breaking news
-
ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతీ సారి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నదీ జలాల్లో అన్యాయంపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాపై కేసులు పెడతామంటూ లీక్‌లు ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీ సులు ఇస్తారట. చట్టబద్ధ్దంగా వ్యవహరించని పోలీసు అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ‘పోస్టింగుల కోసం అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పోలీసుల వివరాలు రాసి పెడుతున్నాం. బీఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా, సెంట్రల్ సర్వీసులోకి డిప్యూటేషన్‌పై వెళ్లినా వదిలిపెట్టేది లేదు. ఏ బొరియలో దాక్కున్నా లాక్కొస్తాం. రేవంత్ అడుగు లకు మడుగులొత్తుడేనా డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో హరీశ్‌రావు ఇష్టాగోష్టి నిర్వహించారు. నేతి బీరలో నెయ్యిలా డీజీపీ ఖాకీ బుక్ ‘ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు నాపై సుమారు 300 కేసులు పెట్టారు. రేవంత్ పథకాల ఎగవేతను ప్రశ్నిస్తూ ఆయన పాపాలను క్షమించమని దేవుడిని వేడుకున్నందుకు కూడా యాదగిరిగుట్టలో కేసులు పెట్టారు. సిద్దిపేటలో నా ఇంటిపై దాడి చేసినా కేసు నమోదు చేయలేదు. ఫార్ములా ఈ–రేస్ తరహాలోనే నాపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటు వేయలేదని సజ్జాపూర్‌లో దళితుల ఇల్లు కూల్చివేస్తే డీఐజీ ఖాకీబుక్ ఏం చేస్తోంది.రేవంత్ ఫుట్‌బాల్ ఆడితే డీఐజీ మైదానంలో రెండు రోజులు కాపలా ఉన్నారు. కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు తమకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవులు, భద్రత పథకం, అలవెన్సుల కోసం తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని కేవలం యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో పనిచేసే వారికి మాత్రమే పెండింగ్ అలవెన్సులు ఇచ్చారు. నేతి బీరకాయలో నేతి చందంగా డీజీపీ ఖాకీ బుక్ పనిచేస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. వాస్తు భయంతో సచివాలయానికి దూరం ‘కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ఆత్మరక్షణలో పడిన రేవంత్ రాత్రి 9.30 గంటలకు మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించాడు. వాస్తు భయంతో సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నాడు. నాలుగు వేలకు పైగా సర్పంచ్ పదవులు మా పార్టీకి దక్కడంతో సహకార సంఘాల ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నాడు. కాంట్రాక్టుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.7వేల కోట్ల కమీషన్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ కంపెనీలా పనిచేస్తూ బాంబే బ్రోకర్‌కు రూ.180 కోట్లు కమీషన్ ఇచ్చి అప్పులు తెచ్చింది. ఇరిగేషన్ అంశాలపై అసెంబ్లీలో మాకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలి. 15 రోజులు అసెంబ్లీ పెట్టి మాకు అవకాశం ఇస్తే ఇరిగేషన్‌తోపాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారు బట్టలు విప్పుతాం. ఉత్తమ్ తన తప్పు ఒప్పుకుని పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయాలి’అని హరీశ్‌రావు చెప్పారు. -
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా?
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్‌లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు. దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్‌లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్‌లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు. కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పాట తెచ్చిన ‘పంచాయితీ’
నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్ఎస్కు సంబం«ధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్‌కు, బీఆర్ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్‌రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
బడిలో.. కిరాణా షాపులో.. చెట్ల కింద..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. మొత్తంగా 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉప సర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిచోట్ల పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో, కొన్నిచోట్ల భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో ఓ చోట కిరాణా షాపులో, మరోచోట ఆరుబయట, ఇంకోచోట చెట్ల కింద సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల కొలువుదీరిన మొదటి రోజునుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేయడం విశేషం.కిరాణా షాపులో అధ్యక్షా.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్‌గా ఎన్నికైన పావని తన కిరాణా దుకాణంలోని సగభాగంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పాలకవర్గ సభ్యులకు ఇబ్బందికరంగా ఉండటంతో ఆరుబయట ప్రమాణ స్వీకారం చేశారు.చెట్ల నీడలోనే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలంలోని నల్లబండబోడు, చింతలతండా గ్రామపంచాయతీల భవనాలు నిర్మాణంలో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు చెట్ల కిందే టెంట్ నీడలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇదే మండలం గురువాగుతండా, శంభునిగూడెం, సాయిరాంతండా, గాం«దీనగర్ల్లో సొంత భవనాలు లేక పాఠశాల భవనాల్లో పాలకవర్గాలు ప్రమాణం చేశాయి. మద్యపాన నిషేధంతో మొదలు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్వగ్రామం, సిద్దిపేట జిల్లా భూంపల్లి–అక్బర్పేట మండలం బొప్పాపూర్‌లో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి రోజు సంపూర్ణ మద్య నిషేధంపై తొలి తీర్మానం చేశారు. బెల్ట్‌షాపులపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. తర్వాత స్వచ్ఛ బొప్పాపూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పని చేసి.. ప్రమాణం చేశారు.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని కొంపల్లి నూతన సర్పంచ్ జంగాల సాలమ్మ ప్రమాణస్వీకారానికి ముందు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి చీపురుపట్టి వీధులను శుభ్రపరిచారు. ఆ తరువాత పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ప్రమాణం చేశారు. అద్దె ఇల్లు తీసుకుని.. సిద్దిపేట జిల్లా గాంధీనగర్, బంజేరుపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో సర్పంచ్‌లు అద్దె ఇల్లును తీసుకున్నారు. ఇది అనువుగా లేకపోవడంతో ఆరుబయటే ప్రమాణం చేశారు. మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంతో పాటు వంగపల్లి, హనుమతండా, రెడ్యానాయక్ తండా, దుబ్బతండా గ్రామాల్లో సొంత భవనాలు లేకపోవడంతో ఓ చోట టెంట్ వేసి ప్రమాణం చేశారు. బడిలో ‘పంచాయతీ’ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలో నడిమితండా, సీతానగర్ పంచాయతీ కార్యాలయాలు ప్రాథమిక పాఠశాలలోని ఓ తరగతి గదిలో కొనసాగుతుండగా, గొల్లకుంట తండా పంచాయతీ కార్యాలయం ఓ ఇంట్లో నిర్వహిస్తున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలను స్కూళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణలోనే టెంట్ వేసి ప్రమాణం చేశారు. గుర్రంపై వచ్చిన సర్పంచ్ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రవీందర్ పటేల్ ప్రమాణ స్వీకారానికి గుర్రంపై వచ్చాడు. బ్యాండుమేళాలతో పెళ్లి బారాత్ ఊరేగింపు మాదిరిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. రంగుల ‘పంచాయితీ’ కాంగ్రెస్ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణం చేయబోమని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తంచేయడంతో పోలీసులు, అధికారులు వచ్చి సర్దిచెప్పారు.అంబులెన్స్‌లోనే ప్రమాణం జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా గెలుపొందారు. రెండు రోజుల క్రితం అలేఖ్య అనారోగ్యం బారినపడి అస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఉపసర్పంచ్‌గా ఆమె తండ్రి చండి పర్శయ్య, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్పత్రిలో ఉన్న అలేఖ్య అంబులెన్స్‌లో గ్రామానికి రాగా.. అధికారులు అందులోనే అలేఖ్యతో ప్రమాణం చేయించి సంతకాలు తీసుకున్నారు.పురిటి నొప్పులతో వచ్చి.. నారాయణపేట జిల్లా ఊట్కూరు సర్పంచ్‌గా గెలుపొందిన రేణుకకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కుటుంబసభ్యులు ఆమెను పంచాయతీ కార్యాలయానికి తీసుకురాగా కార్యదర్శి శ్రీనివాసరావు ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన బోయపల్లి రాజేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఆయన తండ్రి మాజీ సర్పంచ్ బోయపల్లి సురేందర్ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ప్రమాణం వాయిదా పడకూడదని భావించిన రాజేష్ బాధను దిగమింగుతూ బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకాలు చేశారు.కింద కూర్చునే బాధ్యతల స్వీకరణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) కొత్త పంచాయతీ. కార్యాలయానికి పాఠశాల ఆవరణలోని ఓ గదిని కేటాయించారు. కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో నిరసనగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కింద కూర్చునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఒక గ్రామం.. ఇద్దరు సర్పంచ్‌లు! సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయ తీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో మొత్తం 1,268 ఓట్లు ఉండగా.. 1,141 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సనప సుజాతకు 549 ఓట్లు, బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న నూనావత్ స్వాతికి 552 ఓట్లు వచ్చినట్లు ఫలితాల సందర్భంగా అధికారులు ప్రకటించారు. దీంతో స్వాతికి గెలుపుపత్రం ఇచ్చారు. సుజాత రీకౌంటింగ్ కోరగా.. తిరిగి ఓట్లను లెక్కించారు. స్వాతికి 549 ఓట్లు, సుజాతకు 550 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. ముందుగా స్వాతికి ఇచ్చిన గెలుపు పత్రం వెనక్కి తీసుకోకుండానే... రిటర్నింగ్ అధికారి సుజాతకు మరో గెలుపు పత్రం అందజేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం కోసం ఇరువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో పంచాయతీ కార్యాలయానికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సుజాత గెలిచినట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ప్రకటించి ప్రత్యేకాధికారి మంగీలాల్ ఆమెతో ప్రమాణం చేయించారు.95 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా తిరుమలగిరి (తుంగతుర్తి): 95 ఏళ్ల వయసులో సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు.ర్యాలీలో ఉద్రిక్తత మర్రిగూడ (చింతపల్లి): నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య తన ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ర్యాలీలో ప్రత్యర్థి వర్గీయులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వెంబడించడంతో వారు పరారయ్యారు. పలువురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
బీఆర్ఎస్కు తోలు తప్ప కండ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్ధమైంది.అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. బండ కూడా పగలకొట్టలేదు.. సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పారు. సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించారు. -
బీఆర్ఎస్ను ఎండగట్టాలి
సాక్షి, హైదరాబాద్: జల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విస్తృత చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని సహచర మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కృష్ణా జలాలపై హక్కులను రాబట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో జలాల వినియోగానికి సంబంధించి కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వారి హయాంలో చేసిన నిర్ణయాలు, కేంద్రానికి రాసిన లేఖలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, బీఆర్ఎస్ హ యాంలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేశారన్న అంశాలను సభకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ సోమవారం రాత్రి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు మూడున్నర గంటలపాటు మంత్రులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీటికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టులపై సమగ్ర చర్చ తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అనుమతులు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభలో చర్చకు పెట్టనున్నారు. సాగునీటి రంగం విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రాష్ట్రానికి జరిగిన నష్టం వి వరించడంతో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అసత్యాల ను ఎండగట్టాలని నిర్ణయించారు. అవసరం అ యి తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.మొత్తం 4 రోజులు అసెంబ్లీ ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని, ఆ తర్వాత జనవరి రెండో తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఇటీవల ముగిసిన పంచాయ తీ ఎన్నికల ఫలితాల సరళి, ఇతర వర్తమాన రాజకీయ అంశాలపై సమావేశంలో విస్తృతంగా చ ర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొంత కష్టపడితే సీట్లు పెరిగేవని, కొన్ని జిల్లాల్లో ఇబ్బంది ఎదుర్కొన్న విషయాన్ని, నియోజకవర్గాల వారీగా గెలుచుకున్న పంచాయతీలను మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రు లే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు బాధ్య త చేపట్టాలని, మొత్తం జెడ్పీలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక జీహెచ్ఎంసీలో శివారు మునిసిపాలిటీల విలీనం అనంతరం చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తీరుతెన్నులను వివరించినట్లు తెలిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించే అంశం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిద్దామని సీఎంచెప్పినట్టు సమాచారం. -
పార్టీ నాకు కన్నతల్లిలాంటిది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తూ పదవుల్ని గడ్డిపోచలా వదిలేశా. రేవంత్‌రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర ఆయనది. ఫోర్ట్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ నుంచి సమాధానమే లేదు. ఆయనవన్నీ సొల్లు మాటలు’’ అని హరీష్‌రావు అన్నారు. రేవంత్ ఏమన్నారంటే.. ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్‌రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది అని విమర్శించారు. -
స్వాతి? సుజాత?.. సర్పంచ్ ఎవరో??
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర అయోమయం నెలకొంది. ఒకే పదవికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గెలుపు పత్రాలు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వివరాలు ఇలా.. మొదటగా మూడు ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూనావత్ స్వాతి గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు గెలుపు పత్రాలు అందజేశారు. అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్ అనంతరం ఒక్క ఓటు ఆధిక్యంతో సానుప సుజాత గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు కూడా గెలుపు పత్రాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఇద్దరు అభ్యర్థులు తామే విజేతలమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నారు.ఇదే సమయంలో దామరవంచ గ్రామంలో మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అందులో 5 మంది కాంగ్రెస్ పార్టీకి, 5 మంది బీఆర్ఎస్కు చెందినవారు గెలుపొందారు. ఈ సమబలం పరిస్థితి కూడా గ్రామ రాజకీయాల్లో అయోమయానికి దారి తీసింది. ఒకే ఎన్నికలో ఇద్దరికి గెలుపు పత్రాలు ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ గ్రామనికి సర్పంచ్ ఎవరని తేల్చాల్సింది అధికారులే -
ఏం చేద్దాం ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం మధ్యాహ్నాం మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అంశంపైనా వీళ్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అలాగే పెండింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ , పార్టీ పదవులపై భర్తీ పైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ పైనా చర్చిస్తారని సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చ చేపట్టే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ‘‘ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరిగేషన్ విషయంలో దమ్ముంటే ఫేస్ టూ ఫేస్‌కు రావాలంటూ సీఎం రేవంత్ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో ఓ ప్రకటన చేశారు. -
420 హామీలను మూసీలో కలిపారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారా? లేక మూసీనదిలో కలిపారా? లేదంటే గాం«దీభవన్‌లో పాతరేశారా?’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమెకు ఒక బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పుస్తకాన్ని ఢిల్లీకి వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీకు అందజేశారు. ఆ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ మీరు శుభాకాంక్షలు తెలిపారు.కానీ.. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సెపె్టంబర్ 17వ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు, అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది.ఈ రెండేళ్లలోఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు మీ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయతి్నంచారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా?’అని కిషన్‌రెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు మరిచి, తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారని మండిపడ్డారు.‘ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేక గాం«దీభవన్‌లో పాతరేశారా?. తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఇచ్చిన మాటమీద నిలబడండి.. ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త హామీలు ఇచ్చే ముందు, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మీరు ప్రకటించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై అధికారానికి దూరం చేస్తుంది’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాను’అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
కేసీఆర్‌వి 90% అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై 90 శాతం పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని దారుణంగా, దుర్మార్గంగా నాశనం చేసింది ఆయనే అని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లోపం, అసమర్థత, చేతకానితనంతో 10 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు జీరో ప్రయోజనం చేశారని ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లు కూలిపోవడానికి.. సీఎంగా, నీటిపారుదల, ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌దే బాధ్యత అని, కేసీఆరే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తేలి్చందని అన్నారు. ఆదివారం రాత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం చేపట్టకుంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. ‘కాళేశ్వరం అంత పెద్ద కుంభకోణం మరొకటి జరగదేదని ఘోష్ కమిషన్, విజిలెన్స్, కాగ్ ఎన్డీఎస్ఏ తేల్చాయి. ఈ విషయంలో చట్టప్రకారం ముందుకు పోతున్నాం. అంతర్జాతీయ నిపుణులతో కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణను వాటి నిర్మాణ సంస్థలతోనే పూర్తి చేయిస్తాం. రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్ల పనులు పూర్తయ్యాక అధిక కమీషన్ల కోసం అర్ధాంతరంగా వదిలేసి దాని స్థానంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం చేపట్టకుండా ప్రాణహిత–చేవెళ్లనే నిర్మిస్తే మిగిలిపోయే రూ.65 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి..’ అని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ‘కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుతో పాటు పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌లో ఎన్నికలకు 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటైనా పూర్తి చేశారా? మార్పులు చేయకుంటే రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. పాలమూరు కింద ఎకరా ఆయకట్టు ఇవ్వలేదు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అంటున్నారు. దాని కింద ఒక్క ఎకరమైనా ఆయకట్టు ఇచ్చారా? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు గత ప్రభుత్వమే సవరించగా, రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2023 ఏప్రిల్ 12న కేంద్రం తిప్పి పంపింది. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి కేసీఆరే..’ అని ఉత్తమ్ చెప్పారు. 45 టీఎంసీలకు తగ్గింపు అబద్ధం... ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేందుకు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 90 టీఎంసీలతో ప్రాజెక్టుకు జీవో ఇచ్చాం. తొలి విడత ప్రాజెక్టును మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో చేపట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతించింది. గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచి్చన మరో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకి కేటాయించాలని కేంద్రంతో మేము నిరంతరం కొట్లాడుతున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీకి కేసీఆర్ సహకరించారు ‘ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్యలో ఏపీ రోజుకి 4.1 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోగా, తెలంగాణ వచ్చాక కేసీఆర్ సహకారంతో రోజుకు 9 టీఎంసీలు అక్రమంగా తరలించుకునేలా సామర్థ్యాన్ని పెంచుకుంది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు కేసీఆర్ సహకరిస్తే మేము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులను ఆపివేయించాం. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ 2004–14 మధ్యలో 727 టీఎంసీలను అక్రమంగా తరలించగా, కేసీఆర్ సీఎం అయ్యాక 2014–23 మధ్యలో 1442 టీఎంసీలను అక్రమంగా తరలించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణకు కేసీఆర్ సహకరించారు. ఆయన కాలంలోనే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ఉత్తమ్ తెలిపారు. -
ముందు అసెంబ్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరేం చేశారో, ఎవరి హయాంలో ఏం జరిగిందో కూలంకశంగా మాట్లాడేందుకు వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని తాను ప్రతిపాదిస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో? తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశానో? అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చని చెప్పారు.ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేస్తే ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను ఏపీకి రాసిచ్చేసి పాల మూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణశాసనం రాసింది కేసీఆరేనని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..! ప్రజలు తీర్పు ఇస్తూనే ఉన్నారు ‘కలుగులో ఉన్న ఎలుకకు పొగబెడితే బయటకు వచ్చినట్టు రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. సంతోషం. ప్రజలిచి్చన తీర్పు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించి స్రత్పవర్తన తెస్తుందని ఆశించాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలే పెట్టుబడిగా ఆయన 75 నిమిషాల ప్రసంగం సాగింది. బీఆర్ఎస్ చేసిన నేరాలు, ఘోరాలు దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కరడుగట్టిన నేరగాళ్లకు కూడా కనువిప్పు కలుగుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఏ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. మూతి దగ్గర కాకుండా తోక దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. 811 టీఎంసీల్లో 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని సంతకం పెట్టింది ఎవరు? ఒక్కసారి కాదు పదేపదే సంతకాలు పెట్టి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 2021–22లో శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను కేసీఆర్ ఏపీకి రాసిచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూరాల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీటిని శ్రీశైలంలో కలిపి ఏపీ జలదోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేశాడు.మూతి దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకోవాలని చూశాడు. లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ఇదంతా చేశాడు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణాపై పూర్తికాని పరిస్థితి. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నారాయణపేట– కొడంగల్, డిండి, ఎస్సెల్బీసీల్లో ఒక్క ప్రాజెక్టునయినా పదేళ్లలో పూర్తి చేశాడా? మేం వచి్చన తర్వాత రూ.6,800 కోట్ల విలువైన పనులను కృష్ణాపై సాగునీటి ప్రాజెక్టుల కోసం చేశాం. తేలు కుట్టిన దొంగలా.. మేం వచ్చిన తర్వాతే కృష్ణా జలాల్లో 71 శాతం వాటా అడిగాం. ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నదే మేము. పైగా తానే నీళ్లకు నడక నేరి్పనట్టు ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతాం. ట్రిబ్యునల్‌లో స్వయంగా మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాడు.పదేపదే జలశక్తి మంత్రిని కలుస్తున్నారు. కేంద్రం చేయకపోతే అంతా ఎడారిగా మారిపోదు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో చేసిన ద్రోహానికి కేసీఆర్ సమా«ధానం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలి. ఈ ద్రోహిని నిలదీద్దామని సభకు రమ్మంటే తేలు కుట్టిన దొంగలా తప్పించుకుంటున్నాడు. సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చి అసలు ఊరుకునేదే లేదంటూ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీకి రావడంలేదు.. అసెంబ్లీలో కృష్ణాకు ఒకరోజు, గోదావరి ఒకరోజు కేటాయించి చర్చ చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నా... ఆయన్ను రమ్మనండి. లేదంటే రెండు రోజుల చొప్పున చర్చిద్దామన్నా ఓకే. ఆయన అబద్ధాలు చెపుతున్నాడు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రండని అడుగుతున్నా.. రాకుండా కేసీఆర్ పారిపోవడంలో ఉద్దేశమేంటి? ఆయనకు అధికారం కోసం వ్యామోహం తప్ప తెలంగాణ ప్రజలపై అభిమానం లేదు. అందుకే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. సభలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోమని నేను హామీ ఇస్తున్నా. అలా ఎవరైనా భంగం కలిగించినా చర్యలు తీసుకోమని నేనే చెబుతా. ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు. కొడుకు, అల్లుడి పంచాయతీ తీర్చేందుకు వచ్చాడు. కొడుకు దగ్గరి నుంచి అల్లుడు పార్టీని గుంజుకుంటాడేమోనని, దేనికీ చెల్లనోడు అల్లుడి చేతిలో పార్టీ పెడతాడేమోనని, కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టు వచ్చాడు. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడే కొడుకు కుర్చీ కోసం ప్రయతి్నంచాడు. ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు. ఇప్పుడు అల్లుడు సావు కోరుకుంటున్నాడు.ఆయన పోతే అల్లుడికి పార్టీ వస్తదని అనుకుంటున్నాడు. నాకేమి వస్తుంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆయన కింద పడి కాలువిరిగితే మొదట పరామర్శించిందే నేను. అర్ధరాత్రి ఆంబులెన్సు పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిందే నేను. కానీ ఆయన అల్లుడు, కొడుకే పోటీలుపడి ఆయన్ను ఫామ్‌హౌజ్‌లో నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలతో ఇబ్బంది లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం ఉంది. నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వయసుకు తగ్గట్టు లేవు. ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపుచెక్కతో కొట్టగలను. అల్లుడు కాపలా కాసుకుని ఉన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది మేం కాదు. ఆయన కొడుకు, అల్లుడే. కేటీఆర్ ఐరన్‌లెగ్ అని చెప్పి పార్టీని గుంజుకుంటే ఉన్న పళంగా హరీశ్‌రావుకు రూ.5వేల కోట్ల ఆస్తి వస్తుంది. రూ.1,500 కోట్ల పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు, రూ.3,500 కోట్ల విలువైన పార్టీ ఆస్తులు రాత్రికి రాత్రి ఆయన హస్తగతమవుతాయి. నేను చెప్పేది కనపడే ఆస్తుల గురించే. కనిపించని వజ్రాలు, వైఢూర్యాల గురించి కాదు. నేను కోటి మంది మహిళలకు సారె పెడితే కేటీఆర్ ఉన్న చెల్లిని ఇంటి నుంచి పంపించేశాడు. ప్రతి దగ్గర బాంబులు పెట్టారనడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పులు చేసి గుల్ల చేశారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశాడు. 11.9 శాతం వడ్డీకి అప్పులు తెచ్చాడు. సంసారం చేసేటోడెవడైనా అంత వడ్డీకి అప్పులు తెస్తాడా? కేసీఆర్, ఆయన కుమారుడు కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. మేం వచ్చిన తర్వాత ఒక్కోక్కటి సరిదిద్దుతున్నాం. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లు అప్పులను రీస్ట్రక్చర్ చేశాం. మరో 85వేల కోట్ల కోసం ప్రయతి్నస్తున్నాం. ప్రధాని మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీయగానే కేసీఆర్ సంతోషపడుతున్నాడు. ఫార్ములా ఈ–రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఇదే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సర్వభ్రష్ట సర్కారు
గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు? మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. సాక్షి, హైదరాబాద్: ‘క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్న రాష్ట్రంలో ప్రజలను అబద్ధపు హామీలతో మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. మాయమాటలతో అర్రాజ్ పాటలు పాడి చాంతాడంత హామీలు ఇవ్వడంతో ప్రజలు టెంప్ట్ అయ్యా రు. వంద శాతం సమ్మిళిత అభివృద్ధితో ముందుకు సాగుతున్న తెలంగాణలో బాండు పేపర్లు, గ్యారంటీ కార్డులు అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు శఠగోపం పెట్టారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలదోపిడీ, పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా స్పందించడం లేదు. కిరికిరి మాటలతో, కారు కూతలతో ప్రభుత్వం నడుపుతామంటే కుదరదు.మాది తెలంగాణ తెచి్చన పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా మా విధి మేము నిర్వర్తించాలి. సర్కారుకు సరిపడినంత సమయం ఇచ్చాం. ఇవాళ్టి వరకు వేరు, రేపటి నుంచి వేరే.. తోలు తీస్తాం.. అందుకోసం నేను రంగంలోకి దిగుతున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నాలుగు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొట్టి కార్యాచరణ ప్రకటిస్తాం.ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని ఎండగడ™తాం. కవులు, కళాకారులను తట్టి లేపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తాం. ఈ సభలకు నేను స్వయంగా హాజరవుతా..’ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, ఇతర కీలక నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రెండేళ్లుగా గమనిస్తున్నాం.. ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ని్రష్కియా పరత్వం, కేంద్రం వ్యతిరేకిస్తున్న తీరును రెండేళ్లుగా గమనిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన బీఆర్ఎస్..తెలంగాణ హక్కులకు ఒక్క నొక్కు పడినా, ఒక్క చుక్క నష్టం జరిగినా సహించేది లేదు. తెలంగాణకు శనిలా బీజేపీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఒత్తిడితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను వెనక్కి పంపారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర ప్రధాన అనుమతులు సాధించినా బీజేపీ దిగజారి తెలంగాణకు శనిలా మారింది. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపి ఆగం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా పెదవులు మూసుకుంది.మైనర్ ఇరిగేషన్ నష్టాలు, ఏపీ పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో తెలంగాణకు దక్కిన 45 టీఎంసీలను కలుపుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించాం. కానీ నీటిపారుదల శాఖ మంత్రి 45 టీఎంసీలు చాలని లేఖ రాశారు. గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో ఏపీ వదులుకున్న జలాలను ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర వాడుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోంది. రెండేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టెడు తీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా, కమీషన్లు కొట్టడం తప్ప వేరే పనిలేదా?..’ అని కేసీఆర్ మండిపడ్డారు. మేం పెండింగు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. ‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోలుకోలేని రీతిలో దెబ్బతింది. నాటి సీఎం చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకున్నా జూరాలలో ముంపునకు గురైన కర్ణాటక భూమికి రూ.13 కోట్లు పరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై దేవునూరు, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలో అన్యాయం చేసిన రీతిలోనే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం చేశారు. 17 టీఎంసీలతో మంజూరైన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల తరబడి కనీసం ఫౌండేషన్‌కు నోచుకోలేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత.. చంద్రబాబు మోకాళ్ల మీద పరుగెత్తి పరిహారం చెల్లించడంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు సాగులోకి వచి్చంది.రాజోలిబండ మళ్లింపు పథకం కోసం ఆలంపూర్, గద్వాల వరకు పాదయాత్ర చేశా. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణా ప్రవహిస్తున్నా నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి తదితర పథకాలను పెండింగులో పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 170కి పైగా టీఎంసీలు తీసుకోవాలనే వ్యూహంతో తొలుత 90.81 టీఎంసీలు కేటాయించాం. అనేక అవాంతరాలు ఎదురైనా అనుమతులు సాధించాం. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశాం..’ అని బీఆర్ఎస్ అధినేత వెల్లడించారు. హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు ‘బిజినెస్ మీట్ల పేరిట హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు. ఏపీలో చంద్రబాబు హోటల్లో పనిచేసే వంట మనుషులతో ఎంఓయూలపై సంతకాలు పెట్టించారు. ఆయన చెప్పిన లెక్కలు నిజమైతే ఈ పాటికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. ఒప్పందాలు నిజమైతే కనీసం రూ.10 వేల కోట్లయినా రావాలి కదా. గతంలో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు భోపాల్‌కు వెళ్లిన సందర్భంలో ప్రధాని మోదీ సమక్షంలో కుదిరిన రూ.14 లక్షల కోట్ల ఎంఓయూలు బోగస్ అని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. పెట్టుబడులపై అబద్ధపు ప్రకటనలు, ఒప్పందాలతో ప్రజలను మోసం చేయడం ఎందుకు?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ‘ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ముచ్చర్లలో మేం 14 వేల ఎకరాలు సేకరించాం. పర్యావరణ అనుమతులు కూడా సాధించి ముందుకు సాగుతున్న క్రమంలో ప్రభుత్వం మారింది. కానీ ఫ్యూచర్ సిటీ పేరిట భూములను అమ్ముకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాకు తెరలేపారు. గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అమ్ముకునేందుకు ఉత్సాహం చూపుతోంది.వంతారాకు 3 వేల ఎకరాలు, జూపార్కు తరలింపు భూముల అమ్మకం కోసమేనా? గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంత కాలం వంచిస్తారు? యాప్ ద్వారా యూరియా అంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. అడ్డమైన హామీలు ఇచ్చి రైతులు, పేదలు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులను ఏడిపిస్తున్నారు. సందర్భం ఏదైనా కేసీఆర్ చనిపోవాలి అంటూ మాట్లాడటం కరెక్టేనా?..’ అని కేసీఆర్ నిలదీశారు. -
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, కృష్ణా జాలాలపై ఒక రోజు, గోదావరి జలాలపై మరో రోజు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21 వ తేదీ) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరేనన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఆయనే దెబ్బ తీశారన్నారు. కేసీఆర్ వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను చూపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో 36 శాతం వాటా అంగీకరించింది కేసీఆర్ మాత్రమేనని, 71 శాతం వాటా కోసం తాము పోరాడుతున్నామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు.ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం.రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పింది.గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు -
‘కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా?’
హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనపై రాష్ట్రంలోని మా రెండేళ్ల పాలనై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరాఉ. రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌రెడ్డి మోకాలు అడ్డుతున్నారని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణలను కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని మహేష్‌గౌడ్ మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలను నెరవేర్చామన్నారు మహేష్‌గౌడ్.కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమే..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్, హరీష్ చేసిన తప్పిదాల వల్లే నదీజాలల సమస్యలు వచ్చాయన్నారు. వృథా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ అనవరసరప ఖర్చు చేశాడని, తామ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటన్నామన్నారు. అప్పులపై కేసీఆర్ ఏం సంజాయిషీ ఇస్తారో చూద్దామన్నారు. ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 70 శాతం సీట్లు గెలిచామని, మరి బీఆర్ఎస్ ఎక్కడుంది?అని ప్రశ్నించారు మహేష్ గౌడ్. -
పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తెలిసేది: కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అధ్యక్షుడు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తనను దూషించడం, అవమానించడమేనని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిందన్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తేలేదన్నారు కేసీఆర్.‘గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదు. ఉన్న పథకాలు కూడా ఆపేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఈ ప్రభుత్వ పాలసీ. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. తెలంగాణలో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. మా హయాంలో రైతుల ఇంటికే యూరియా వచ్చేది’ అని తెలిపారు కేసీఆర్.ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాను,ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోంది. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేస్తోంది. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఏదైనా ఉంటుందా?అని కేసీఆర్ నిలదీశారు. -
సోనియా గాంధీకి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను అభినందిస్తున్న సోనియాగాంధీ. ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకున్నారా? అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్యారెంటీలు, హామీల అమలు వదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ లేఖలో దుయ్యబట్టారు.‘‘తెలంగాణ అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్‌తో కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను గాలికి వదిలేశారా? 420 హామీలను మూసినదిలో కలిపేశారా? గతంలో ఇచ్చిన హామీలపై నిలబడాలి. లేదంటే ప్రజల ఆగ్రహం మీ పాలిట భస్మాసుర హస్తమవుతుంది. గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. మోసానికి పాల్పడితే గుణపాఠం తప్పదు’’ అంటూ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్లో నేడు(ఆదివారం, డిసెంబర్ 21) ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు. ఇవాళ జరగబోయే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు చెబుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని బీఆర్ఎస్ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయ్యిందని బీఆర్ఎస్ బలంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ భేటీని పార్టీ కీలకంగా భావిస్తోందని సమాచారం. -
రేవంత్ హనీమూన్ ముగిసింది
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఆయన పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల్లోకి వెళ్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ కీలక నేతల సమావేశంలో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు సహా పలు అంశాలపై మాట్లాడారు. రేవంత్ ఇంటిని బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు ‘కాంగ్రెస్, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందం ఉంది, రేవంత్ ఓ కాలు కాంగ్రెస్‌లో మరో కాలు బీజేపీలో ఉంది. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులో రేవంత్ ఇల్లును ఓ బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహ ప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లాడో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు చెప్పాలి. సీఎం రమేశ్ వంటి వారికి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బీజేపీ ఆయనకు అండగా నిలుస్తోంది. అఖిలేశ్ యాదవ్‌తో నా దోస్తీపై రామచందర్‌రావుకు బాధ ఎందుకు? పంచాయతీ ఎన్నికల ఫలితాల దెబ్బతో ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి.గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా జరిగింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ ఆలోచన. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయడం వంటి ప్రయోగాల జోలికి కేంద్రం వెళ్లకపోవచ్చు. ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి ప్రయోగాలు ఫలించవు..’అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నామనడం కామెడీ ‘కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన కడియం బీఆర్ఎస్లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఆ ఎమ్మెల్యేలు చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రేవంత్ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్ కాలేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఏడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. ఫార్ములా ఈ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు డొల్ల అని రేవంత్‌కు అర్ధమైంది. ఆయన పాలన వైఫల్యాలకు ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక. రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా.. రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా. ఆయన మాదిరిగా కుటుంబసభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. ఇంట్లోని పిల్లలు, మహిళలు, మనవడి గురించి మాట్లాడను..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.లైన్లు దాచేందుకే యూరియా యాప్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజంసాక్షి, హైదరాబాద్: యూరియా కోసం రైతులు బారులు తీరే దృశ్యాలను దాచి పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్ విధానం తెస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనాన్ని బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచి పెట్టేందుకు కొత్తగా రైతు వ్యతిరేక విధానం తెస్తోందన్నారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతుదారులను తెలంగాణ భవన్లో శనివారం కేటీఆర్ సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల అవసరాల మేరకు వెంటనే యూరియాను సరఫరా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యాప్‌ల పేరిట రైతులకు కొత్తగా సమస్యలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి సొంత ఆస్తి కాదని, ప్రజల సొమ్ముకు నాయకులు ధర్మకర్తలు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీకి వచ్చే నిధులపై సర్పంచ్‌లు, పంచాయతీ పాలక మండలికి మాత్రమే సంపూర్ణ అధికారం ఉంటుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజా అవసరాలకు నిధులను ఖర్చు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ కీలక నేతల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షంతో పాటు పార్టీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు తదితరులు కలిపి మొత్తంగా సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పార్టీ సమావేశానికి హాజరు కానుండటం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రమే కేసీఆర్ దంపతులు ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరుల స్తూపం, జయశంకర్ విగ్రహానికి నివాళి అరి్పంచిన అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. ఏపీ జల దోపిడీపై పోరుబాట రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఏపీ జలదోపిడీపై పోరుబాటకు ఆదివారం జరిగే సమావేశంలో కేసీఆర్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన కరివెన రిజర్వాయర్ వద్ద ఈ సభ నిర్వహించే అవకాశముంది. అలాగే నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం జల దోపిడీ కోసం చేస్తున్న కుట్రలపైనా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపైనా క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పోరాట రూపాలపైనా ఈ సమావేశంలో చర్చించి కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశముందని అంటున్నారు. కవిత ఎపిసోడ్ సహా ఇతర అంశాలపై? పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘జనం బాట’పేరిట జిల్లా పర్యటనల్లో పార్టీ కీలక నేతలు లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత కుమార్తె కవిత అంశంలో కేసీఆర్ స్పందిస్తారా అనే ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వ నిర్ణయం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి అంశాలు ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది.ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ తదితర అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే కోణంలోనూ దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడంపై కూడా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌పై స్పష్టత ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. -
బీఆర్ఎస్ హయాంలో జల వివాదాలపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరున లేదా జనవరి తొలివారంలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో జలవివాదాలు–వాస్తవాలు అనే అంశంపై రోజంతా చర్చ జరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అధికారులు నివేదికతో సిద్ధంగా ఉండాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉతమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) మొహమ్మద్ అంజాద్ హుస్సేన్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ కె.ప్రసాద్‌తో సమీక్షించారు.తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదలశాఖలో తీసుకున్న నిర్ణయాలతో కలిగిన నష్టాలపై నివేదిక ఉండాలన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ కట్టకుండా మేడిగడ్డకు తరలించడం వల్ల కలిగిన నష్టాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. కాళేశ్వరం బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిన అంశాలను నివేదికలో చేర్చాలని సూచించారు.ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో రాష్ట్ర అవతరణ అనంతరం ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 290 టీఎంసీలు చాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించిన విషయాన్ని కూడా చేర్చాలని నిర్దేశించారు. పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీతోపాటు కృష్ణా బేసిన్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని కూడా నివేదికలో పేర్కొనాలని మంత్రి ఉత్తమ్ నిర్దేశించారు. ‘బేసిన్లు లేవు... భేషజాలు లేవు’అంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలతోపాటు నాడు ఏపీ సర్కార్‌తో జరిగిన చర్చలన్నీ నివేదికలో రికార్డు కావాలన్నారు. -
ఈ బుకాయింపు ఆత్మవంచన కాదా?
గజం మిథ్య ,పలాయనం మిథ్య అని అంటారు. అందరూ శ్రీవైష్ణవులే.. రొయ్యల బుట్ట మాయం అని మరో సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభాపతి గడ్డం ప్రసాదకుమార్ ఇచ్చిన తీర్పును గమనిస్తే ఈ సామెతలు గుర్తుకు వస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పవర్ వైపు నడిచే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి మళ్లారు. వారిలో పలువురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పీ మరీ ఆహ్వానించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. అందరికి తెలిసిన ఈ సత్యం స్పీకర్‌కు తెలియకపోవడమే ఒక ప్రత్యేకత . ఆయనకు మాత్రం వీరు పార్టీ మారిన ఆధారాలు కనిపించలేదు. వారిపై అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పక్షాన లోక్ సభ ఎన్నికలలో పోటీచేశారు. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందించలేదు. బహుశా మరికొంతకాలం ఈ విచారణ తంతు సాగుతుందేమో తెలియదు. లేదా మరీ ఓపెన్ అయిపోయినందున కొద్ది కాలం తర్వాత ఆయన రాజీనామా చేస్తారా?లేక తప్పనిస్థితిలో అనర్హత వేటు వేస్తారా?అన్నది చూడాలి. మరో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకుని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యం. మాజీ స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు అయ్యారు. ఈయన విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహీపాల్ రెడ్డి అరికపూడి గాంధీలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయనవసరం లేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు యాదయ్య,సంజయ్ కుమార్ లపై కూడా నిర్ణయం రావల్సి ఉంది. దానం నాగేందర్ తప్ప మిగిలిన ఎమ్ఎల్యేలంతా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాదించారు. ఈ పదిమంది ఎ మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి గత ఏడాదిన్నరగా పోరాడుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ,జాప్యం చేస్తున్నారని హైకోర్టు ,సుప్రింకోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి సుప్రింకోర్టు మూడు నెలలలో దీనిపై తేల్చాలని స్పీకర్ ను ఆదేశించడంతో ఈ నిర్ణయం అయినా వెలువడింది. న్యాయ వ్యవస్త ఈ మాత్రం అయినా పట్టించుకోకపోతే ,ఈ తంతగం ఐదేళ్లపాటు సాగుతుండేది.ఇలా జరగడం మొదటిసారి కాదన్నది వాస్తవమే. బీఆర్ఎస్ కు ఈ విషయంలో అర్హత లేదన్న కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చలేం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తో సహా వివిధ విపక్షాల ఎమ్మెల్యేలు 38 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పట్లో ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుత సి.ఎమ్. రేవంత్ కూడా అదే పనిచేశారు. విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రేవంత్ తదితరులు న్యాయ పోరాటం చేశారు.కాని అది కొలిక్కి రాకుండానే ఎన్నికలు వచ్చే శాయి. ఒక చిన్న తేడా ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని,ఇతర పక్షాలను బీఆర్ఎస్ విలీనం చేసినట్లు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ విడత విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇద్దరు అనారోగ్యంతో మరణించారు.మిగిలినవారిలో పది మందే పార్టీ మారారు. అందువల్ల విలీన ప్రకటనకు అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు ఐదువేల చొప్పున శాసనసభ పక్షానికి విరాళం ఇస్తుంటే దానిని ఆ పార్టీ అంగీకరించిందని,అందువల్ల వారు బీఆర్ఎస్ వారే అనే చిత్రమైన కొత్త లాజిక్ ను రేవంత్ తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ ఫిరాయింపులన్నవి ఒక సమస్యగా మారింది. బీజేపీ కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసింది.అదే టైమ్ లో రాజ్యసభలో టీడీపీ ఎమ్.పిలు నలుగురిని బీజేపీలో విలీనం చేసుకుంది. ఇది కూడా అనైతికమే అయినా అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత, దివంగత శరద్ యాదవ్ ఒక సభలో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనపై అతి వేగంగా వెంకయ్య అనర్హత వేటు వేశారు. ప్రభుత్వపక్షం నుంచి ఎవరైనా పార్టీ మారితే మాత్రం అధ్యక్ష స్థానంలో ఉన్నారు అలా స్పందిస్తారన్నమాట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వ పక్షంలోకి వస్తే ఇలాంటి విచారణలు,తీర్పులు వస్తుంటాయని అనుకోవాలి. వైఎస్సార్సీపీ ఎమ్.పి రఘురామకీష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాను పదే,పదే కోరినా, కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేశారేకాని అనర్హత వేటు వేయలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తుంటుంది.ఏపీలో చంద్రబాబు నాయుడు గత టరమ్ లో వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా న లుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎవరిపై చర్య తీసుకోలేదు. కెసిఆర్ కూడా తొలి టరమ్ లో తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీలో ఉండగానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అయినా వీరిలో ఎవరికి ఏమీ కాలేదు. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజలకు నీతి వచనాలు చెప్పవలసిన ప్రజాప్రతినిధులు తామే అబద్దాలు చెబుతూ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ అప్రతిష్టపాలు అవడానికి సిద్దపడుతున్నారు తప్ప రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజివ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుల నిరోదక చట్టం వచ్చింది.ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు ఆయన కుమారుడైన లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ తదితరులకు కూడా తెలుసు.అయినా వారు కూడా దీనిని ఆపడం లేదు.దాంతో కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు కోల్పోతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకే పనిచేస్తున్నారని,తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిజెపి,బీఆర్ఎస్ లు విమర్శించాయి. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తప్ప నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండడం లేదు.ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి,జి.నారాయణరావు వంటి గట్టి స్పీకర్ లు ఉండేవారు.అవసరమైతే వారు ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి కూడా ఆదేశాలు ఇవ్వడానికి వెనుకాడేవారు. చాలావరకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది.