breaking news
India Investments
-
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్ పెట్టుబడులకు అనుకూలమైన అనేక విధానాలను అమలు చేస్తోందని, దేశీయంగా సుశిక్షితులైన నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని ఐసీసీ గ్లోబల్ సమిట్ 2025లో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆయన ఆహా్వనించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యూయల్స్ అభివృద్ధిలో భారత్ విశేషంగా రాణిస్తోందని చెప్పారు. ఇంజినీరింగ్ నిపుణుల లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాల, రాజకీయంగా పటిష్టమైన మద్దతు వంటి సానుకూలాంశాల కారణంగా ఇన్వెస్టర్లకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానం కాగలదన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో ముడి వస్తువుల ధరలు తక్కువగా ఉండటంతో పాటు ఉత్పత్తులు అత్యంత నాణ్యమైనవిగా ఉంటాయని గడ్కరీ వివరించారు. ‘మేము నాణ్యతకు కట్టుబడి ఉన్నాం. ఆ విషయంలో రాజీపడకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలనుకుంటున్నాం. ఇది ప్రపంచ ప్రజలందరికీ మేలు చేస్తుంది‘ అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించాలని, ఆత్మనిర్భర్ భారత కలను సాకారం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. హైడ్రోజన్‌పై మరింత దృష్టి.. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించేందుకు, పర్యావరణహిత ఇంధనాలను అభివృద్ధి చేసేందుకు, పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించేందుకు, రహదారి..రైలు..జలమార్గాల కనెక్టివిటీని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధి చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గడ్కరీ చెప్పారు. ‘మేము ఇథనాల్, మిథనాల్, బయోడీజిల్, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్స్‌పై ఏకకాలంలో పని చేస్తున్నాం. అదే సమయంలో హైడ్రోజన్‌పై కూడా టాటా మోటర్స్, అశోక్ లేల్యాండ్, రిలయన్స్, హెచ్పీసీఎస్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీలాంటి కంపెనీలు పని చేస్తున్నాయి. హైడ్రోజన్ తయారీకి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. అయితే, 1 కేజీ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి 50 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. భారత్‌లో (హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు) ఖర్చు సుమారు రూ. 250–200గా (కేజీకి) ఉంటుంది. దీన్ని 1 డాలర్ స్థాయికి (సుమారు రూ. 88) తీసుకురావాలనేది నా లక్ష్యం‘ అని వివరించారు. ఇది చాలా కష్టమే అయినప్పటికీ, భారత్ ప్రయతి్నస్తోందని గడ్కరీ చెప్పారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి ప్రైవేట్ రంగం ద్వారా దేశీయంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమను పటిష్టం చేయడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోందని డిఫెన్స్ ప్రొడక్షన్ కార్యదర్శి సంజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి పాలసీలు, ప్రక్రియల గురించి అర్థవంతమైన సలహాలను సంబంధిత నిబంధనల్లో పొందుపర్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్వావలంబన సాధనే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీన్ని సాధించాలంటే తయారీలోనే కాకుండా డిజైన్‌తో పాటు మనం ఉపయోగించే అన్ని ప్లాట్‌ఫాంలపై మనకు పూర్తి నియంత్రణ ఉండాలని, బైటి ఏజెన్సీలపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదని కుమార్ వివరించారు. -
అమెజాన్ ఆ మార్కును క్రాస్ చేసేసింది!
బెంగళూరు : ప్రముఖ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే అమెజాన్ తాజాగా పెట్టిన పెట్టుబడులతో 2 బిలియన్ డాలర్ల మార్కును చేధించింది. తన ప్రధాన స్థానిక అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌లోకి రూ.1,680 కోట్లను పెట్టుబడులుగా పెట్టి, ఈ మార్కును అధిగమించింది. తాజాగా పెట్టిన పెట్టుబడులతో కంపెనీ మొత్తం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు భారత్‌లో రూ.13,800 కోట్లకు పైగా ఉన్నట్టు అంటే 2.1 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు తెలిసింది. ఈ పెట్టుబడులతో దేశీయ డిజిటల్ ఎకానమీలో అమెజాన్ రెండో అతిపెద్ద గ్లోబల్ ఇన్వెస్టర్‌గా కూడా చోటుదక్కించుకుంది. తొలిస్థానంలో జపనీస్ ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు ఉంది. ఈ కంపెనీ 4 బిలియన్ డాలర్లను ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులుగా పెట్టింది. ఫ్లిప్‌కార్ట్ బ్యాకర్ టైగర్ గ్లోబల్ కూడా భారత్‌లో భారీగానే పెట్టినప్పటికీ, ఆ పెట్టుబడులు అమెజాన్ కంటే తక్కువగా ఉన్నాయి. గత నెల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశంపై ఉన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎల్లప్పుడూ తాము చాలా ఆత్రుతతో ఉంటామని చెప్పారు. కొత్తగా పెట్టిన ఈ పెట్టుబడులు అమెజాన్ భారత్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న 5 బిలియన్ డాలర్లలో ఓ భాగం. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలపై అమెజాన్ ఇండియా ఎక్కువగా దృష్టిసారించింది. ఫ్యాషన్‌లో తామే ముందంజలో ఉండాలని నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల కాలంలో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా పెంచుకోవాలని ఆశిస్తోంది. సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్రైమ్ ప్రొగ్రామ్‌ను ఇండియాలో లాంచ్ చేసిన ఏడాది తర్వాత, ప్రైమ్ కింద ఆఫర్లను కూడా పెంచింది. దీంతో ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడం, ఈ ప్రొగ్రామ్‌ను రెన్యూవల్ చేయించుకోవడం చేస్తారని కంపెనీ ప్లాన్ చేసింది. ఈ పెట్టుబడులను ఫెస్టివ్ సీజన్లో నిర్వహించే అతిపెద్ద సేల్ ఈవెంట్లకు వెచ్చించాలని కూడా నిర్ణయిస్తోంది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ కూడా చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం టాన్సెంట్ నుంచి 1.4 బిలియన్ డాలర్లను స్వీకరించింది. ఈ రెండు సంస్థలు ఈకామర్స్ మార్కెట్లో గట్టిపోటీతో ముందుకు దూసుకెళ్తున్నాయి. -
ఆసియాన్‌తో అనుబంధం
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ * భారత్‌తో ఎంఓయూలు కుదుర్చుకున్న కంబోడియా నాంఫెన్(కంబోడియా): ఆసియాన్ కూటమి దేశాలతో భారత్ వాణిజ్యం, సంస్కృతి, అనుబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. మూడు రోజుల కంబోడియా పర్యటనలో ఉన్న అన్సారీ బుధవారం ఆ దేశ ప్రధాని హున్సెన్తో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఆసియాన్ దేశాలలో భారత్ పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల్లో టూరిజం, త్వరిత ప్రభావిత ప్రాజెక్టుల(క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు(క్యూఐపీ))పై అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ క్యూఐపీలో మెకాంగ్-గంగా సహకారం, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మహిళా సాధికారత, వ్యవసాయ సహకారంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రానికి రూ.33లక్షల గ్రాంటు ఉన్నాయి. ఆరోగ్య, వ్యవసాయ ప్రాజెక్టులకు భారత్ సహకరిస్తోందని హున్సెన్ చెప్పారు. కంబోడియా మంత్రిమండలి కార్యాలయంలో మంత్రులను ఉద్దేశించి అన్సారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందం త్వరలోనే కుదురుతుందన్నారు. ఆసియాన్ దేశాల మధ్య అనుసంధానం కోసం రూ. 6,600 కోట్ల మూలధనాన్ని భారత్ ప్రకటించిందని, ప్రస్తుతం ఆసియాన్, భారత్‌ల మధ్య ఉన్న సంబంధాలు పారిశ్రామిక వాణిజ్య పెట్టుబడులకు అవకాశాలను మరింత ప్రోత్సహించేవిగా ఉన్నాయని అన్సారీ అన్నారు.