కర్నూలు (టౌన్): ప్రత్యేక అవసరాలు కలిగిన మహిళలు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఎంపవర్‌మెంట్ ఆఫ్ డెఫ్ ఉమెన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మహిళా సమాన అవకాశాలతో ముందుకు రావాలన్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకొని రాణించాలన్నారు. మహిళలు తమ హక్కులు తెలుసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. డెఫ్ సంస్థలు సత్యవాణి, సయ్యద్ గౌస్ పాషా, సుబాల్ బాషా, తేజస్విని, ధరణీకుమారి, లక్ష్మీ, షేక్ రిజ్వానా బేగమ్, తేజేశ్వరి, సౌజన్య, సుబ్బమ్మ, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
నెలాఖరు వరకే ఎస్సార్బీసీకి నీటి విడుదల
పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈ నెలాఖరు వరకు నీటి విడుదల ఉంటుందని ఈఈ కిష్టన్న తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎస్సార్బీసీ ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రసుత్తం గోరుకుల్ల జలాశయంలో 5.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఎక్కడా నీటిని వృథా చేయరాదన్నారు. ఈనెల చివరి నాటికి గోరుకల్లు వద్ద నీటిని నిలిపివేస్తామన్నారు. ఈ విషయాన్ని ఆయా బ్లాక్ కింద సాగు చేసుకునే రైతులు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమాచారం అందిస్తామన్నారు.


