ప్రెటోరియా: ఒక దేశ అధ్యక్షుడి ఫామ్‌హౌస్‌లోని సోఫాలో చోరీకి గురైన భారీ నగదు వ్యవహారం ఇప్పుడు ఆయన పదవికే ముప్పు తెచ్చిపెట్టింది. ‘ఫామ్‌గేట్’ స్కామ్‌గా సంచలనం సృష్టించిన ఈ కేసులో సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చుట్టూ మళ్లీ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణను నిలిపివేస్తూ, గతంలో ఆ దేశ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని అక్కడి రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడంతో, రామఫోసాపై అభిశంసన ప్రక్రియకు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
కుదిపేస్తున్న ‘ఫామ్‌గేట్’ స్కామ్
2020లో రామఫోసాకు చెందిన ‘ఫల ఫల’ (Phala Phala) ఫామ్‌హౌస్‌లోకి చొరబడిన దొంగలు, అక్కడి సోఫాలో దాచిన భారీ విదేశీ నగదును ఎత్తుకెళ్లారు. అది గేదెల విక్రయం ద్వారా వచ్చిన 5.8 లక్షల డాలర్ల చట్టబద్ధమైన ఆదాయమేనని అధ్యక్షుడు చెబుతుండగా, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మాత్రం ఆ మొత్తం సుమారు నాలుగు మిలియన్ డాలర్లు(రూ. 38 కోట్ల పైమాటే) ఉంటుందని ఆరోపించారు. అంత భారీ నగదు దేశంలోకి ఎలా వచ్చింది? బ్యాంకులో కాకుండా సోఫాలో ఎందుకు దాచారు? అనే ప్రశ్నలు తీవ్ర దుమారం రేపాయి.
అభిశంసనకు మళ్లీ ప్రాణం
2022లో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఒక స్వతంత్ర ప్యానెల్.. రామఫోసా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. కానీ అధికార ఏఎన్‌సీ పార్టీ తనకున్న మెజారిటీతో పార్లమెంట్‌లో విచారణను అడ్డుకుంది. అయితే పార్లమెంట్ చర్య రాజ్యాంగ విరుద్ధమని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సెక్షన్ 89 కింద నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షునిపై అభిశంసన ప్రక్రియను తప్పనిసరిగా పునఃప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
తగ్గేదే లేదంటున్న రామఫోసా
కోర్టు తీర్పు నేపథ్యంలో తనపై వెల్లువెత్తుతున్న రాజీనామా డిమాండ్లను రామఫోసా తీవ్రంగా తోసిపుచ్చారు. తాను ప్రజాధనాన్ని దోచుకోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్యానెల్ నివేదిక ఆధారాలు లేనిదని, దానిని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తానని వెల్లడించారు. కాగా, అభిశంసన నెగ్గాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం అధికార పార్టీకి 40 శాతం సీట్లు ఉండటంతో అధ్యక్షుడి పదవికి తక్షణ ముప్పు లేదని, ఆయన ఈ గండం గట్టెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం


