మంత్రి అరోరాకు ఈడీ షాక్: వెలుగులోకి డమ్మీ అకౌంట్లు | AAP Minister Sanjeev Arora Caught in rs 157 Crore Fake Mobile Scam | Sakshi
Sakshi News home page

మంత్రి అరోరాకు ఈడీ షాక్: వెలుగులోకి డమ్మీ అకౌంట్లు

May 12 2026 9:56 AM | Updated on May 12 2026 9:56 AM

AAP Minister Sanjeev Arora Caught in rs 157 Crore Fake Mobile Scam

చండీగఢ్‌: పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సంజీవ్ అరోరా చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆయన విషయంలో వచ్చిన ఆరోపణలపై తాజాగా జరిగిన దర్యాప్తులో ఏకంగా రూ. 157 కోట్ల విలువైన నకిలీ మొబైల్ ఫోన్ల విక్రయాల కుంభకోణం వెలుగుచూడటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న మనీలాండరింగ్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి.

అక్రమ లావాదేవీల గుట్టు రట్టు
మే 9వ తేదీన చండీగఢ్‌లోని ఆయన అధికారిక నివాసంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ అధికారులు సంజీవ్ అరోరాను అరెస్టు చేశారు. అనంతరం గురుగ్రామ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది. తాజా దర్యాప్తు ప్రకారం నకిలీ మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపై ఏజెన్సీలు దృష్టి సారించాయి. షెల్ కంపెనీల (నకిలీ సంస్థల) ద్వారా, బ్యాంకు ఖాతాలను పదేపదే మార్చుతూ, నిధులను ఎలా మళ్లించారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

కూలీ ఖాతాలోకి కోట్ల రూపాయలు
ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ కీలక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించింది. అరోరాతో సంబంధం ఉన్న హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఎల్‌) అనే సంస్థ 2023 ఆగస్టు నుండి 2024 జనవరి మధ్యకాలంలో ‘ఎస్‌కె ఎంటర్‌ప్రైజెస్’కు 41 ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా ఏకంగా రూ. 27.73 కోట్లను బదిలీ చేసినట్లు వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎస్‌కె ఎంటర్‌ప్రైజెస్ ఒక దినసరి కూలీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. ఎలాంటి వాస్తవిక వాణిజ్య కార్యకలాపాలు లేని ఈ డమ్మీ ఖాతాల ద్వారా, అసలు డబ్బు మూలాలు దాచివుంచుతూ నిధులను దశలవారీగా మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

పంజాబ్ కేబినెట్‌లో కీలక మార్పులు
సంజీవ్ అరోరా అరెస్టు నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆయన నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు బదలాయిస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖను అమన్ అరోరాకు, స్థానిక సంస్థల శాఖను హర్జోత్ బైన్స్‌కు, విద్యుత్ శాఖను తరుణ్‌ప్రీత్ సోండ్‌కు అప్పగించింది. ఈ మార్పులను గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సోమవారం సాయంత్రం ఆమోదించారు. కాగా అరోరాను ప్రస్తుతానికి శాఖలు లేని మంత్రిగా కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తుండగా.. ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు?

Advertisement
 
Advertisement
Advertisement