బెదిరింపులు, టారిఫ్‌లు
ఆక్రమణలు, యుద్ధోన్మాదం
ట్రంప్ తెంపరితనం
డొనాల్డ్ ట్రంప్ 2.0 క్రమంగా ప్రపంచానికి మర్చిపోలేని పీడకలగా మారుతోంది. అమెరికా అధ్యక్షునిగా రెండో టర్మ్‌లో ఆయన తొలి 12 నెలల పాలన అన్ని దేశాలనూ చెప్పలేనంత అనిశ్చితికి, అయోమయానికి, అంతకు మించిన అభద్రతా భావానికి గురి చేసింది. 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్నీ ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు.
ఆ క్రమంలో అమెరికా గౌరవాన్ని, అగ్ర రాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టలను కూడా మంటగలుపుతున్నారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు, చౌకబారు కామెంట్లకు ట్రంప్ మారుపేరుగా మారిపోయారు. ఆచితూచి మాట్లాడటం తన డిక్షనరీలోనే లేదని నిరూపిస్తున్నారు. కనీస దౌత్య మర్యాదలకు కూడా తిలోదకాలిస్తూ దేశాధినేతలనే మీడియా సాక్షిగా అవమానించి అప్రతిష్ట మూటగట్టుకున్నారు.
ఇక ప్రతి దేశంపైనా ఎడాపెడా భారీ టారిఫ్‌లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్నే అతలాకుతలం చేసేశారు ట్రంప్. మాట వినని దేశాలను బెదిరించేందుకు టారిఫ్‌లను అస్త్రంగా ప్రయోగిస్తూ విపరీతమైన చెడ్డపేరు తెచ్చుకున్నారు. తన ఏడాది పాలన ఘనతలపై మంగళవారం మీడియాతో ట్రంప్ ఏకంగా గంటా నలభై నిమిషాల పాటు ప్రసంగించారు. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 365 విజయాలు సాధించానంటూ గొప్పలకు పోయారు.
అమెరికాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేయడంతో పాటు పలు అద్భుతాలు చేశానని చెప్పుకున్నారు. ఆ క్రమంలో మూడొంతులకు పైగా అర్ధసత్యాలు, అసత్యాలే చెప్పి విస్మయపరిచారు. పొరుగు దేశాలను అమెరికాలో కలిపేసుకోవాలన్న విస్తరణ కాంక్షను, గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్ మిత్ర దేశాలతో కూడా కయ్యానికి కాలు దువ్వడాన్నీ అడ్డంగా సమర్థించుకున్నారు. ఈ పెడ పోకడలపై మీడియా అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ధోరణిలోనే బదులిచ్చి సరిపెట్టారు. గడచిన ఏడాదికాలంలో అటు సొంత ప్రజలను, ఇటు ప్రపంచాన్ని ట్రంప్ హడలెత్తించిన తీరుపై ఫోకస్...
టారిఫ్‌లే టారిఫ్‌లు
టారిఫ్‌లు. ఈ ఏడాది పొడవునా ట్రంప్‌కు ఫేవరెట్‌గా మారిన పదం ఇదేనంటే అతిశయోక్తి కాదు. మిత్రులు, ప్రత్యర్థులు, శత్రువులు అని తేడా లేకుండా ప్రతి దేశంపైనా ఎడాపెడా సుంకాల బాదుడుకు దిగారు ట్రంప్. పిడుగుకూ, బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్టుగా ప్రతిదానికీ టారిఫ్‌లనే అస్త్రంగా ప్రయోగిస్తూ వచ్చారు. తద్వారా మొత్తంగా ప్రపంచ వాణిజ్య స్థితిగతులనే అతలాకుతలం చేసి వదిలారు. సగటున అమెరికాతో వాణిజ్యం నెరుపుతున్న ప్రతి దేశంపైనా కనీసం 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు.
భారత్‌పై అత్యధికంగా 50 శాతం మేరకు బాదారు. ఈ టారిఫ్‌లు, పన్నులు, ఫీజుల ద్వారా 2025లో అమెరికా ఏకంగా 287 బిలియన్ డాలర్లు ఆర్జించినట్టు ఆ దేశ ట్రెజరీ విభాగం గణాంకాలే చెబుతున్నాయి. తద్వారా సగటు అమెరికన్లకు ఒరిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదని యేల్ వర్సిటీ బడ్జెట్ ల్యాబ్ తేల్చింది. ట్రంప్ మతిలేని టారిఫ్‌ల వల్ల పెరిగిన నిత్యావసరాల ధరల దెబ్బకు గత ఏడాది కాలంలో ఒక్కో అమెరికన్ కుటుంబంపై కనీసం 1,500 డాలర్ల మేరకు అదనపు భారం పడ్డట్టు అంచనా వేసింది!
ఏడు దేశాలపై దాడులు!
