అమెజాన్ ఆ మార్కును క్రాస్ చేసేసింది!
ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది.
బెంగళూరు : ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే అమెజాన్ తాజాగా పెట్టిన పెట్టుబడులతో 2 బిలియన్ డాలర్ల మార్కును చేధించింది. తన ప్రధాన స్థానిక అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌లోకి రూ.1,680 కోట్లను పెట్టుబడులుగా పెట్టి, ఈ మార్కును అధిగమించింది. తాజాగా పెట్టిన పెట్టుబడులతో కంపెనీ మొత్తం క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్లు భారత్‌లో రూ.13,800 కోట్లకు పైగా ఉన్నట్టు అంటే 2.1 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు తెలిసింది. ఈ పెట్టుబడులతో దేశీయ డిజిటల్ ఎకానమీలో అమెజాన్ రెండో అతిపెద్ద గ్లోబల్ ఇన్వెస్టర్‌గా కూడా చోటుదక్కించుకుంది. తొలిస్థానంలో జపనీస్ ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు ఉంది. ఈ కంపెనీ 4 బిలియన్ డాలర్లను ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులుగా పెట్టింది. ఫ్లిప్‌కార్ట్ బ్యాకర్ టైగర్ గ్లోబల్ కూడా భారత్‌లో భారీగానే పెట్టినప్పటికీ, ఆ పెట్టుబడులు అమెజాన్ కంటే తక్కువగా ఉన్నాయి.
గత నెల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశంపై ఉన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎల్లప్పుడూ తాము చాలా ఆత్రుతతో ఉంటామని చెప్పారు. కొత్తగా పెట్టిన ఈ పెట్టుబడులు అమెజాన్ భారత్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న 5 బిలియన్ డాలర్లలో ఓ భాగం. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలపై అమెజాన్ ఇండియా ఎక్కువగా దృష్టిసారించింది. ఫ్యాషన్‌లో తామే ముందంజలో ఉండాలని నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల కాలంలో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా పెంచుకోవాలని ఆశిస్తోంది.
సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్రైమ్ ప్రొగ్రామ్‌ను ఇండియాలో లాంచ్ చేసిన ఏడాది తర్వాత, ప్రైమ్ కింద ఆఫర్లను కూడా పెంచింది. దీంతో ప్రైమ్ మెంబర్‌షిప్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడం, ఈ ప్రొగ్రామ్‌ను రెన్యూవల్ చేయించుకోవడం చేస్తారని కంపెనీ ప్లాన్ చేసింది. ఈ పెట్టుబడులను ఫెస్టివ్ సీజన్‌లో నిర్వహించే అతిపెద్ద సేల్ ఈవెంట్లకు వెచ్చించాలని కూడా నిర్ణయిస్తోంది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ కూడా చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం టాన్సెంట్ నుంచి 1.4 బిలియన్ డాలర్లను స్వీకరించింది. ఈ రెండు సంస్థలు ఈకామర్స్ మార్కెట్లో గట్టిపోటీతో ముందుకు దూసుకెళ్తున్నాయి.