కర్నూలు: జాతీయ లోక్ అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 40,921 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆధ్వర్యంలో శనివారం రెండు జిల్లాల్లో 25 బెంచ్‌లను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు, 40,232 క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఇందులో 186 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.12,83,49,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజినమ్మ, జూనియర్ సివిల్ జడ్జిలు కిరణ్ కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడు పాల్గొన్నారు.
రైతు త్యాగం మరువరానిది
తమ వ్యవసాయ భూములను ప్రాజెక్టు నీటి మునకకు అప్పజెప్పి రైతులు చేసిన త్యాగం మరువరానిదని, వారికి ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఎంత ఇచ్చినా తక్కువేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన 190 మంది రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపు రూ.81 లక్షల పరిహారం చెక్కుల ద్వారా అందించారు. ఈసారి ఆదోని, ఎమ్మిగనూరు కోర్టుల్లో పదేళ్ల నాటి పెండింగ్ కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు.


