అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ప్రకటించారు. ఆయన ఖమేనీను "చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరు" అని పేర్కొన్నారు. ఇది "ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం" జరిగిందని అన్నారు.
అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఖమేనీ నివాస సముదాయంపై 30 బాంబులు వేశారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెటాన్యాహు కూడా ఖమేనీ మరణించి ఉండవచ్చన్న సంకేతాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి NBC Newsతో మాట్లాడుతూ, "ఖమేనీ బతికే ఉన్నారు, నాకు తెలిసినంతవరకు అందరు ఉన్నతాధికారులు సురక్షితంగానే ఉన్నారు" అని తెలిపారు. BBCకి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ, "ఏదైనా ధృవీకరించే స్థితిలో లేను, కానీ దేశం మొత్తం జాతీయ సమగ్రతను కాపాడడంపై దృష్టి పెట్టింది" అని అన్నారు.
శనివారం జరిగిన దాడుల తర్వాత ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ) దాడులు జరిపింది. ఈ పరిణామాలు ప్రాంతీయంగా పెద్ద ఎస్కలేషన్‌కు దారితీశాయి. అయతొల్లా అలీ ఖమేనీ 1989లో రుహొల్లా ఖొమేనీ తరువాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత 36 ఏళ్లుగా ఆయన ఇరాన్‌ను పాలించారు. చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్–హిజ్బుల్లా బలహీనత, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి.
అయితే ఖమేనీ మృతిపై ఇరాన్ నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. కానీ దీంతో అంతర్జాతీయంగా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి.


