రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు | BCCI Punishes RR Captain Riyan Parag For Vaping In Dressing Room | Sakshi
Sakshi News home page

రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

Apr 30 2026 3:37 PM | Updated on Apr 30 2026 4:00 PM

BCCI Punishes RR Captain Riyan Parag For Vaping In Dressing Room

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రవర్తించిన తీరుకు జరిమానాతో సరిపెట్టింది. కాగా ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన రియాన్‌ పరాగ్‌.. సారథిగా ఆకట్టుకుంటున్నాడు.

ఇ–సిగరెట్‌తో పొగ పీల్చి..
పరాగ్‌ కెప్టెన్సీలో రాజస్తాన్‌ ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. అయితే, పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా పరాగ్‌ (Riyan Parag) ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో డ్రెసింగ్‌ రూమ్‌లో ఉన్న రియాన్‌ పరాగ్‌ ‘వేపింగ్‌’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేశాడు.

భారత్‌లో నిషేధం
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి. నిజానికి ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్‌లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది. అలాంటి ఐపీఎల్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కెప్టెన్‌ స్థాయిలో ఉండి పరాగ్‌ నిబంధనలు అతిక్రమించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో బీసీసీఐ రియాన్‌ పరాగ్‌పై వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఓ జర్నలిస్టు మాత్రం అతడు చేసిన తప్పునకు విధించే శిక్ష విషయంలో ఐపీఎల్‌ నియమాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది.

మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత
రియాన్‌ పరాగ్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. క్రమశిక్షణారాహిత్యం కింద అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.21 కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఆర్టికల్‌ ప్రకారం.. టోర్నీ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటారు.

ఇదిలా ఉంటే.. వేపింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ ఈమేరకు అతిక్రమనకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి.

చదవండి: IPL 2026: క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?

Advertisement
 
Advertisement
Advertisement