లాస్ ఏంజెలిస్: మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్‌లో జరగబోయే 2028 ఒలింపిక్స్‌లో ఆరంభోత్సవానికి ముందే ఫుట్‌బాల్ పోటీలు మొదలు కానున్నాయి. అమెరికాలోని ఏడు నగరాల్లోని మైదానాల్లో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. విశ్వక్రీడల వేడుకలకు ముందే పోటీలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.
ఈ ముందస్తు నిర్వహణతో లీగ్ దశ, నాకౌట్ దశ ఇలా మ్యాచ్ మ్యాచ్‌కు మధ్య కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని ఫుట్‌బాల్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2028, జూలై 10న లీగ్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. అనంతరం న్యూయార్క్ సహా కొలంబస్, ఒహాయో, నష్‌విల్లే, టెన్నెస్సీ, సెయింట్ లూసియాల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
మిగతా నాకౌట్ పోటీలు కాలిఫోర్నియాలో, ఫైనల్ పోరు చారిత్రక రోజ్ బౌల్ స్టేడియంలో జరుగనుంది. ఈ రోజ్‌బౌల్ వేదికపైనే 1984 ఒలింపిక్ స్వర్ణ పతక పోరు జరిగింది. అనంతరం 1994 పురుషుల ప్రపంచకప్ ఫైనల్, 1999 మహిళల ప్రపంచకప్ టైటిల్ పోరు కూడా జరిగాయి.
మెక్సికోలో ఇరాన్ మ్యాచ్‌లు?
మెక్సికో సిటీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అయితే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధకాండతో అమెరికాలో ఇరాన్ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని ఇదివరకే స్పష్టం చేసింది.
దీంతో అమెరికాలో నిర్వహించాల్సిన ఇరాన్ మ్యాచ్‌ల్ని మెక్సికోకు తరలించాల్సిందిగా ‘ఫిఫా’తో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు మెక్సికోలోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఫిఫా’ మాత్రం ఈ సంప్రదింపులపై తక్షణం స్పందించేందుకు నిరాకరించింది.


