సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గీతం సంస్థ భూ కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ స్టాండ్ ఏమిటని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. గతంలో విశాఖలో ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాటం లేదు. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు.
విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములను వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకునేతల పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు, మాజీ మంత్రి అమర్నాథ్ నియోజకవర్గ సమన్వయకర్తలు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. గీతం భూ కబ్జాపై సీబీఐ విచారణ వేయాలంటూ డిమాండ్ చేశారు.
అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘చంద్రబాబు భూ దోపిడీని అడ్డుకోవడానికి గీతం యూనివర్సిటీకి వచ్చాము. చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదువేల కోట్ల భూమి ప్రభుత్వానికి చెందిందని గత వైఎస్సార్‌సీ ప్రభుత్వ హయాంలో హెచ్చరిక బోర్డులు పెట్టాం. ప్రభుత్వ భూమిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటారా?. చంద్రబాబు లెజెండరీ అని రోజూ సొల్లు కబుర్లు చెబుతారు. భూ కబ్జాలు చేయడమేనా మీ లెజెండరీ. ఏబీఎన్, టీవీ-5, ఈనాడులకు భూ దోపిడీ కనిపించడం లేదా?. భూ కబ్జాపై నోరూ విప్పాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్‌కు ఉంది. విశాఖలో ఉండి కూడా పవన్ గీతంపై ఎందుకు మాట్లాడలేదు?. గీతం భూ దోపిడీపై బీజేపీ, జనసేన మాట్లాడాలి. అవసరమైతే గీతం భూకబ్జా భూములను పరిశీలించడానికి వైఎస్ జగన్‌ను పిలుస్తాము. చంద్రబాబు భూ దోపిడీపై ప్రజలు ఆలోచన చేయాలి. భూ దోపిడీని రేపు కౌన్సిల్‌లో అడ్డుకుంటాం అని హెచ్చరించారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘గీతం సంస్థకు భూమి కట్టబెట్టడంలో ప్రభుత్వం బరితెగించింది. భూములను ధారాదత్తం చేస్తే అడిగే వారు లేరని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. మా ప్రభుత్వం టూరిజం భవనాలు కడితే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు గీతం సంస్థకు 55 ఎకరాలు కట్టబెడుతుంది ప్రభుత్వం. గీతం భూ కబ్జాపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటి?. గతంలో ఇక్కడికి వచ్చి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఏం తప్పు చేసినా మాట్లాడకుండా ఉండటమే మీ స్టాండా పవన్?. తిరుమల లడ్డు విషయం ఇప్పుడు పవన్ ఎందుకు మాట్లాడటం లేదు.
జీవీఎంసీ అజెండా నుంచి గీతం భూముల అంశం తీసేయ్యాలి. లేదంటే జీవీఎంసీ కౌన్సిల్ జరగనివ్వం. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. గీతం సంస్థ కబ్జా చేసి కేటాయించమని అడుగుతుంది. ఈ కబ్జాను అంగీకరించిన రోజే ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రచ్చ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ నడుస్తోంది. ఎంపీ భరత్ మీద కేసు పెట్టాలి. ఈ ప్రాంతంలో ఉన్న భూములను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘రుషికొండ ప్రభుత్వ భవనాలపై తప్పుడు ప్రచారం చేశారు. గీతం కబ్జాపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వేల కోట్లు విలువైన భూమి కబ్జా చేయడం ఎంతవరకు సమంజసం. గీతంలో డబ్బున్న వారు చదువుతారని ఎంపీ చెప్పారు. చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని చట్టం ఏమైనా చేశారా?. కూటమి జమానాలో భూ కబ్జాలపై పార్లమెంట్‌లో చర్చిస్తాం. గీతం కబ్జాపై కూటమి నేతలకు బాధ్యత లేదా?. ఈ భూమిని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.


