సౌర విద్యుత్ విభాగంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)తో దీర్ఘకాలిక వ్యూహాత్మక డిజైన్, కన్‌స్ట్రక్షన్ భాగస్వామ్యానికి సంబంధించి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బొండాడ ఇంజినీరింగ్ (బీఈఎల్) తెలిపింది. ఇది అయిదేళ్ల పాటు అమల్లో ఉంటుందని వివరించింది.
దీని కింద తొలుత 650 మెగావాట్ల సౌర విద్యుత్ పనులకు సంబంధించిన భారీ ప్రాజెక్టు లభించినట్లు సంస్థ పేర్కొంది. దేశ పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాల సాధన దిశగా ఇరు కంపెనీల భాగస్వామ్యం తోడ్పడుతుందని సంస్థ సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు తెలిపారు.
మెట్రోకెమ్‌తో హెచ్‌ఆర్‌వీ ఫార్మా జట్టు
ఏపీఐ డెవలప్‌మెంట్, తయారీ సంస్థ మెట్రోకెమ్ ఏపీఐతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌కి చెందిన హెచ్‌ఆర్‌వీ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ (హెచ్‌ఆర్‌వీ ఫార్మా) తెలిపింది. నియంత్రిత మార్కెట్ల కోసం పలు ఎన్‌సీఈ–1 (న్యూ కెమికల్ ఎంటిటీ), సంక్లిష్టమైన ఏపీఐలను వేగంగా అభివృద్ధి చేసేందుకు, తయారీ చేసేందుకు ఈ సీడీఎంవో (కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, తయారీ) ఒప్పందం ఉపయోగపడుతుందని వివరించింది. దేశీయంగా తయారయ్యే వినూత్న ఆవిష్కరణలను అంతర్జాతీయంగా విస్తరించాలన్న లక్ష్యానికి ఇది సహాయకరంగా ఉంటుందని సీఈవో హరి కిరణ్ చేరెడ్డి తెలిపారు.


