కౌండిన్యలో గజరాజులకు ప్రాణగండం
అడవి దాటితే అంతే!
పదేళ్లలో 23 దాకా మృత్యువాత
కరెంట్‌షాక్‌లతోనే 15 ఏనుగులు బలి
తాజాగా కల్లుపల్లి వద్ద మదపుటేనుగు మృతి
ఏనుగులను కాపాడుకోవడంలో అటవీశాఖ విఫలం
అడవిలో కడుపు నిండా మేత లేక.. చాలినంత నీరు దొరక్క ఏనుగులు పొలం బాట పడుతున్నాయి. తమకిష్టమైన టమాట, వరి, అరటి, మామిడి తోటలపై పడి ఆరగిస్తున్నాయి. అడవి నుంచి బయటకొచ్చి వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో మృత్యువులా వేలాడుతున్న కరెంట్ తీగలు తగులుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. గత పదేళ్లలో మొత్తం 23 ఏనుగులు మృతిచెందగా.. వాటిలో 15 దాకా కరెంట్ షాక్‌తో మృతిచెందడం అటవీశాఖ అధికారుల భద్రతా చర్యలను ప్రశ్నిస్తున్నాయి. మరికొన్ని పాడుబడిన బావుల్లో.. ఇంకొన్ని మదపుటేనుగుల పెనుగులాటల్లో ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం, కల్లుపల్లి వద్ద మదపుటేనుగు మృత్యువాత పడింది.
పలమనేరు: కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీనిలో ఏనుగుల మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. అడవి దాటిన ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అడవిలోంచి మేతకోసం వచ్చే ఏనుగులు పలు రకాల ప్రమాదాల బారినపడి మృతిచెందుతున్నాయి. తాజాగా కల్లుపల్లి వద్ద ఓ మదుపుటేనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఇప్పటికి 23 ఏనుగులు మృతిచెందాయి. ఏనుగులను కాపాడుకోవడంలో అటవీశాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆహా‘కా’రం!
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం తక్కువ. ఇష్టౖమైన ఆహారం కోసం అడవిని దాటుతున్నాయి. భయానికి గురై అటవీశాఖ ఏర్పాటు చేసిన సోలార్‌ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లను ధ్వంసం చేసి బయటకు వస్తున్నాయి. పొలాల్లోని మామిడి, టమాట, వరి లాంటి ఇష్టమైన ఆహారం కోసం అన్వేíÙస్తున్నాయి. మరికొన్ని కొత్త ప్రాంతాలకు వెళుతున్నాయి. ఇటీవల కాలంలో కౌండిన్యలోని ఏనుగులు గంగవరం, పెద్దపంజాణి, సోమల మీదుగా చంద్రగిరివైపు, బంగారుపాళెం, గుడిపాల వైపు వెళ్లాయి.
మదపు టేనుగులే బలి!
చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్‌రేంజ్‌ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంతోపాటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, ధర్మపురి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్‌గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ఏనుగులు ప్రవేశిస్తుంటాయి. వీటిల్లో 23 ఏనుగులు వివిధ కారణాలతో మృతిచెందాయి. గత పదేళ్లలో కరెంట్ షాక్‌లతోనే 15 ఏనుగులు మృతిచెందాయి. మిగిలినవాటిల్లో మూడు మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. మరో రెండు మదపుటేనుగుల దాడులతో, మిగిలినవి పాడుబడిన బావు ల్లో పడడంతో చనిపోయాయి. ముఖ్యంగా ఏనుగులకు కరెంట్ శత్రువులా మారింది. మేతకోసం అడవిని దాటి పంటలపైకొచ్చే ఏనుగులు ఎక్కువగా కరెంట్‌షాక్‌లతో మృతిచెందుతున్నాయి.
సమాచారం
⇒ కౌండిన్యలో మొత్తం ఏనుగులు 107 దాకా
⇒ ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఏనుగులు 71 దాకా
⇒ కరెంట్ షాక్‌తోనే మృతిచెందిన ఏనుగులు 15
⇒ తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే సంచార ఏనుగులు 36
⇒ ఇప్పటిదాకా వివిధ కారణాలతో మృతిచెందిన మొత్తం ఏనుగులు 23
శాశ్వత పరిష్కారం చేపడితేనే
అడవిని దాటి ఏనుగులు రాకుండా అటవీశాఖ శాశ్వత పరిష్కారాలను చూపడంతో విఫలమవుతోంది. తాజాగా కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోని ఏనుగులను కట్టడి చేసే కార్యక్రమం సైతం విజయవంతం కాలేదు. దీంతో ఏనుగులు యథేచ్ఛగా అడవిని దాటి బయటకొస్తున్నాయి. జాతీయ సంపదైన ఏనుగులను కాపాడుకొనేందుకు అటవీశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


