మరింత వేడిమిని గ్రహిస్తున్న మంచు
శరవేగంగా కరిగిపోతున్న వైనం
విపరిణామాలు ఖాయం: సైంటిస్టులు
సముద్రమట్టాలు పెరుగుతాయి
తీర పట్టణాలు, ప్రాంతాలకు ముప్పు
ప్రపంచంలోనే అతి పెద్దవైన గ్రీన్‌లాండ్ దీవులకు పెను ముప్పు పొంచి ఉంది. అయితే అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది నెలలుగా బెదిరిస్తూ వస్తున్న ఆక్రమణ ముప్పు కాదు. పాచి ముప్పు! అవును. అపారమైన మంచుకు నిలయమైన గ్రీన్‌లాండ్ దీవులు నానాటికీ విపరీతంగా పాచిపట్టిపోతున్నాయి! దాంతో అక్కడ మంచు కరుగుదల రేటు చూస్తుండగానే మరింత ప్రమాదకర స్థాయికి పెరిగిపోతోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే గ్రీన్‌లాండ్‌కే కాక ప్రపంచమంతటికీ త్వరలో పెను ముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పలు తీర నగరాలు, ప్రాంతాలు అనుకున్న దానికంటే చాలా ముందుగానే సముద్రంలో మునిగిపో తాయని అంచనా వేస్తున్నారు.
దుమ్ము తదితరాల వల్ల హిమానీ నదాల్లో పాచి పరిమాణం క్రమంగా పెరిగిపోతోంది. దీనివల్ల మంచు కూడా స్వచ్ఛని తెలుపు రంగు కోల్పోయి మకిలిపడుతుంది. ఫలితంగా మంచు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. దాంతో అది కరిగే వేగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఇప్పుడు గ్రీన్‌లాండ్ దీవుల్లో అదే జరుగుతోంది. తాజా అధ్యయనం ఒకటి ఈ మేరకు తేల్చింది. ఈ దెబ్బకు సముద్రమట్టం కూడా వేగంగా పెరుగుతోందని నిర్ధారించింది. ఈ అధ్యయనం వెల్లడించింది. దుమ్మూధూళి, ఖనిజాల తాలూకు సూక్ష్మకణాలు గాలితో పాటుగా గ్రీన్‌లాండ్ మంచుపై భారీ పరిమాణంలో వచ్చిపడుతున్నాయట. ‘‘వాటివల్ల మంచుపై నాచు పొర ఏర్పడుతోంది.
దాంతో తెల్లని మంచు కాస్తా రంగు మారి వెలిసిపోతోంది. అలా అది సూర్యరశ్మిని మరింత ఎక్కువగా గ్రహిస్తోంది’’ అని అధ్యయన బృంద సారథి ప్రొఫెసర్ జెనిన్ మెక్‌కచోన్ వివరించారు. ‘‘ఫలితంగా మంచు మరింతగా కరిగిపోతోంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వెచ్చని ఉపరితలం మరింత నాచు ఏర్పడటానికి, దుమ్ము పేరుకోవడానికి కారణమవుతుంది. తద్వారా గ్రీన్‌లాండ్ మంచు తెలుపును కోల్పోయి నానాటికీ మరింతగా ముదురు రంగులోకి మారుతుంది. దాంతోపాటే అది సూర్యరశ్మిని మరింతగా గ్రహిస్తుంది. అలా అక్రమంగా ఇదో విషవలయంగా మారుతుంది’’ అని ఆయన హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌లోని మంచు పూర్తిగా కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది! లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది నిర్వాసితులుగా మారిపోతారు. వారి జీవనోపాధికి గండి పడుతుంది.


