భారత పౌరులకు తాజ్ మహల్ అంటే కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు ఒక ఎవర్ గ్రీన్ ఎమోషన్. జీవితంలో ఒక్కసారైనా ఆగ్రా వెళ్లి తాజ్ మహల్‌ని సందర్శించాలని వీలైతే తన సోల్‌మేట్‌తో కలిసి వెళ్లాలని ఆశించని వారు అరుదే. పర్యాటకాభిరుచి ఉన్నవారైతే తాజ్‌ని తమ జాబితాలో అగ్రస్థానంలో చేరుస్తారు. అయితే ఆగ్రాకు వెళ్లే సందర్శకులకు తాజ్ వీక్షణ మాత్రమే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అంతకు మించి అక్కడ దానికి అనుబంధ కార్యక్రమాలు ఏమీ ఉండవు. అయితే అలాంటి ఏకైక సందర్భం ఆగ్రాలో నిర్వహించే తాజ్ మహోత్సవం. తాజ్‌కు తోడయే మరో వైవిధ్యభరిత అనుభూతి ఇది అంటున్నారు మహోత్సవ్ నిర్వాహకులు
చలికి ముగింపు ఉత్సవానికి ఊపు...
ప్రతి సంవత్సరం, శీతాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నప్పుడు ఆగ్రా తన ఓ గొప్ప పండుగకు సిద్ధమవుతుంది. దాని పేరే తాజ్ మహోత్సవ్ ఆగ్రా నగర సందర్శకులు తప్పనిసరిగా గుర్తుంచుకోదగిన సందర్భం.
గత కొంత కాలంగా దీనిని నిర్వహిస్తున్నప్పటికీ మరీ ఎక్కువగా ప్రచారానికి నోచుకోలేదు. సాంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి తాజ్ మహల్ తో పాటు ఇతర ప్రాంతాలకు సైతం పర్యాటకులను ఆకర్షించడానికి, తాజ్ మహోత్సవ్ పేరిట గత 1992లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉత్సవం ప్రణాళికాబద్ధమైన సాంస్కృతిక కార్యక్రమాలతో క్రమ క్రమంగా కళాకారులు తమ ప్రతిభా నైపుణ్యాలను సాధారణ ప్రజలకు ప్రదర్శించే పండుగగా స్థిరపడింది. ఈ ఏడాది తాజ్ మహోత్సవ్ ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు జరుగుతుంది. ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్. లోన ఉన్న విండ్‌హామ్ గార్డెన్ హోటల్‌లో దీనిని నిర్వహిస్తారు.
ప్రవేశం ఇలా...
ది తాజ్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు ప్రవేశ ధర రూ.50 కాగా, 3 సంవత్సరాల వయస్సు లోపు చిన్నారులకు ప్రవేశః ఉచితం. అంతేకాదు విదేశీ పర్యాటకులకు కూడా ప్రవేశం ఉచితమే. స్కూల్ యూనిఫాంలో ఉన్న 50 మంది విద్యార్థుల బృందానికి మొత్తంగా కలిపి ప్రవేశ రుసుము రూ.700, వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం అందిస్తున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద ఉంచిన వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
సాంస్కృతిక కార్యక్రమాలను ఇష్టపడితే ఈ కార్యక్రమం ఆగ్రా పర్యటనను గడపడానికి ఒక ఆహ్లాదకరమైన, సుసంపన్నమైన అనుభూతులను ఈ మహోత్సవ్ అందిస్తుంది. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులతో కూడిన హస్తకళా ఉత్పత్తులతు, స్థానిక ప్రాంతీయ వంటకాలతో పాటు పేరొందిన స్ట్రీట్ ఫుడ్‌తో కూడిన ఫుడ్ కోర్ట్ లు ఇక్కడ కొలువుదీరుతాయి. రోజంతా సంగీత నృత్య ప్రదర్శనలను సమర్పించే ప్రధాన వేదిక కూడా ఉంటుంది.