గతంలో కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన కేసులో వారిపై అనర్హత వేటు వేశారు. కాకపోతే విచారణ పేరుతో ఆలస్యం చేశారన్న విమర్శ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యేలపై సకాలంలో అనర్హత వేటు వేయకుండా ఉప ఎన్నికలు రాకుండా చేశారన్న విమర్శ ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి,పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఈ విషయాలలో వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మినహాయింపు ఇవ్వాలి. ఆయన కాంగ్రెస్ ను వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్న తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేసి మళ్లీ గెలిచారు. అలాగే తన పార్టీలోకి రాదలచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారే తప్ప, అనైతికంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయం పాటించేవారు అరుదుగానే ఉంటున్నారని చెప్పాలి. ఈ ఫిరాయింపులకు పరిష్కారం వెదకవలసి ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణ రాగానే మూడు నెలలు లేదా ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. లేదా ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకునేలా అధికారం ఇవ్వాలన్న సూచన ఉన్నప్పటికీ, అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే వింటోందన్న విమర్శలు ఉన్నాయి.ఏది ఏమైనా ఈ ఫిరాయింపుల సమస్యవల్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలలో పలచన అవుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే తన అనర్హత పిటిషన్ ను కొట్టివేశాక ఒక వ్యాఖ్య చేశారు. పాలకు,పాలు, నీళ్ళకు నీళ్లు మాదిరి తేలిందని అన్నారు. కాని వాస్తవం వేరు. పాలల్లో నీళ్లు కలిశాయన్నది వాస్తవం. కండువా కప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. దానిని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం అంటే అది ఆత్మవంచన కాకుండా మరేమవుతుంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సర్పంచ్ ఎన్నికలు.. 18 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపు విజయం సాధించారు. అయితే, పంచాయతీ ఎన్నికలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలు జిల్లాల నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయమై సీఎం రేవంత్ సహా నేతలు సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రెబల్స్‌ను బుజ్జగించకపోవడం.. సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్ అయినట్టు తెలిసింది. కాగా, భవిష్యత్‌లో ఇది రిపీట్ అయితే ఉరుకునేది లేదని సీఎం రవంత్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు.. ఎల్లుండి మధ్యాహ్నం పీసీసీ ఛీఫ్, మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నేతలు విశ్లేషించుకోనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.హస్తం జోరు.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. మూడు విడతల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, రెండో దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మూడో విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. మూడో విడతలో 4,159 స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీ 242 స్థానాల్లో, సీపీఐ 24, సీపీఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు.రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు గాను.. తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. మూడో విడతలో అత్యధికంగా 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30 శాతంగా నమోదైంది. -
కాంగ్రెస్ ఉంటే.. ప్రోగ్రెస్ ఉండదు
సిరిసిల్ల: కాంగ్రెస్ ఉంటే.. ప్రోగ్రెస్ ఉండదని.. రెండేళ్లలో ఒక్క పనైనా చేశారా? వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ కేసీఆరే సీఎం అని.. ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్‌లో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న ఆ పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.అప్పుడు ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయిస్తారని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. ‘హైదరాబాద్ ప్రెస్మీట్లో రేవంత్‌రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని వివరించారు.పచ్చి అబద్ధాలు ఆడుతున్నారుఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు కేవలం గడ్డిపోచ లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పారు. ‘బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, ఢిల్లీలో రాహుల్‌గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయి’అని మండిపడ్డారు. సీఎం ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారురైతులు, మహిళలు, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో 117 పంచాయతీలకు 80 చోట్ల బీఆర్ఎస్ గెలవడమే దీనికి నిదర్శనమన్నారు. సీఎం, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కొత్త కమిటీలు వేస్తాంకాంగ్రెస్ బెదిరింపులు, ఫోన్‌కాల్స్‌కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలని, వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటామని తెలిపారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
పేరులో ‘రామ్’తోనే కాంగ్రెస్ పరేషాన్
నిర్మల్: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన అర్థరహితమని, కొత్త పేరులో ‘రామ్’ అనే పదం ఉన్నందునే ఆ పార్టీ అభ్యంతరం చెబుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరో పించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులను నిర్మల్‌లో శుక్రవారం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో వందరోజులు మాత్రమే ఉన్న ఉపాధిహామీ పథ కాన్ని కేంద్రం 125 రోజులకు పెంచిందన్నారు.ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను వికసిత్ భారత్–జీ రామ్‌జీగా మార్చడంతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఉపాధి పథకం కొత్తపేరులో ‘రామ్’ అనే పదం ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఆ పార్టీలో ఉన్నది నిజమైన గాంధీలు కాదని విమర్శించారు. కేవలం పేరుకు మాత్రమే గాంధీ అని పెట్టుకున్నా రని, ప్రేమ ఏమాత్రమూ లేదని ఆరోపించారు.అందుకే.. అఖిలేశ్ వాళ్లని కలిశారుకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని రాంచందర్‌రావు ఆరోపించారు. అందుకే ఇటీవల సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ను కలిశారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వి నియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాల్వాయి హరీశ్‌బాబు పాల్గొన్నారు.


