క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ వరల్డ్ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్ మహమ్మద్ ఇజార్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజార్‌ను తక్కువగా అంచనా వేయొద్దని బ్యాటర్లను పఠాన్ హెచ్చరించాడు.
కాగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో బిహార్‌కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇజార్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఇజార్.. దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై వంటి పెద్ద ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది.
"ముంబై ఇండియన్స్‌లో ఇప్పటికే ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వంటి ప్రధాన పేసర్లు ఉన్నారు. ఇప్పుడు మహ్మద్ ఇజార్ రూపంలో మరో పేస్ సంచలనం ముంబై జట్టులోకి వచ్చాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇజార్ 'బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్' స్లోయర్ డెలివరీలు అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.
అతడి బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇజార్ 135 కిలోమీటర్ల వేగంతో షార్ట్ బాల్స్, ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలు కూడా సంధించగలడు. ముఖ్యంగా స్లో బాల్స్ వేయడం అతడి స్పెషాలిటీ. ఆ బంతులతో ఎలాంటి బ్యాటర్‌నైనా అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు.
గతసీజన్‌లో యువ పేసర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి అందరి దృష్టి అతడిపై ఉంటుంది. కానీ ఇజార్‌ను కూడా తక్కువ అంచనా వేయకండి" అని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్‌లలో పేర్కొన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.
చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్


