‘ప్రతిజ్ఞ నెరవేర్చా’.. ఖమేనీ చివరి సందేశం? | Iran Supreme Leader Ayatollah Ali Khameneis Dies At 86, Last Quranic Post On X Sparks Debate | Sakshi
Sakshi News home page

Khamenei Death: ‘ప్రతిజ్ఞ నెరవేర్చా’.. ఖమేనీ చివరి సందేశం?

Mar 1 2026 9:52 AM | Updated on Mar 1 2026 9:59 AM

Ayatollah Ali Khameneis final Quranic post on X

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఖమేనీ మృతికి గల కారణాలను అధికారిక యంత్రాంగం వెల్లడించనప్పటికీ, ఆయన మృతి వెనుక కుట్ర కోణాలు ఉండవచ్చనే అనుమానాలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి.

ఖమేనీ మరణ వార్త వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ఆయన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక ఖురాన్ వాక్యం పోస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘అల్లాకు ఇచ్చిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న వారే నిజమైన విశ్వాసులు.. వారిలో కొందరు తమ ప్రమాణాన్ని నెరవేర్చగా, మరికొందరు ఆ సమయం కోసం నిరీక్షిస్తున్నారు’ అనే అర్థం వచ్చే సూరా అల్-అహ్జాబ్ (33:23) వాక్యాన్ని అందులో ప్రస్తావించారు.

ఇది ముందే షెడ్యూల్ చేసిన సందేశమా లేక వ్యూహాత్మకంగా పోస్ట్ చేసిన చివరి వీడ్కోలా అన్నది అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఆయన అనుచరులు దీనిని ఆయన దైవానికి ఇచ్చిన మాటకు నిబద్ధతగా భావిస్తున్నారు.  ఖమేనీ మృతి దరిమిలా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను, వారం రోజుల పాటు సెలవును ప్రకటించింది.
 

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా, తమ ప్రత్యేక దళాలు ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీని మట్టుబెట్టాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇరాన్ సాగించిన ఉగ్రవాద పాలన నేటితో ముగిసింది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఆధిపత్యం నిరూపితమైంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై పెంటగాన్ అధికారులు అధికారికంగా స్పందించేందుకు నిరాకరించగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం సైతం ‘నో కామెంట్’ అంటూ గోప్యతను పాటించింది.

కాగా ఖమేనీ వారసునిగా ఆయన కుమారుడు మోజ్తబా లేదా మరో వర్గానికి చెందిన నేతను ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ అధికార మార్పిడి సజావుగా సాగుతుందా లేక ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇరాన్ వ్యాప్తంగా ప్రార్థనలు, నిరసనలు మిన్నంటుతుండగా, ప్రపంచ దేశాలన్నీ పశ్చిమాసియా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement