తీర ప్రాంతం పర్యాటకానికి అనువు
ఓ వైపు నది మరోవైపు సముద్రంతో కనువిందు
నది మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన దీవులు
ఆకట్టుకుంటున్న పెనుమూడి రేవు
పలు సినిమా షూటింగ్‌ల చిత్రీకరణ
రేపల్లె: సహజ సౌందర్యానికి చిరునామాగా నిలుస్తున్న బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలను కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు కృష్ణానది, మరోవైపు సముద్రం కలిసి రమణీయ దృశ్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. నదీ ప్రవాహం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న చిన్న దీవులు ఈ ప్రాంత ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన పెనుమూడి రేవు సందర్శకులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. పర్యాటకులను ఆకర్షిస్తున్న దిండి, నిజాంపట్నం బీచ్‌లు విహారయాత్రలకు అనువుగా ఉన్నాయి. రమణీయంగా విస్తరించిన మడ అడవులు ఈ ప్రాంతానికి మరింత సహజ సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలతో రేపల్లె తీర ప్రాంతం భవిష్యత్తులో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ఆపార అవకాశాలు కలిగిఉంది.
పెనుమూడి రేవు ప్రత్యేక ఆకర్షణ:
చారిత్రక ప్రాధాన్యం కలిగిన పెనుమూడి రేవు పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ఒకప్పుడు వాణిజ్యానికి కీలకంగా ఉన్న ఈ రేవు ప్రస్తుతం పర్యాటక దృష్ట్యా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అలాగే దిండి, నిజాంపట్నం బీచ్‌లు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రశాంత వాతావరణం, విస్తారమైన సముద్ర తీరం విహారయాత్రలకు అనువుగా ఉన్నాయి.

సహజ సిద్ధంగా ఏర్పడిన దీవులు
పెనుమూడి–పులిగడ్డ మధ్యలో సహజంగా ఏర్పడిన చిన్న చిన్న దీవులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణమ్మ కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే హంసలదీవిలో కలిసే ముందు కృష్ణా జిల్లా పులిగడ్డ–బాపట్ల జిల్లా పెనుమూడి మధ్యలో మూడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ పాయల మధ్యలో సహజ సిద్ధంగా ఉన్న దీవులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సూర్యాస్తమయ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేస్తాయి.

ఆకర్షించే బీచ్‌లు
తీరంలో సరైన మౌలిక వసతులు, బీచ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే గమ్యస్థానాలుగా మారడం ఖాయం. ప్రకృతి– అభివృద్ధి సమన్వయానికి ప్రతీకగా నిలువగల ఈ తీరప్రాంతాల అభివృద్ధి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజాంపట్నంహార్బర్‌లో గత వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.451 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులతో కొంత వరకు రూపురేఖలు మారాయి.
సినిమా షూటింగ్‌లకు కేంద్రం
ఈ ప్రాంతంలోని సహజ దృశ్యాలు ఇప్పటికే పలు సినిమా షూటింగ్‌లకు వేదికయ్యాయి. వెండితెరపై కనిపించిన తీరం అందాలు పర్యాటక ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. గతంలో పెనుమూడి రేవు, కృష్ణానది వారధిపై జయ జానకీ నాయక, పండుగాడు ఫొటో స్టూడియో వంటి సినిమాల షూటింగులతో పాటు పలు టెలిఫిలింల చిత్రీకరణ జరిగాయి.
అభివృద్ధిపై ఆశలు
జాతీయ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై సమగ్ర దృష్టి సారించి రేపల్లె తీర ప్రాంతంలో మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు మెరుగుపరిస్తే రేపల్లె తీర ప్రాంతం రాష్ట్ర స్థాయిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదగగలదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పర్యాటక రంగం విస్తరిస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మడ అడవుల రమణీయత
తీర ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు పర్యావరణ పరిరక్షణకు కీలకంగా నిలుస్తూనే ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి. జీవ వైవిధ్యంతో కళకళలాడే ఈ అడవులు ఎకో టూరిజానికి అనువైన ప్రాంతాలుగా గుర్తింపు పొందుతున్నాయి. పక్షి జాతులు, సముద్ర జీవులు సమృద్ధిగా ఉండటంతో ప్రకృతి ప్రేమికులకు ఇది అనుకూల ప్రాంతంగా మారింది.


