మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ.. | Health Tips: How To Develop a Powerful Personality Development | Sakshi
Sakshi News home page

మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ లైఫ్‌..

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 9:42 AM

Health Tips: How To Develop a Powerful Personality Development

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేజ్ మీద అరుస్తూ, "నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు", "నీలో ఒక సింహం ఉంది", "ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి నేను తోపు అని చెప్పుకో" అంటూ డైలాగులు కొడుతుంటారు. వీటిని చూసి జనం ఇన్‌స్టంట్‌గా ఉత్తేజానికి లోనవుతారు. కానీ, ఆ వీడియో ముగిసిన అరగంటకే మళ్ళీ పాత భయాలు, పాత బలహీనతలు చుట్టుముడతాయి.

ఎందుకు?
ఎందుకంటే, మార్కెట్ అమ్ముతున్నది 'మోటివేషనల్ డ్రగ్'. కానీ మనకు కావాల్సింది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్.

మోటివేషన్ అనేది ఒక కప్పు కాఫీ లాంటిది. తాగినప్పుడు కిక్ ఇస్తుంది, ఆ తర్వాత నీరసం వచ్చేస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది మన మనసులోని సాఫ్ట్‌వేర్‌ను రీ-రైట్ చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ.

సో-కాల్డ్ ట్రైనర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే... అందరికీ ఒకే మందు (One size fits all) ఇవ్వాలని చూడటం.

"ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి. నెగటివిటీని దరిచేరనీయకండి. అన్నీ మంచివే జరుగుతాయని నమ్మండి" అని చెప్తారు సో-కాల్డ్ ట్రైనర్స్. దీన్ని సైకాలజీలో 'Toxic Positivity' అంటారు.

కోపం, భయం, అసూయ, బాధలాంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మనిషిలో ఒక భాగమే. వాటిని అణచివేస్తే అవి లోపల కుళ్ళిపోయి డిప్రెషన్ లేదా యాంగ్జైటీగా మారుతాయి.

Real Personality Development అంటే నెగటివ్ ఎమోషన్స్‌ను అణచివేయడం కాదు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. నాకు భయం వేస్తోంది అని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ భయాన్ని జయించడానికి అది మొదటి మెట్టు.

"నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించు. అది చూసి లోకం నమ్ముతుంది, మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది" అంటారు ట్రైనర్స్.

కానీ, ఇది మిమ్మల్ని 'Imposter Syndrome' కి గురి చేస్తుంది. లోపల డొల్లతనం ఉండి పైన మేకప్ వేసుకుంటే, ఎక్కడో ఒకచోట ఆ ముసుగు జారిపోతుందనే భయం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.

Real Personality Development అంటే నటించడం కాదు, 'అర్హత'ను (Competence) పెంచుకోవడం. మీరు ఒక పనిలో నిష్ణాతులు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అనేది ఒక బై-ప్రొడక్ట్‌లా దానంతట అదే వస్తుంది.

సైకాలజీ ప్రకారం వ్యక్తిత్వం అంటే 'అలవాటు' కాదు, అది ఒక 'ఆర్గనైజేషన్'. వ్యక్తిత్వం అనేది కేవలం మనం నేర్చుకునే స్కిల్స్ కాదు. అది మన అనువంశికత (Heredity), పరిసరాల (Environment) సంక్లిష్టమైన కలయిక.

మోటివేషనల్ స్పీకర్లు కేవలం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సైకాలజీ మీ 'బాల్యం' (Childhood) గురించి మాట్లాడుతుంది.

మీ పర్సనాలిటీకి పునాది మీ ఐదేళ్ల వయసులోనే పడిపోయింది. ఆ పునాదిలో ఉన్న పగుళ్లను (Trauma/Negative conditioning) పూడ్చకుండా పైన అంతస్తులు కడితే, ఆ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు.

నేను డెవలప్ చేసిన నా "Genius Matrix" Break. Build. Beyond. మోడల్ ద్వారా ఈ సో-కాల్డ్ ట్రైనర్స్ ఎక్కడ విఫలమవుతున్నారో చూడండి:

స్టెప్ 1: Break (పాత పునాదిని కూల్చడం)
ట్రైనర్స్ డైరెక్ట్‌గా బిల్డింగ్ కట్టమంటారు. కానీ సైకాలజీ ప్రకారం, ముందు లోపల ఉన్న శిథిలాలను తొలగించాలి.

చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని అందరిముందు తిట్టినప్పుడు "నేను దేనికీ పనికిరాను" అని మీ మనసులో పడ్డ ముద్రను చెరిపేయకుండా, పైన మీరు ఎన్ని "సక్సెస్ మంత్రాలు" చదివినా ఉపయోగం లేదు.

మీ బలహీనతలు, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ మొదలయ్యాయో గుర్తించి, ఆ పాత సెల్ఫ్-ఇమేజ్‌ను బ్రేక్ చేయడమే అసలైన వికాసం.

స్టెప్ 2: Build (లోపలి నుంచి బయటికి)
ఇక్కడ మనం బాహ్య ప్రదర్శనపై కాకుండా, అంతర్గత విలువలపై దృష్టి పెడతాం.

ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు (Real Self) అనేది కీలకం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక "సక్సెస్ ఫుల్ పర్సన్" కనిపించాల్సిన అవసరం లేదు, ఒక "నిజాయితీ గల మనిషి" కనిపిస్తే చాలు.

గొడవ జరిగినప్పుడు అరవకుండా ఉండటం 'కమ్యూనికేషన్ ట్రిక్' కాదు, అది మనసును కంట్రోల్ చేసే 'మెంటల్ స్ట్రెంత్'.

స్టెప్ 3: Beyond (పరిమితుల ఆవల - లెగసీ నిర్మించడం)
మార్కెట్ కోరుకునేది 'సక్సెస్'. సైకాలజీ కోరుకునేది 'సాటిస్ఫాక్షన్', 'గ్రోత్'.

ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం మానేసి, మీరు మీ కోసం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మీరు 'Beyond' స్టేజ్‌లోకి వెళ్తారు. ఇక్కడ మీ పర్సనాలిటీలో ఒక Depth ఉంటుంది. Abraham Maslow చెప్పిన 'Self-Actualization' అంటే ఇదే.

ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం (Stage Fear). "నువ్వు పులివి.. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఊగిపో.. కేకలు వేయ్.. జనం చప్పట్లు కొడతారు" అంటాడు మోటివేషనల్ స్పీకర్. ఇది ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు, కానీ భయం పోదు.

మరేం చేయాలి?
ఆ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడా? (Perfectionism). ఎదుటివారు ఏమనుకుంటారో అనే Social Anxiety ఉందా? తన దగ్గర సరైన కంటెంట్ లేదా? అనే అంశాలను పరిశీలించాలి.

  • ముందుగా ఆ వ్యక్తి తనలోని లోపాలను అంగీకరించేలా చేయడం.

  • చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడించి 'ఎక్స్‌పోజర్' ఇవ్వడం.

  • స్టేజ్ మీద మాట్లాడటం అంటే 'తన్ను తాను నిరూపించుకోవడం' కాదు, 'సమాచారాన్ని పంచడం' అనే మైండ్‌సెట్ మార్పు తేవడం.

  • ఇది Real Personality Development.

చివరగా నేను చెప్పేది ఒక్కటే... పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ఒక మోడల్‌లా నడవడం కాదు, ఒక నాయకుడిలా మాట్లాడటం కాదు.

  • మీ మనసులో ప్రశాంతత ఉందా?

  • మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నారా?

  • కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడుతున్నారా?

  • మీ తప్పులను మీరు ఒప్పుకోగలుగుతున్నారా?

ఇవేవీ మార్కెట్‌లో లభించే రెండు రోజుల వర్క్‌షాప్‌లలో దొరకవు. వీటికి లోతైన ఆత్మపరిశీలన, శాస్త్రీయ దృక్పథం అవసరం.

మనం ఈ Real Personality Development సిరీస్‌లో మాట్లాడబోయేది ఆ లోతైన సత్యాల గురించే.

ఇక్కడ సో-కాల్డ్ మోటివేషన్ ఉండదు... కేవలం సైకలాజికల్  ట్రాన్స్‌ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది.

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: ప్రెండ్స్‌..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement