సాక్షి, విజయవాడ: సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏఐతో ఎడిట్‌లు చేస్తూ.. ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు.. వైఎస్సార్‌సీపీ ద్రోహం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది.
టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో.. వెంకటేశ్వర్ స్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టుల కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని.. ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ‘‘మహా పాపం నిజం. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు. దాంతోనే 20కోట్ల లడ్డూలు తయారు చేశారు. వైకాపా పెద్దలు రూ.251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు’’ అని వాటిపై పేర్కొన్నారు.
ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్‌లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్‌లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్‌లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం.


