మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..! | Hot summer How to keep rooof cool check here | Sakshi
Sakshi News home page

మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!

Mar 14 2026 12:36 PM | Updated on Mar 14 2026 1:04 PM

Hot summer How to keep rooof cool check here

నగర/పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు అధిక ఉష్ణంతో సెగలు కక్కుతున్నాయి. ఇరుకు రేకుల ఆవాసాల్లో తలదాచుకునే పేదల నుంచి పక్కా ఇళ్లలో ఉండే మధ్యతరగతి ప్రజల వరకు వేడిఒత్తిడి (హీట్‌ స్ట్రెస్‌)కి లోనవుతున్నారు. తమ ఇళ్లు వేడెక్కిపోతుంటే ఏసీలు కొనే స్తోమత లేని వారు అల్లాడుతున్నారు. 

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అధ్యయనం ప్రకారం.. ఆరు భారతీయ నగరాల్లో 80% విస్తీర్ణంలోని గృహవాసులు వేడి ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇంటి పైకప్పులను ఇన్సులేట్‌ చెయ్యటమే, ఏసీలు/కూలర్ల వాడకం కన్నా, మేలైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.  వేడి ఒత్తిడి నుంచి కాపాడు కోవటానికి ఉపయోగపడే కూల్‌ రూప్‌ పద్ధతులేమిటో చూద్దాం..  

హీట్‌ స్ట్రెస్‌కు మూల కారణాలు ఇవి..  
అర్బన్‌ ప్రాంతాలు ఇళ్లతో నిండిపోవటం, పచ్చదనం తగ్గిపోవటం, వాహన కాలుష్యం పెరిగిపోవటంతోపాటు వేడిని అతిగా గ్రహించే స్వభావం గల (హీట్‌ ట్రాపింగ్‌ మెటీరియల్‌) సామగ్రితో ఇళ్లు నిర్మించటం ఈ వేడి ఒత్తిడి పెచ్చుమీరటానికి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 

 కాంక్రీటు, ఇటుకలు, రాళ్లు పగటి పూట సూర్యరశ్మి నుంచి వేడిని గ్రహించుకొని, రాత్రి పూట నెమ్మదిగా ఆ సెగను వదులుతూ ఉంటాయి. దీంతో కాంక్రీటు భవనాలు రాత్రిళ్లు కూడా సెగలు కక్కుతూనే ఉంటాయి. అందువల్ల అర్బన్‌ ప్రాంతాల్లో ముఖ్యంగా రేకుల ఇళ్లు, మండు వేసవిలో నరకానికి నకళ్లుగా మారుతున్నాయి.  

మెరుగైన పైకప్పులు.. మూడు రకాలు  
బయటి వేడిని అతి తక్కువగా గ్రహించటంతోపాటు అతి తక్కువగా ఇంటి లోపలికి వదిలే పై కప్పులు ముఖ్యంగా మూడు రకాలు. వీటినే థర్మల్లీ ఎఫిషియెంట్‌ రూఫ్స్‌ అని వ్యవహరిస్తున్నారు.  

కూల్‌ రూఫ్స్‌ : ఎండ కాచే సమయంలో సోలార్‌ రేడియేషన్‌ను ఎక్కువగా గ్రహించకుండా తిరిగి వాతావరణంలోకి తిప్పికొట్టే (రిఫ్లెక్టివ్‌) సామర్థ్యం, గ్రహించిన కొద్దిపాటి వేడిని కూడా గది లోపలికి కాకుండా పైకప్పు నుంచే అతి త్వరగా బయటకు వదిలి వేసి చల్లబడే సామర్థ్యం గల టైల్స్, పెయింట్లు, మెంబ్రెయిన్లు ఈ కోవలోకి వస్తాయి.  

గ్రీన్‌ రూఫ్స్‌ : ఆర్‌సీసీ శ్లాబ్‌పైన వాటర్‌ ప్రూఫింగ్‌ చేసి మట్టి పోసి మొక్కలు పెంచితే అదే గ్రీన్‌ రూఫింగ్‌. సూర్యరశి్మని గ్రహించి మొక్కలు పెరుగుతుంటాయి. అవి ఆకుల ద్వారా వాతావరణంలోకి వదిలే నీటి తేమ వల్ల పైకప్పు, పరిసరాలు చల్లగా ఉంటాయి. పచ్చని లాన్‌/ మొక్కలు/ చిన్న చెట్లు పెంచాలంటే 300 ఎంఎం లోతులో మట్టి పొర వేసుకోవాలి. రూఫ్‌ పార్కులు, సేదదీరే స్థలాలు, కమ్యూనిటీ గార్డెన్లకు ఈ ఇంటెన్సివ్‌ గ్రీన్‌ రూఫ్‌ అనువైనది. ఎక్స్‌టెన్సివ్‌ గ్రీన్‌ రూఫ్‌ పద్ధతిలో అయితే 25–125 ఎంఎం లోతు మట్టి పొర వేస్తే చాలు. నీటి ఎద్దడిని తట్టుకునే సక్యులెంట్స్, గడ్డి, తీగజాతి మొక్కల్ని పెంచుకోవచ్చు.  

ఇంటి పైకప్పులను ఇన్సులేట్‌ చెయ్యటమే ఏసీల వాడకం కన్నా మేలైన పరిష్కారం  
మట్టి పాత్రలతో ఇన్సులేషన్‌: ఆర్‌సీసీ శ్లాబ్‌పైన మట్టి పాత్రలను బోర్లించి, వాటిపైన సున్నం లేదా సిమెంట్‌ కాంక్రీటు వేసి, దానిపైన సెరామిక్‌ టైల్స్‌ వంటి వాటితో వాటర్‌ ప్రూఫింగ్‌ చేసుకోవాలి. బోర్లించిన మట్టిపాత్రలో ఉండే గాలి శ్లాబ్‌కు వేడి చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఎండ వేడి కిందకు దిగకుండా ఉంటుంది.  

ఇన్సులేటెడ్‌ రూఫ్స్‌: రూఫ్‌ శ్లాబ్‌ ద్వారా గది లోపలికి దిగే వేడిని మూడింట రెండొంతులు పైకప్పుపై వేసే ఇన్సులేటెడ్‌ రూఫ్‌ అరికడుతుంది. ఇన్సులేషన్‌ పొరగా ఎక్స్‌ట్రూడెడ్‌ పాలిస్టైరెన్‌ షీట్‌ (ఎక్స్‌పీఎస్‌), సెల్యులోజ్‌ పైబర్, థర్మోక్రేట్, లైమ్‌ కాంక్రీట్, హాలో టెర్రకోట టైల్స్, గ్లాస్‌ వూల్‌ షీట్లను వాడుతున్నారు. దీని మందం 20–50 ఎం.ఎం. ఉంటుంది. షీట్‌ ధర రూ. 275–695 మధ్యలో ఉంటుంది. ఆర్‌సీసీ శ్లాబ్‌ పైన ఇన్సులేషన్‌ (ఓవర్‌ డెక్‌ ఇన్సులేషన్‌) పొర వేసుకొని, దానిపై వాటర్‌ ప్రూఫింగ్‌ చెయ్యాలి. ‘అండర్‌ డెక్‌ ఇన్సులేషన్‌’అనే మరో పద్ధతి ఉంది. ఆర్‌íసీసీ శ్లాబ్‌ అడుగున, ఈ బోర్డ్‌/జిప్సం లేయర్‌కు మధ్యలో ఈ ఇన్సులేషన్‌ వేస్తారు. పై కప్పు నుంచి కిందికి వచ్చే వేడిని ఇది కొంత మేరకు ఆపుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement