అబుదాబి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో అనూహ్య మలుపు తిరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇరాన్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై గత నెలలో యూఏఈ రహస్యంగా దాడులు చేసినట్లు ఆ నివేదిక పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
లావన్ ఐలాండ్ టార్గెట్‌గా దాడి
గత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఐదు వారాల పాటు జరిపిన వైమానిక దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని కీలక ఇంధన కేంద్రమైన లావన్ ద్వీపంలోని రిఫైనరీపై యూఏఈ టార్గెట్ చేసి దాడి చేసింది. రోజుకు దాదాపు 60,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైనది. అయితే ఈ దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అమెరికా మౌన మద్దతు.. గల్ఫ్ దేశాల ఎంట్రీ
యూఏఈ చేసిన ఈ దాడులకు అమెరికా తెరవెనుక మౌనంగా మద్దతు పలికినట్లు, గల్ఫ్ దేశాలు ఈ వివాదంలో విస్తృతంగా భాగస్వామ్యం కావడాన్ని స్వాగతించినట్లు నివేదిక పేర్కొంది. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ, ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్
లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. యూఏఈ, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్నయుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.
ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు!


