ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ సుంకాల పోటు
చాబహర్‌పై ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన భారత్
అక్కణ్నుంచి వెనక్కి తగ్గుతోంది: అంతర్జాతీయ మీడియా
ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోతున్నారన్న కాంగ్రెస్
సుంకాలు అమల్లోకి వస్తే భారత్‌కు నష్టమే: నిపుణులు
ఇరాన్‌లోని చాబహర్ ఓడ రేవు భారత్‌లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉంది. పోర్ట్ నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్‌హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడింది. భారత్‌పై పెత్తనం చేయడానికి ట్రంప్‌ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది అయితే, కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహర్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్ట్ నుంచి భారత్ నిజంగా వెనక్కి తగ్గుతుందా, అదే జరిగితే మనకు నష్టమెంత అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
గ్వాదర్ పోర్టుకు పోటీగా..
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్ట్‌కు పోటీగా ఇరాన్ తీరంలో చాబహర్ పోర్ట్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గత ఏడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాబహర్ పోర్ట్‌పై సెప్టెంబర్‌లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్‌కు సూచించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచి్చంది. పోర్ట్ నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్‌కు 12 కోట్ల డాలర్లు బదిలీ చేసింది.
ఎందుకంత కీలకం?
చాబహర్ ఓడ రేవు ఇరాన్‌లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో.. పాక్‌లోని గ్వాదర్ పోర్ట్‌కు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్‌పాయింట్ లాంటి హొర్మూజ్ జలసంధికి సమీపంలోనే ఉండడంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్‌ఎస్‌టీసీ)లో చాబహర్ పోర్ట్ ముఖ్యమైనది.
ముంబై నుంచి ఈ పోర్ట్ గుండా రష్యా, యూరప్‌లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోతుంది. అరేబియా, పశి్చమ హిందూ మహా సముద్రంలో పాక్–చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్ట్ నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరుదేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్‌లో చాబహర్‌లో భారత కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహర్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దులోని జహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంది.
సుంకాలతో భారత్‌కు నష్టమే
చాబహర్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం 370 మిలియన్ డాలర్లు. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి కాగా, 250 మిలియన్ డాలర్లను ఇరాన్‌కు రుణంగా ఇస్తోంది. 120 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఇరాన్‌కు అందించింది. చాబహర్‌పై విధించిన ఆంక్షలు గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపుకోసం భారత ప్రభుత్వం ప్రయతి్న స్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్‌పై ట్రంప్ ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడంలేదు.
పోర్ట్ విషయంలో ఇలాగే ముందుకు వెళ్తే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్‌పై మరో 25 శాతం సుంకాలు అమల్లోకి వచి్చనా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. 120 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వదులుకోవాలా? లేక అమెరికాతో జరిగే 132 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని వదులుకోవాలా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహర్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొ చ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


