సోషల్ మీడియాతో పోస్టాఫీసుల వద్దకు పరుగులు తీస్తున్న మహిళలు
తీరా ఏమీ లేదంటూ శాపనార్థాలతో తిరుగుముఖం
చిత్తూరు జిల్లా: ‘రాండొక్కో చంద్రన్న మన ఆడోళ్లకు మనిషికి రూ.15 వేల చొప్పున అకౌంట్‌లో వేశాడంట.. పోస్టాఫీసులో అకౌంట్ ఉండేవాళ్లు చెక్ చేసుకోండి’ అని ప్రచారం సాగింది. దీంతో వందలాది మంది మహిళలు పట్టణంలోని పోస్టాఫీసు వద్దకు చేరుకుని ఖాతాల్లో డబ్బులు పడలేదని ఉసూరుమంటూ వెనుదిగాల్సి వస్తోంది. పలమనేరు హెడ్‌పోస్టాఫీసు కొద్దిరోజులుగా మహిళలతో నిండిపోతోంది. ఖాతాలు తెరిచేందుకు కొందరు, డబ్బులు పడ్డాయేమో చెక్ చేసుకునేందుకు పోస్టాఫీసు వద్దకు వస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారం ఎవరు చేశారో గాని ఏమి సమాధానం చెప్పాలో తెలియక పోస్టల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


