
ఆసియాన్‌తో అనుబంధం
ఆసియాన్ కూటమి దేశాలతో భారత్ వాణిజ్యం, సంస్కృతి, అనుబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు.
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ
* భారత్‌తో ఎంఓయూలు కుదుర్చుకున్న కంబోడియా
నాంఫెన్(కంబోడియా): ఆసియాన్ కూటమి దేశాలతో భారత్ వాణిజ్యం, సంస్కృతి, అనుబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. మూడు రోజుల కంబోడియా పర్యటనలో ఉన్న అన్సారీ బుధవారం ఆ దేశ ప్రధాని హున్‌సెన్‌తో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఆసియాన్ దేశాలలో భారత్ పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల్లో టూరిజం, త్వరిత ప్రభావిత ప్రాజెక్టుల(క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు(క్యూఐపీ))పై అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
ఈ క్యూఐపీలో మెకాంగ్-గంగా సహకారం, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మహిళా సాధికారత, వ్యవసాయ సహకారంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రానికి రూ.33లక్షల గ్రాంటు ఉన్నాయి. ఆరోగ్య, వ్యవసాయ ప్రాజెక్టులకు భారత్ సహకరిస్తోందని హున్‌సెన్ చెప్పారు. కంబోడియా మంత్రిమండలి కార్యాలయంలో మంత్రులను ఉద్దేశించి అన్సారీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందం త్వరలోనే కుదురుతుందన్నారు. ఆసియాన్ దేశాల మధ్య అనుసంధానం కోసం రూ. 6,600 కోట్ల మూలధనాన్ని భారత్ ప్రకటించిందని, ప్రస్తుతం ఆసియాన్, భారత్‌ల మధ్య ఉన్న సంబంధాలు పారిశ్రామిక వాణిజ్య పెట్టుబడులకు అవకాశాలను మరింత ప్రోత్సహించేవిగా ఉన్నాయని అన్సారీ అన్నారు.