సాక్షి, విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం ముందునుంచీ నిజాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గూగుల్‌తో ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూకి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ‘ఈ వివరాలు ఇవ్వకూడదు. కాన్ఫిడెన్షియల్’ అంటూ సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది.
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు బాబు ప్రభుత్వం చెబుతున్న గూగుల్ డేటా సెంటర్ ఎంవోయూ వివరాలు ఇవ్వాలంటూ అనకాపల్లి జిల్లాకు చెందిన బుద్దా చక్రధర్ గత నెల 4న ఏపీఐఐసీకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర సచివాలయం అసిస్టెంట్ సెక్రటరీ పేరుతో ప్రభుత్వం పోస్టు ద్వారా పంపిన జవాబు శనివారం చక్రధర్‌కు చేరింది.
‘ఈ ఎంవోయూ వివరాలు చాలా రహస్యంగా ఉంచాలి’ అని స్పష్టంచేసింది. దీనిపై మానవ హక్కుల వేదిక, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. డేటా సెంటర్ ఒప్పందాన్ని గేమ్‌చేంజర్‌గా చెబుతున్న ప్రభుత్వం.. అసలు ఎంవోయూ విషయాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నిస్తున్నారు.
స.హ.చట్టం ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన!
ఎంవోయూ వివరాలు ఇవ్వకుండా సమాచార హక్కు చట్టం–2005 ప్రాథమిక సూత్రాలను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించినట్లేనని మానవహక్కుల వేదిక ఏపీ, తెలంగాణ కో–ఆరి్డనేషన్ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ, యూఎఫ్‌ఆర్‌టీఐ కో–కన్వీనర్ చక్రధర్ వ్యాఖ్యానించారు.


