‌తో పాటు పలువురు అనుచరులు మరణించారు.
జీఎంసీ బాలయోగి.. దేశ తొలి దళిత లోక్‌సభ స్పీకర్. 2002లో స్పీకర్‌గా ఉన్న టైంలో ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. మార్చి 3వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పరిసరాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో బాలయోగితో పాటు ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశాన్ని షాక్‌కు గురి చేసింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండోసారి సీఎంగా ఉన్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బేగంపేట నుంచి బయల్దేరిన గంట సేపటికి నల్లమల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో వైఎస్సార్ సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. 2011 ఏప్రిల్ 30వ తేదీన ఆయన ప్రయానిస్తున్న హెలికాఫ్టర్ తవాంగ్ జిల్లా అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దోర్జీ ఖాండుతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
2025 జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 260 మంది మరణించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. బల్వంత్‌రాయ్ మెహతా విమాన ప్రమాదంలో మరణించారు. 1965లో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై పాకిస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్ కచ్ వద్ద దాడి జరిపింది. దేశంలో ఇప్పటిదాకా.. యుద్ధంలో మరణించిన ఒకే ఒక్క సీఎంగా బల్వంత్‌రాయ్ మెహతా నిలిచారు.
అణు శాస్త్రవేత్త హోమి జహంగీర్ బాబా.. 1965లో ఆల్ప్స్ పర్వతాల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించారు.
కేంద్ర మాజీ మంత్రి మోహన్ కుమారమంగళం 1973లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో మరణించారు.
నటుడు ఇందర్ థాకూర్ 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో 1994లో జరిగిన ప్రమాదంలో పంజాబ్ మాజీ గవర్నర్ సురేంద్ర నాథ్ మరణించారు
1997లో కేంద్ర రక్షణ మంత్రి(సహాయ) ఎన్వీఎన్ సోము అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి దేరా నాతుంగ్ 2001లో తవాంగ్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు
మేఘాలయా ఎమ్మెల్యే సైప్రియన్ సంగ్మా 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు
చైల్డ్ ఆర్టిస్ట్ తరుణీ సచ్ దేవ్.. నేపాల్‌లో 2012లో జరిగిన ప్రమాదంలో మరణించారు
పైన చెప్పుకునే జాబితానే కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, హర్యానా మంత్రి ఓం ప్రకాశ్ జిందాల్ కూడా యూపీ షాహరన్‌పూర్‌లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో మంత్రి సురేందర్ సింగ్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా డిసెంబర్ 08, 2021లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి మధులిక, మరో 12 మంది మరణించారు.
2004, ఏప్రిల్ 17న సినీ నటి సౌందర్య తన సోదరి అమర్నాథ్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ (1980) ఢిల్లీలో ఈ తరహా ప్రమాదంలోనే కన్నుమూయగా.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లు కూడా విమాన ప్రమాదాల్లోనే మరణించారన్న ప్రచారం ఉన్నది తెలిసిందే.


