‘చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ’ | YSRCP MLC Varudu Kalyani Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ’

Mar 9 2026 3:33 PM | Updated on Mar 9 2026 3:47 PM

YSRCP MLC Varudu Kalyani Takes On Chandrababu Naidu

తాడేపల్లి :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు.

‘మూడు జనరేషన్‌లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా?, మహిళా ద్రోహి పార్టీ టీడీపీ. జగన్ తెచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికీ రాయితీలు ఇవ్వలేదు. డ్రాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులే ఇవ్వకుండా వారిని కూడా పారిశ్రామిక వేత్తలను చేస్తానంటున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా గ్రూపుల పరపతి తగ్గింది. బ్యాంకర్లు రుణాలను ఇవ్వటం తగ్గించారు. మరి పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ ఎలా మాట్లాడతారు?, జగన్ సున్నావడ్డీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు మహిళలకు ఇచ్చారు. చంద్రబాబు వలన డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలు ఎవరికిచ్చారు?, సగం మందికి కూడా ఇవ్వకుండా సక్సెస్ చేశామని ఎలా చెప్పుకుంటారు?, అసెంబ్లీలో, బయటా డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అన్నీ చంద్రబాబే

మంత్రులు, ఎమ్మెల్యేలు కేరక్టర్  ఆర్టిస్టులుగా మిగిలి పోయారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ అన్ని వర్గాల మహిళలకూ మేలు చేశారు. చంద్రబాబు అందరినీ నిలువునా మోసం చేశారు. మహిళా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మహిళలకు కనపడకుండా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని భయపడుతున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై   లైంగిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, కాల్ సెంటర్‌కు కాల్ చేసినా ఏపీ పోలీసులు స్పందించటం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి అమిత్‌షానే లెటర్ రాశారు

దేశంలోనే అట్టడుగు స్థానంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ వెళ్లిపోయింది. మహిళలు, చిన్నారులకు ఏపీలో అసలు రక్షణే లేదు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండించటం సిగ్గుచేటు. మహిళను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?, లోకేష్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త‌ మహిళల ఫోటోలు తీస్తూ దొరికాడు. మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ. మూడు జనరేషన్‌లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement