ఐకానిక్ టవర్‌ను అమాంతం కప్పేసిన మంచు
మాస్కోలో చలి తీవ్రతకు అద్దం పడుతున్న దృశ్యం
మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా తెల్లగా మెరిసిపోతూ కన్పిస్తున్న ఈ భవనం ఏమిటో తెలుసా? రష్యా రాజధాని మాస్కోలోకెల్లా ఎత్తైన ప్రఖ్యాత ఒస్టాంకినో టవర్. దీని ఎత్తు అర కిలోమీటరు పైనే. అంటే 540 మీటర్లు! అంతటి టవర్ కూడా విపరీతమైన చలి దెబ్బకు ఇలా నిలువెల్లా ‘తెల్లబోయింది’! ఆద్యంతం మంచుమయంగా మారిపోయింది.
ప్రస్తుతం రష్యాను అతలాకుతలం చేస్తున్న అతి శీతల వాతావరణ తీవ్రతకు అద్దం పడుతున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్కో, పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 28 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. ధ్రువ సుడిగుండం (పోలార్ వెర్టెక్స్) కారణంగా ప్రస్తుతం రష్యాను విపరీతమైన చలిగాలులు వణికించేస్తున్నాయి. ఈ ఆర్కిటిక్ అతి శీతల గాలుల దెబ్బకు ఉత్తరార్ధ గోళమంతా అతలాకుతలం అవుతోంది. ఏ దేశంలో చూసినా ఊళ్లూ, పట్టణాలు తెల్లగా పరుచుకున్న మంచులో మునిగి తేలుతున్నాయి.
ఏమిటీ ధ్రువ సుడిగుండం
ఇది ధ్రువ ప్రాంతాల సమీపంలో నిత్యం కొనసాగే స్థిర అల్పపీడన వాతావరణం. దాంతో అక్కడి గాలులు సర్వాన్నీ గడ్డకట్టించేంత చల్లగా వణికిస్తూ ఉంటాయి. అయితే అన్నివైపుల నుంచీ ధ్రువాలకు వీచే బలమైన గాలుల వల్ల ఈ అతి శీతల పరిస్థితి సాధారణంగా అక్కడికే పరిమితమై ఉంటుంది. ఆ గాలులు బలహీనపడటం వంటివి జరిగినప్పుడు ధ్రువ సుడిగుండం భారీ కుదుపుకు లోనై అతి శీతల గాలులు బయటికి తోసుకొచ్చి దక్షిణాన సుదూరాల దాకా విరుచుకుపడతాయి. దాంతో ఉత్తర అమెరికా, యూరప్ మొదలుకుని ఆసియాలోని పలు దేశాలు చలి గుప్పెట్లోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోందని నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్‌తో పాటు నాసా సేకరించిన డేటా చెబుతోంది. ఇది ప్రస్తుతం చాలా చురుగ్గా ఉన్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


