విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన అధికారులు సందర్శకులను నిలిపివేయడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబాలతో వచ్చిన సందర్శకులు జూ ప్రవేశం అనుమతి లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.
పవన్ కళ్యాణ్ జూ పర్యటన సందర్భంగా భద్రతా కారణాలతో ప్రధాన గేట్ల వద్ద కఠిన ఆంక్షలు విధించారు. దీంతో ఉదయం నుంచి టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్లేందుకు వచ్చిన సందర్శకులను పోలీసులు అడ్డుకున్నారు. సందర్శకులు మాట్లాడుతూ.. ముందుగా సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ప్రవేశం నిలిపివేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దూర ప్రాంతాల నుంచి పిల్లలతో కలిసి వచ్చామని, ఇప్పుడు నిరాశతో వెనుదిరుగాల్సి వచ్చిందని తెలిపారు. అధికారులు మాత్రం భద్రతా కారణాలతో తాత్కాలికంగా జూ సందర్శనను నిలిపివేశామని, పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయిన తర్వాత పరిస్థితిని సమీక్షించి సందర్శకులకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.