యుద్ధాలకు తెర దించి ప్రపంచ శాంతిని సుస్థిరం చేస్తానని రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెట్టుకున్న ఒట్టును ట్రంప్ సింపుల్‌గా గట్టుమీద పెట్టేశారు. ఈ ఏడాది కాలంలో కనీసం ఏడు దేశాలపై దాడులకు తెగబడ్డారు! బాధిత దేశాల్లో ఇరాక్‌తో మొదలుపెట్టి సోమాలియా, ఇరాన్, యెమన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనెజువెలా దాకా ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి పేరు గ్రీన్‌లాండే అయ్యేలా కన్పిస్తోంది. ఆ దీవిని ఆక్రమించేందుకు యూరప్ దేశాలతో తగాదాలకు కూడా ట్రంప్ వెనకాడటం లేదు! 2024 జనవరి 20 నుంచి ఈ జనవరి దాకా అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి కనీసం 658 వాయు, డ్రోన్ దాడులకు పాల్పడ్డట్టు ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మానిటర్ పేర్కొంది!
6 లక్షల మంది గెంటివేత
ట్రంప్ ఏడాది పాలనలోనే అమెరికా నుంచి ఏకంగా 6.05 లక్షల మందిని గెంటేశారు! నిర్బంధం, అధికారుల బెదిరింపులు తదితరాలను తట్టుకోలేక ఏకంగా 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే అమెరికాను వీడి వెళ్లిపోయారు. మొత్తమ్మీద ట్రంప్ యంత్రాంగం అడ్డగోలు నిబంధనల దెబ్బకు గత ఏడాది కాలంలో అమెరికాలో నివసిస్తున్న 16 లక్షల మంది వలసదారుల హోదాను కోల్పోయారు. అంతేగాక ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 66,866 మందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్బంధించింది. అంటే సగటున రోజుకు 821 మంది ఊచలు లెక్కబెట్టారు! వీటికితోడు, ఏకంగా 75 దేశాలవారు అమెరికా ఇమిగ్రేషన్ వీసాలు పొందేందుకు వీల్లేకుండా ట్రంప్ నిషేధం విధించారు.
బెదిరింపుల దౌత్యం
దౌత్య మర్యాదలకు, సాటి దేశాధినేతలకు ఇవ్వాల్సిన కనీస గౌరవాదరాలకు కనీవినీ ఎరగని రీతిలో పాతర వేశారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని వైట్‌హౌస్ ముఖాముఖిలో మీడియా సాక్షిగా దారుణంగా అవమానించి ప్రపంచమంతా ముక్కున వేలేసుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు. పలువురు దేశాధినేతలను ఉద్దేశించి మీడియాముఖంగా బెదిరింపులకు దిగడం, వారితో తన ప్రైవేట్ సంభాషణలను బయటపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా తనతో భేటీ అంటేనే వాళ్లు తీవ్ర విముఖత చూపేదాకా తెచ్చుకున్నారు.
228 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు
2025 జనవరి 20న ప్ర మాణస్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ రికార్డు స్థాయి లో 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు (ఈఓ) జారీ చేశా రు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆప ద్ధర్మంగా మాత్రమే ఈవో అస్త్రం వాడాలన్న మర్యాదను అటకెక్కించారు. తొలి టర్ములో నాలుగేళ్లలోనూ కలిపి 220 ఈఓలు ఇస్తే, రెండో టర్ములో తొలి ఏడాది కాలంలోనే ఏకంగా 228 ఈవోలు జారీ చేసి మరో రికార్డు సృష్టించారు! పైగా ఆ ఉత్తర్వులు ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఉండొద్దన్న రాజ్యాంగ నిర్దేశాన్ని కూడా తుంగలో తొక్కారు. దాంతో ట్రంప్ ఈవోలు చాలావరకు కోర్టు కేసులకు దారితీశాయి.
పర్యావరణం గాలికి
అగ్రరాజ్యంగా అమెరికాను పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో ముందు నిలపాల్సింది పోయి, ఆ బాధ్యతలను క్రమంగా పూర్తిగా వదిలించుకుంటూ ట్రంప్ చేతులు దులుపుకుంటున్నారు. పారిస్ ఒప్పందంతో పాటు పలు కీలకమైన పర్యావరణ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ దిశగా తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 30కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసి పారేశారు. పైగా సముద్రాల్లో ఏకంగా 25 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్‌కు పచ్చజెండా ఊపారు!!
ఉద్యోగాలు హుష్‌కాకి!
ప్రపంచ దేశాల మీదే కాదు, తన ను నమ్మి గద్దెనె క్కించిన అమె రికన్లపై కూడా ట్రంప్ ఏమాత్రం కనికరం చూపలేదు. కేవలం 10 నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 3.17 లక్షల ఉద్యోగాలను పీకిపారేశారు! అమెరికాను తిరిగి శక్తిమంతమైన దేశంగా మార్చేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తెచ్చిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) వ్యయ నియంత్రణ పేరుతో ఇలా ఎడాపెడా ఉద్యోగాలను తీసేస్తూ పోయింది. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (డీఈఐ) కార్యాలయాలన్నింటకీ మూత వేసింది. అంతర్జాతీయ అభివృద్ధి విభాగాన్నే నామరూపాల్లేకుండా చేసేసింది!
– సాక్షి, నేషనల్ డెస్క్


