సందడిగా రఫా క్రాసింగ్‌ | Gaza as Israel set to reopen Rafah crossing | Sakshi
Sakshi News home page

సందడిగా రఫా క్రాసింగ్‌

Feb 2 2026 4:34 AM | Updated on Feb 2 2026 4:34 AM

Gaza as Israel set to reopen Rafah crossing

 గాజా–ఈజిప్టు మధ్య నేటి నుంచి జనం రాకపోకలు

రోజుకు 50 మందికి మాత్రమే అవకాశమన్న ఇజ్రాయెల్‌

విధుల్లో చేరిన యూరోపియన్‌ మిషన్‌ బృందం

కైరో: గాజా–ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా క్రాసింగ్‌ ఆదివారం సందడిగా కనిపించింది. పాలస్తీనా వాసులకు బయటి ప్రపంచంతో సంబంధాలకు ముఖద్వారం వంటిది రఫా బోర్డర్‌ పాయింట్‌. హమాస్‌ ఆయుధాలను దొంగచాటుగా తీసుకువస్తోందంటూ 2024 మేలో ఇజ్రాయెల్‌ ఆర్మీ దీనిని పూర్తిగా మూసివేసింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య గతేడాది అక్టోబర్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో రఫా క్రాసింగ్‌ను తిరిగి తెరవడం కూడా ఉంది. 

కాగా, తాజా పరిణామంతో ఈ ఒప్పందం మరో అడుగు ముందుకు పడినట్లయింది. గాజాకు మరో నాలుగు బోర్డర్‌ పాయింట్లు ఉన్నప్పటికీ అవి ఇజ్రాయెల్‌తో మాత్రమే ఉన్నాయి. ఆదివారం రఫా బోర్డర్‌ పాయింట్‌ను ప్రయోగాత్మకంగా తెరిచామని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. జనం రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామంది. 

క్రాసింగ్‌ వద్ద పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన యూరోపియన్‌ యూనియన్‌ మిషన్‌ బృందంతోపాటు పాలస్తీనా భద్రతా విభాగం సిబ్బంది కూడా విధుల్లో చేరారని ఈజిప్టు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి రెండు వైపులా రాకపోకలు మొదలవుతాయని పాలస్తీనా అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ వివరించింది. మొదటగా కొందరిని మాత్రమే అనుమతిస్తారని, సరుకు రవాణాకు అనుమతి లేదని పేర్కొంది. 

యుద్ధం కారణంగా గాజాలో వైద్య, ఆరోగ్య వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం కావడం, ప్రస్తుతానికి కనీసం 20 వేల మంది చిన్నారులకు అత్యవసర వైద్యసాయం అవసరమవుతుందని అధికారులు తెలిపారు. 

అయితే, రోజుకు 50 మంది రోగులను మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. ఒక్కో రోగి వెంట ఇద్దరు సంబంధీకులు మాతమ్రే క్రాసింగ్‌ గుండా వెళ్లాల్సి ఉందని ఓ అధికారి చెప్పారు. యుద్ధం సమయంలో గాజా నుంచి బయటకు వెళ్లిన వారిని రోజుకు 50 మందిని మాత్రమే తిరిగి లోపలికి అనుమతి స్తామన్నారు. ఈ విధానం విజయవంతమైన పక్షంలో ఈ సంఖ్యను క్రమేపీ పెంచుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement