భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి  | Union Minister Nitin Gadkari asks global investors to explore opportunities in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి 

Sep 19 2025 5:13 AM | Updated on Sep 19 2025 8:06 AM

Union Minister Nitin Gadkari asks global investors to explore opportunities in India

అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆహ్వానం 

న్యూఢిల్లీ: భారత్‌ పెట్టుబడులకు అనుకూలమైన అనేక విధానాలను అమలు చేస్తోందని, దేశీయంగా సుశిక్షితులైన నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకు రావాలని ఐసీసీ గ్లోబల్‌ సమిట్‌ 2025లో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్లను ఆయన ఆహా్వనించారు. 

ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యూయల్స్‌ అభివృద్ధిలో భారత్‌ విశేషంగా రాణిస్తోందని చెప్పారు. ఇంజినీరింగ్‌ నిపుణుల లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాల, రాజకీయంగా పటిష్టమైన మద్దతు వంటి సానుకూలాంశాల కారణంగా ఇన్వెస్టర్లకు భారత్‌ అత్యుత్తమ గమ్యస్థానం కాగలదన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో ముడి వస్తువుల ధరలు తక్కువగా ఉండటంతో పాటు ఉత్పత్తులు అత్యంత నాణ్యమైనవిగా ఉంటాయని గడ్కరీ వివరించారు.

 ‘మేము నాణ్యతకు కట్టుబడి ఉన్నాం. ఆ విషయంలో రాజీపడకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలనుకుంటున్నాం. ఇది ప్రపంచ ప్రజలందరికీ మేలు చేస్తుంది‘ అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించాలని, ఆత్మనిర్భర్‌ భారత కలను సాకారం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.  

హైడ్రోజన్‌పై మరింత దృష్టి.. 
లాజిస్టిక్స్‌ వ్యయాలను తగ్గించేందుకు, పర్యావరణహిత ఇంధనాలను అభివృద్ధి చేసేందుకు, పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించేందుకు, రహదారి..రైలు..జలమార్గాల కనెక్టివిటీని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధి చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గడ్కరీ చెప్పారు. ‘మేము ఇథనాల్, మిథనాల్, బయోడీజిల్, ఎల్‌ఎన్‌జీ, ఎలక్ట్రిక్స్‌పై ఏకకాలంలో పని చేస్తున్నాం. 

అదే సమయంలో హైడ్రోజన్‌పై కూడా టాటా మోటర్స్, అశోక్‌ లేల్యాండ్, రిలయన్స్, హెచ్‌పీసీఎస్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీలాంటి కంపెనీలు పని చేస్తున్నాయి. హైడ్రోజన్‌ తయారీకి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. అయితే, 1 కేజీ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడానికి 50 యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. భారత్‌లో (హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసేందుకు) ఖర్చు సుమారు రూ. 250–200గా (కేజీకి) ఉంటుంది. దీన్ని 1 డాలర్‌ స్థాయికి (సుమారు రూ. 88) తీసుకురావాలనేది నా లక్ష్యం‘ అని వివరించారు. ఇది చాలా కష్టమే అయినప్పటికీ, భారత్‌ ప్రయతి్నస్తోందని గడ్కరీ చెప్పారు.   

రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి 
ప్రైవేట్‌ రంగం ద్వారా దేశీయంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమను పటిష్టం చేయడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోందని డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి పాలసీలు, ప్రక్రియల గురించి అర్థవంతమైన సలహాలను సంబంధిత నిబంధనల్లో పొందుపర్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్వావలంబన సాధనే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీన్ని సాధించాలంటే తయారీలోనే కాకుండా డిజైన్‌తో పాటు మనం ఉపయోగించే అన్ని ప్లాట్‌ఫాంలపై మనకు పూర్తి నియంత్రణ ఉండాలని, బైటి ఏజెన్సీలపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదని కుమార్‌ వివరించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement