- చంద్రబాబూ నీదీ ఒక బతుకేనా?
- దేవుడి పేరుతోనూ రాజకీయాలా?
- వాటి పునాదుల మీద బతుకుతారు?
- తిరుమల లడ్డూపై సిట్ ఛార్జ్‌షీట్ చంద్రబాబుకు చెంపపెట్టు
- లడ్డూ నెయ్యిపై చంద్రబాబు, లోకేష్, పవన్ పచ్చి అబద్ధాలు
- తిరుమల శ్రీ వెంకటేశ్వరుడితోనూ వారంతా నీచ రాజకీయం
- అసలు బోలే బాబా డెయిరీకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు
- పవిత్ర తిరుమల లడ్డూపైనా విషం చిమ్మిన చంద్రబాబు
- కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బ తీయటానికి సిగ్గు లేదా?
- జంతువుల కొవ్వు కలిసిందని నాడు మాట్లాడిన చంద్రబాబు
- మరి ఇప్పుడు జనం ముందుకు ఎందుకు రావటం లేదు?
- :నందమూరి లక్ష్మీపార్వతి ఫైర్
తాడేపల్లి. ప్రపంచంలో కోట్లాది మంది పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర ప్రసాదంపైన చంద్రబాబు నీచమైన అబద్దపు ప్రచారాలు చేశారని, సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్‌షీట్ తేల్చి చెప్పిందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. దేవుడి పేరుతోనూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, ఇలా ఎంతకాలం అబద్ధాలు చెబుతూ వాటి పునాదుల మీద బతుకుతారని ఆమె చురకలంటించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడితోనూ వారంతా నీచ రాజకీయం చేస్తున్నారన్న ఆమె, అసలు బోలే బాబా డెయిరీకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. పవిత్ర తిరుమల లడ్డూపైనా విషం చిమ్మిన చంద్రబాబుకు, అలా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బ తీయటానికి సిగ్గు లేదా? అని నిలదీశారు. తిరుమల ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని నాడు మాట్లాడిన చంద్రబాబు, సిట్ ఛార్జ్‌షీట్ తర్వాత జనం ముందుకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు.
లడ్డూ తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దెబ్బ తీశారని, అందువల్ల వారి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో నందమూరి లక్ష్మీపార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:
చంద్రబాబు అబద్ధాలకు సిట్ ఛార్జ్‌షీట్‌తో చెక్
చంద్రబాబు, ఆయన కుమారుడు, వీళ్ల బానిస పవన్‌కళ్యాణ్ తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిపై నీచమైన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో అన్ని విషయాలు బట్టబయలయ్యాయి. ఆ నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిట్ తేల్చింది. అయినా చంద్రబాబు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారు. గతంలో జగన్‌గారితో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై చంద్రబాబు చెప్పినవి అబద్దాలేనని సిట్ ఛార్జ్‌షీట్ తేల్చేసింది. అలా మరోసారి చంద్రబాబు దొరికిపోయారు.
నీదీ ఒక బతుకేనా చంద్రబాబు?:
చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కూడా తిడుతున్నా మారట్లేదు. ఇదీ ఓ బతుకేనా చంద్రబాబు?. పచ్చమీడియా గొట్టాలు పెట్టుకుని ప్రచారాలు చేయించుకుంటున్నా, సోషల్ మీడియా అప్పటికప్పుడు నిజాల్ని తేటతెల్లం చేస్తోంది. తాజాగా రైతుల పాస్ బుక్కుల విషయంలోనూ జగన్ చేసిన పనిని తనదిగా చెప్పుకుని సోషల్ మీడియాకు దొరికిపోయారు. ప్రజల దురదృష్టం కొద్దీ చంద్రబాబు మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చారు. దేవుడి లాంటి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, చెప్పులేయించింది కాక, నాపైనా నిందలు వేశారు. ఇప్పటికీ పచ్చమీడియా సాయంతో అవే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.
జంతు ప్రవృత్తి ఉన్నందునే చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దేవుడినే రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు పాపం పండింది. దేవదేవునితో ఆడుకుంటున్న వారెవరూ ప్రశాంతంగా బతకలేదు. నిజానికి చంద్రబాబు ఏనాడూ తనంతట తానుగా ప్రజల మనసు గెల్చి అధికారంలోకి రాలేదు. ఎప్పుడూ, ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని ఆయన గద్దెనెక్కాడు. అదీ ఏ మాత్రం విలువలు లేని, నీచ రాజకీయ జీవితం చంద్రబాబుది.
చంద్రబాబూ.. ఇప్పటికైనా అబద్ధాల్ని ఒప్పుకోండి
తిరుమల లడ్డూపై సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పామాయిల్ తప్ప జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినా చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు కూడా చంద్రబాబును చీదరించుకుంటున్నారు. సిట్ ఛార్జ్‌షీట్ తర్వాత చంద్రబాబు తీరుపై సోషల్ మీడియా కూడా దుమ్మెత్తి పోస్తోంది. గతంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్‌పై దుమ్మెత్తిపోయడానికే అలా అబద్ధాలు చెప్పానని చంద్రబాబు ఒప్పుకోవాలి. చంద్రబాబు చెప్పిన అబద్దాలకు పచ్చ మీడియా వంతపాడి ప్రచారాలు చేసింది. చేస్తున్న తప్పులన్నీ మీవే. ఎన్నో మంచి పనులు చేసిన జగన్‌గారిని, ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికే చంద్రబాబు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేశారు.
కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తీయొద్దు
కలియుగ దైవమైన సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి వారే నెయ్యి మీద నివేదిక బయటపెట్టించాడు. గతంలో మీ కరపత్రిక అయిన ఈనాడుతో అబద్ధాలు రాతలు రాయించి ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన చరిత్ర మీది. ఇప్పటికీ అదే అబద్ధాలు ఆడుతూ దేవుడితో ఆటలు మొదలు పెట్టారు. మీ పాపాలకు తగిన మూల్యం అతి కొద్ది కాలంలోనే చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు క్రూర స్వభావం వల్లే దేవుడితో కూడా రాజకీయాలు చేయగలిగారు. ఇక ఆయన బానిస అయిన పవన్‌కళ్యాణ్ కూడా అదే బాటలో నడిచాడు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లక్షల లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపారని నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇంకా సనాతనవాది వేషం వేసి విజయవాడలో దుర్గ గుడి మెట్లు కడిగి అప్పటికప్పుడు హిందుత్వవాది అయిపోయాడు.
చివరకు పవన్‌కళ్యాణ్ కూడా ఇంతగా దిగజారాలా? ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే కనీసం సమాధానం చెప్పరా? కోట్లాది భక్తుల ఇష్టంగా స్వీకరించే ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగొద్దు. మీ హయాంలోనే వనస్పతి ఉందని నెయ్యి వెనక్కి పంపినట్లు ఈవోనే చెప్పారు. వెనక్కి పంపించిన నెయ్యి లడ్డూలో ఎలా కలుస్తుంది?. పైగా ల్యాబ్ టెస్టు తర్వాతే కదా ఏ నెయ్యి అయినా లోపలికి వస్తుంది? ఆ కంపెనీ మీద వేసిన కేసు ఇంకా నడుస్తోంది. ఇవన్నీ వదిలేసి వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి తప్పు చేశారని ఎలా చెబుతారని నందమూరి లక్ష్మీపార్వతి నిలదీశారు.


