అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని లేబర్ వార్డులో ఓ బిడ్డ కన్పించకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం..ఆ తర్వాత బిడ్డను కుటుంబీకులే తెలిసిన వారికి ఇచ్చినట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్, ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత తెలిపిన వివరాల మేరకు..అనంతపురం రూరల్ పరిధిలోని బీజేపీ కొట్టాలకు చెందిన దంపతులకు ఇది వరకే ముగ్గురు సంతానం(ఇద్దరు ఆడ పిల్లలు, మగపిల్లాడు). నాల్గో కాన్పునకు ఆమె సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 24న సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం శిశువుకు వ్యాక్సిన్లు వేయించారు. తర్వాత శిశువు అదృశ్యమైంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత వెంటనే టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన సిబ్బందితో వచ్చి కుటుంబ సభ్యులను తమదైన శైలిలో విచారించారు. అసలు విషయం వెలుగు చూసింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండడంతో నాల్గోబిడ్డ పోషణ భారమవుతుందని భావించి బీజేపీ కొట్టాల వద్ద నివాసముండే రహీమ్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇచ్చేశామని తెలిపారు. దీంతో చిన్నారిని స్వా«దీనం చేసుకుని తిరిగి ఆస్పత్రిలో చేరి్పంచారు. బిడ్డ సురక్షితంగా ఉందని సీఐ తెలిపారు.


